చర్చకు బదులు రచ్చ చేశారు : అవినాష్‌ రెడ్డి

4 Mar, 2018 20:21 IST|Sakshi

సాక్షి, పులివెందుల : తెలుగుదేశం నేతలు చర్చకు బదులు రచ్చ చేశారని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి మండిపడ్డారు. చర్చ జరగాలన్న ఉద్దేశం సతీష్‌ రెడ్డికి లేదని అందుకే చర్చ పేరుతో రచ్చ చేశారని అన్నారు. టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పపడినా తాను, తమ పార్టీ కార్యకర్తలు చట్టాన్ని గౌరవించి సంయమనం పాటించామని తెలిపారు. అంతేకాకుండా పోలీసుల వైఖరిని అవినాష్‌ రెడ్డి తప్పుపట్టారు.  వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయం ముందు వందలాది మంది పోలీసులను మొహరించారని, కానీ తెలుగుదేశం కార్యాలయం వద్ద ఎందుకు పోలీసులను పెట్టలేదని ప్రశ్నించారు.

తెలుగుదేశం నేతలు ప్లాన్‌ ప్రకారం దాడికి  పాల్పడ్డారని, అధికారం అండతో రాళ్లతో జరిపిన దాడుల్లో పార్టీ కార్యకర్తలతో పాటు, ఓ ఎస్‌ఐకి కుడా గాయాలయ్యాయని తెలిపారు. తమ అధినేత, పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి వస్తున్న ఆదరణ ఓర్వలేక పోతున్నారని అందుకే పులివెందులలో రచ్చ చేయాలని టీడీపీ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. రాళ్లతో, కర్రలతో  దాడులకు దిగిన తెలుగుదేశం నేతలు వైఎస్‌ఆర్‌సీపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

తాము తెలుగుదేశం నేతల్లా కాదని, చట్టాలపై గౌరవం ఉందని, పార్టీ నేతల కార్యకర్తలు చట్టాన్ని గౌరవిస్తారని ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పేర్కొన్నారు.  జిల్లా ఎస్పీ తమ దగ్గరకు వచ్చి శాంతియుత వాతావరణ నెలకొల్పేందుకు సహకరించమని కోరితే వెంటనే అంగీకరించామని  తెలిపారు. పులివెందుల అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. పులివెందులకు వైఎస్సార్‌ ఏం చేశారో చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. కుంటి సాకులు చెప్పకుండా టీడీపీ నాయకులు ఏం చేశారో చర్చకు రావాలన్నారు. ఫలప్రదమైన చర్చ జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు