ఓటమి భయంతోనే దాడి

13 Apr, 2019 11:17 IST|Sakshi
పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి

వైఎస్సార్‌ సీపీ పోలింగ్‌ ఏజెంట్లను భయపెట్టి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు

వేల సంఖ్యలో ప్రజలను రప్పించి దాడి చేయించారు

మమ్ములను హత్య చేయాలని ఎమ్మెల్సీ విజయరామరాజు ప్రజలను రెచ్చగొట్టారు

కులం పేరుతో నన్ను ధూషించారు కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి

విజయనగరం, పార్వతీపురం: ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే కోరికతో తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలకు ప్రేరేపించిందని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కురుపాం నియోజకవర్గం పరిధిలోని చినకుదమ గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో రిగ్గింగ్‌ జరుగుతుందన్న సమాచారం మేరకు పరిశీలనకు వెళ్తే స్థానిక నాయకులు పుష్పశ్రీవాని, పరీక్షిత్‌రాజుపై దాడికి పాల్పడి మూడు గంటలపాటు నిర్భంధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాయాలు పాలైన ఎమ్మెల్యే దంపతులు తమపై హత్యాప్రయత్నం చేయడంతో పాటు కుల ధూషణకు పాల్పడిన సంఘటనలో ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ కేసును పెట్టామన్నారు. పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి వచ్చి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. పరీక్షిత్‌రాజుకు శరీరం లోపల భాగాల్లో గాయాలైనట్టు వైద్యులు నిర్ధారించారు. ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి కూడా వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.

వ్యూహాత్మకంగా అలజడి..
కురుపాం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు వ్యూహాత్మకంగా ముందస్తు ప్రణాళికలు రచించి ఓటర్లను భయపెట్టి ఏకపక్షంగా ఎన్నికలు జరిపించడానికి పథకం రచించారని ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి తెలిపారు. వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లను భయపెట్టి ఏకపక్షంగా ఓటింగ్‌ జరిగేలా ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. విషయం తెలుసుకొని పరిశీలించడానికి వెళ్లిన తమపై నిమిషాల వ్యవ«ధిలో వేల సంఖ్యలో ప్రజలను మోహరింపజేసి దాడికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. దాడి చేయడంతో పాటు కులం పేరుతో ధూషించి డొంకాడ రామకృష్ణ అనే టీడీపీ నాయకులు అవమాన పరిచారని, గోర్లి మంగమ్మ, పల్ల నీలిమ అనే ఇద్దరు మహిళలు తమపై భౌతిక దాడికి పాల్పడ్డారని తెలిపారు. పోలీసుల రక్షణ నడుమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంటికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. 

బంధుత్వం చూడకుండా రెచ్చగొట్టారు..
అధికారం కోసం బంధుత్వాన్ని కూడా పక్కనపెట్టి తన పెదమామ విజయరామరాజు హత్యారాజకీయాలను ప్రేరేపించారని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. తమను పోలింగ్‌ కేంద్రంలో 3 గంటలపాటు నిర్భందించి దుండగలు తలుపులు విరగ గొట్టేప్రయత్నం చేస్తున్నా అక్కడే ఉన్న తన పెదమామ అయిన విజయరామరాజు మీకు ఇదే మంచి అవకాశం చంపితే చంపండి లేకపోతే భవిష్యత్‌లో మీకు ఇబ్బందులు తప్పవు అంటూ టీడీపీ నాయకులను రెచ్చగొట్టారన్నారు. ఆయన భరోసాతోనే టీడీపీ వర్గీయులు రెచ్చిపోయి హ త్యాయత్నానికి పాల్పడ్డారని అన్నారు. సమయానికి పోలీసులు వచ్చి ఉండకపోతే తాము జీవిం చి ఉండేవారం కాదని ఆవేదన చెం దారు.
 
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు...
ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి దంపతులపై దాడికి సంబం ధించి ఆమె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. హత్యాప్రయత్నంతో పాటు కులధూషణపై కేసు పెట్టగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 43/2019 యు/ఎస్‌ 353, 354, 332, 342,323,324,109, ఆర్‌/డబ్ల్యూ 149 ఐపీసీ 3(1)(ఆర్‌), 3(1)(ఎస్‌), 3(2)(వీఏ) ఎస్సీ, ఎస్టీ పీఓఏ యాక్ట్‌ కింద చినమేరంగి పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ పి. ధనుంజయరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పరామర్శకు పోటెత్తిన అభిమానులు
పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి వచ్చిన విషయం ఆనోటా ఈనోటా తెలుసుకున్న అభిమానులు వందల సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పార్వతీపురం, కురుపాం, కొమరాడ గరుగుబిల్లి మండలాలనుంచి అభిమానులు పోటెత్తడంతో ఆస్పత్రి ప్రాంగణమంతా జనసంద్రంలా కన్పించింది.

మరిన్ని వార్తలు