పిచ్చి తలకెక్కినట్టు..అచ్చోసి వదిలినట్టు

11 May, 2018 12:35 IST|Sakshi
చికిత్స పొందుతున్న కౌన్సిలర్‌ వెంకట్రావును పరామర్శిస్తున్న ఎమ్మెల్సీ బోస్‌

ఆగని టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకి

పెచ్చుమీరిపోతున్న పరిస్థితికొనసాగుతున్న దౌర్జన్యకాండ

తాజాగా జన్మభూమి కమిటీ సభ్యుని హోదాలో వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌పై దాడి

సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధికార మదంతో టీడీపీ నేతలు దౌర్జన్యకాండకు తెగబడుతున్నారు. తమనెవరూ అడ్డుకోలేరని చెలరేగిపోతున్నారు. పడని వారిపై దాడులు, కానివారిపై అక్రమ కేసులు పెట్టి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా రామచంద్రపురం మున్సిపాల్టీ పరిధిలో వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌పై జన్మభూమి కమిటీ సభ్యుడి ముసుగులో ఓ టీడీపీ నేత పట్టపగలే దాడి చేశారు. దీంతో ఆ పార్టీ నేతల అరాచకం ఏ స్థాయిలో ఉందో అవగతం చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. అడ్డూ అదుపూ లేకుండా టీడీపీ నేతలు రెచ్చిపోతున్న తీరుకు ఈ దిగువ ఉదంతాలే నిదర్శనం..

ఆ మధ్య కాకినాడలోని తారకరామనగర్‌ కాలనీలో మధ్యతరగతికి చెందిన కొందరు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూముల్లో నిర్మాణాలు చేపడుతుంటే ఓ టీడీపీ ఎమ్మెల్యే అనుచరులువచ్చి, నిర్మాణాలు ఆపేసి స్థలాల్ని ఖాళీ చేయాలని చెప్పి దాడి చేశారు. పట్ట పగలే గాయపరిచారు. అంతటితో ఆగకుండా తమకున్న అధికార బలంతో బెదిరింపులకు సైతం దిగారు.
పెదపూడి మండలం చాపరాయిలో తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని రాయుడు సత్యనారాయణ అనే వృద్ధుడిపై రౌడీషీటు తెరిపించారు. నేతల ఒత్తిళ్లతో పోలీసులు తరుచూ వేధించడం వలన ఆ పెద్దాయన చివరికి విసిగి వేసారిపోయి ఆత్మహత్య చేసుకున్నారు.
అంతకుముందు కొత్తపల్లిలో సాగునీటి సంఘం ఎన్నికలు జరుగుతున్న వేళ వైఎస్సార్‌ సీపీ నాయకులపై కొందరు టీడీపీ నేతలు దాడి చేశారు.
తుని రూరల్‌ పరిధిలో డీ.పోలవరంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై దాడి చేశారు.అంతటితో ఆగకుండా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు.
ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. టీడీపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమ దారికి రాని వాళ్లందరిపైన దాడులు చేస్తున్నారు. కుదరకపోతే అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

తాజాగా కౌన్సిలర్‌పై దాడి
రామచంద్రపురం మున్సిపాల్టీ పరిధిలో గల  1వ వార్డు కొత్తూరులో హౌసింగ్‌ లబ్ధిదారుల సర్వే చేసే పనిలో నిమగ్నమై ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌ చింతపల్లి వెంకట్రావుపై జన్మభూమి కమిటీ సభ్యుడు మేడిశెట్టి నాగరాజు దాడి చేశాడు. గత ఎన్నికల్లో వెంకట్రావు చేతిలో ఓడిపోయిన నాగరాజు తనకున్న అక్కసు, కక్షతో జన్మభూమి కమిటీ సభ్యు హోదాలో దౌర్జన్యం చేశారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక, అభివృద్ధి పనుల విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్న జన్మభూమి కమిటీ సభ్యులు ఇప్పుడేకంగా దాడులకు తెగబడడం ఆందోళన కలిగిస్తోంది. రామచంద్రపురం మున్సిపాల్టీలో 1088 మంది హౌసింగ్‌ లబ్ధిదారులను గుర్తించగా ప్రజా సాధికార సర్వేలో  395 మంది అనర్హులుగా తేలారు. అయితే, దీనిపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపాక నిజమేంటో తెలుస్తుందని, ప్రజా సాధికార సర్వే కారణంగా అర్హులకు అన్యాయం జరిగితే ఇబ్బందనే ఆలోచనతో మరోసారి సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో  స్థానిక కౌన్సిలర్‌తో కలిసి అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. ఇది టీడీపీ నేత నాగరాజుకు రుచించలేదు తానే సర్వం అన్నట్టుగా దూకుడు ప్రదర్శించారు. తాముండగా కౌన్సిలర్‌ వెంకటరావుకు ఏం పని అన్నట్టుగా దాడికి దిగారు. స్థానికుల సహకారంతో కౌన్సిలర్‌ వెంకటరావు ఆసుపత్రికెళ్లి వైద్యం చేయించుకున్నారు. ఆ తర్వాత టీడీపీ నాయకులు ఎప్పటిలాగే ఎదురుదాడికి దిగే పనిలో నిమగ్నమయ్యారు.

మరిన్ని వార్తలు