కన్నాపై దాడికి యత్నం

29 Jun, 2018 04:41 IST|Sakshi
టీడీపీ కండువాను దహనం చేస్తున్న బీజేపీ నేతలు (ఇన్‌సెట్‌లో) మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ

అతిథి గృహంలోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై దాడి.. 

గెస్ట్‌హౌస్‌ అద్దాలు ధ్వంసం

ప్రతిదాడికి దిగిన బీజేపీ కార్యకర్తలు.. 

చేతులెత్తేసిన పోలీసులు.. ఇరువర్గాల మధ్య ఘర్షణ

పోలీసుల అండతో తనను చంపేందుకు కుట్ర పన్నారని కన్నా ఆరోపణ  

సాక్షి ప్రతినిధి, అనంతపురం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడికి యత్నించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అనంతపురానికి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ బుధవారం ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో బస చేశారు. గురువారం ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించాల్సి ఉంది. సరిగ్గా అదే సమయానికి టీడీపీ అనుబంధ సంఘమైన తెలుగు నాడు విద్యార్థి విభాగానికి(టీఎన్‌ఎస్‌ఎఫ్‌) చెందిన పది మంది నేతలు అతిథి గృహంలోకి దూసుకొచ్చారు. బీజేపీతో పాటు ప్రధాని మోదీ, కన్నాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు వచ్చి వారికి అడ్డుగా నిలబడ్డారు. ఆందోళనలు చేయడం సరికాదని.. ఇక్కడ్నుంచి వెళ్లిపోవాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలకు సూచించారు.

అయినా కూడా వారు బీజేపీ కార్యకర్తలను నెట్టుకుంటూ.. కన్నా బస చేసిన గది వైపు వెళ్లబోయారు. బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు వారిపై దాడికి దిగగా బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా ప్రతి దాడి చేశారు. అక్కడ ఉన్న కొద్ది మంది పోలీసులు చేతులెత్తేయడంతో 15 నిమిషాలు ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతల దాడిలో గెస్ట్‌హౌస్‌లోని అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ వెంటనే టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు అక్కడ్నుంచి పారిపోయారు. ఘటనాస్థలిలో పడిపోయిన టీడీపీ కండువాలను కాల్చివేసి బీజేపీ నేతలు నిరసన తెలిపారు. ‘సీఎం డౌన్‌..డౌన్, పోలీస్‌ డౌన్‌..డౌన్‌..’ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై బీజేపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, లలిత్‌పాటు పలువురు తీవ్రంగా మండిపడ్డారు. పోలీసుల బందోబస్తుతో కన్నా మీడియా సమావేశం నిర్వహించారు.

సీమ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయండి..
‘రాయలసీమలో నిర్మితమవుతున్న విద్యాసంస్థలు, పరిశ్రమలు, రోడ్లకు నిధులు.. ఇలా అన్నీ కేంద్రం ఇచ్చినవే.రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరేం చేశారో దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయండి?’ అని సీఎం చంద్రబాబుకు కన్నా సవాల్‌ విసిరారు. ‘2014 ఎన్నికల్లో గెలవడం కోసం రాయలసీమకు చంద్రబాబు వందలాది హామీలు ఇచ్చారు. తీరా సీమ ప్రజలు టీడీపీకి ఓట్లేయలేదని ఆరోపిస్తూ.. వారికి నాలుగేళ్లుగా అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు సీమలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా?’ అని ప్రశ్నించారు. కేంద్రమిస్తున్న నిధులను దోచేయడం తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. అనంతపురానికి మొత్తం 15 ప్రాజెక్టులు మంజూరు చేశామని చెప్పారు. కడపలో టీడీపీ నేతలు దీక్ష మొదలుపెట్టిన రోజుకు కూడా ప్రభుత్వం మెకాన్‌కు సమాచారం ఇవ్వలేదన్నారు. ఉక్కు పరిశ్రమ ఇస్తున్నామని తెలిసే.. నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

నన్ను చంపేందుకు కుట్ర..
తనను చంపేందుకే టీడీపీ నేతలు కుట్ర పన్ని గెస్ట్‌హౌస్‌లోకి దూసుకొచ్చారని కన్నా ఆరోపించారు. ఇటీవల తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాపై దాడికి యత్నించారని.. ఇప్పుడు తనపై దాడి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను చంపుతానంటే రోడ్డుపైకి వచ్చి కూర్చుంటానని సవాల్‌ విసిరారు. రాజకీయ పార్టీలకు సంప్రదాయాలు ఉంటాయని.. వీధి రౌడీలకైతే ఏమీ ఉండవన్నారు. టీడీపీని వీధి రౌడీల పార్టీ అనుకోవాలా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖకు, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు