తారస్థాయికి తమ్ముళ్ల తన్నులాట

26 Oct, 2017 11:12 IST|Sakshi
ఏఎస్సైకు వివరిస్తున్న సర్పంచ్‌ రమణయ్య, ధ్వంసమైన కారు అద్దాలు

నడిరోడుపై టీడీపీకే చెందిన చీకవోలు సర్పంచ్‌పై పిడిగుద్దులు

కారు ధ్వంసం

‘ఇంటింటా టీడీపీ’లో బయటపడ్డ లుకలుకలు

నెల్లూరు, సైదాపురం: తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి చేరింది. టీడీపీకే చెందిన ఓ గ్రామ సర్పంచ్‌ని నడివీధిలో చొక్కా పట్టుకుని పిడి గుద్దులు కురిపించి, అతను ప్రయాణించే వాహనం అద్దాలను పగలగొట్టిన ఘటన ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో చోటు చేసుకుంది. ఈ వివాదం చూస్తున్న జనం విస్తుపోయ్యారు. తనకు జరిగిన అవమానంపై పోలీసులకు బాధిత సర్పంచ్‌ విన్నవించుకున్నారు. ఈ ఘటన మండలంలోని చీకవోలు గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు, సర్పంచ్‌ కథనం మేరకు.. చీకవోలు గ్రామ సర్పంచ్‌గా సజ్జా రమణయ్య కాంగ్రెస్‌ పార్టీ ద్వారా గెలిచి, గతేడాది టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో గ్రామంలో రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం వారు చేసే అక్రమాలపై సర్పంచ్‌ రమణయ్య పోరాటం సాగిస్తుండేవారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు.

గ్రామ నడిబొడ్డులో ప్రత్యర్థి వర్గం  షామి యాను వేసి, వాహనాలు పోయేందుకు కూడా వీలు లేకుండా హంగామా చేశారు. అదే సయమంలో కారులో అక్కడకు వచ్చిన గ్రామ సర్పంచ్‌ రమణయ్య  వాహనాలు పోయేందుకు కొంత వీలు కల్పించాలని వారిని కోరారు. దీంతో అక్కడే ఉన్న మరో వర్గం టీడీపీ నాయకులు పొలంరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, దువ్వూరు శ్రీని వా సులురెడ్డి, ధునుం జయ కలిసి ఒక్కసారిగా సర్పంచ్‌ రమణయ్యపై రాడ్ల్లతో దాడి చేశారు.  దీంతో చొక్కా చినిగిపోవడంతో పాటు అతని చేతికి గాయమైంది. అంతటితో ఆగకుండా రాడ్లతో కారు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. అక్కడకు చేరుకున్న వారంతా ఈ ఘటన చూసి నివ్వెరపోయ్యారు. పూర్తిగా గొడవ సర్దుమణిగిన తర్వాత ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆ గ్రామానికి చేరుకుని ఇరువురి నాయకులతో చర్చించారు. గాయపడిన సర్పంచ్‌ రమణయ్యను పలువురు నేతలు, అధికారులు పరామర్శించారు. తనపై జరిగిన దాడిపై సర్పంచ్‌ సజ్జా రమణయ్య ఏఎస్సై ఝాన్సీకి వివరించారు. 

మరిన్ని వార్తలు