‘సాక్షి’పై టీడీపీ అక్కసు 

31 Jan, 2019 08:18 IST|Sakshi
కొవ్వూరులో సాక్షి దినపత్రికను దహనం చేస్తున్న మంత్రి కేఎస్‌ జవహర్, పలువురు టీడీపీ నాయకులు

పసుపు కుంకుమ పేరుతో సర్కారు మోసంపై కథనంతో ఉలికిపాటు 

పెద్దల ఆదేశాల మేరకు 

సాక్షి ప్రతుల దహనం 

సాక్షి నెట్‌వర్క్‌ : పసుపు–కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ‘సాక్షి’ ఆధారాలతో సహా బయటపెట్టడంతో టీడీపీ అధిష్టానం ఉలిక్కి పడింది. సాధారణ ఎన్నికలకు మరో మూడు నెలలు ఉందనగా డ్వాక్రా సంఘాలను మభ్యపెట్టేందుకు సర్కారు మొదలెట్టిన గిమ్మిక్కులను ‘పసుపు–కుంకుమ డప్పు.. అక్షరాలా అప్పే!’ శీర్షికతో సాక్షి పత్రిక బుధవారం కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. పత్రికా స్వేచ్ఛను మంటగలిపేలా ‘సాక్షి’ ప్రతులను దహనం చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ పాల్గొనడం గమనార్హం. మహిళలను ఆర్థికంగా ఆదుకోవడం కోసమే పసుపుకుంకుమ అందిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు టీడీపీ నాయకుల తీరును ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మీడియా కథనాలు తప్పు అని నిరూపించడానికి ఏమీ లేకనే ఇలా అక్కసు వెళ్లగక్కుతున్నారని, దీనినిబట్టి ఇది మోసపూరిత ‘పథక’మని అర్ధమౌతున్నదని విశ్లేషకులంటున్నారు.  పత్రికా స్వేచ్ఛను కాపాడి, అధికార తెలుగు దేశం పార్టీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ పలువురు నేతలు కాణిపాకం వరిసిద్ది వినాయక స్వామి వారికి వినతి పత్రం అందజేశారు. కాగా పత్రిక ప్రతులను దహనం చేయడాన్ని పలు జర్నలిస్టు సంఘాలు ఖండించాయి.

మరిన్ని వార్తలు