నేను పుట్టాను.. లోకం ఏడ్చింది

2 May, 2019 13:32 IST|Sakshi

కోడెల పుట్టిన రోజుకు చందాల వసూళ్లు

రేషన్‌ డీలర్లకు రూ.1000 చొప్పున ఫైన్‌

చికెన్‌ తేవాలని రెస్టారెంట్లకు హుకుం

పేటను పట్టిపీడిస్తున్న కేఎస్టీ పీడ

నరసరావుపేటలో రేషన్‌ డీలర్లు, ప్రజలు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. ప్రభుత్వం విధించే పన్నులే తలకు భారంగా మారితే.. కేఎస్టీతో ముప్పుతిప్పలు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా, కోడెల శివప్రసాద్‌ ఇంట ఎలాంటి శుభకార్యం జరిగినా వెంటనే ప్రజలపై ట్యాక్స్‌ వేస్తున్నారు. తాజాగా కోడెల శివప్రసాద్‌ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు డీలర్ల నెత్తిన చేయి పెట్టారు. ఒక్కో డీలర్‌ నుంచి రూ.1000 వసూలు చేశారు. వ్యతిరేకించిన వారి దుకాణాలపై అధికారులతో దాడులు చేయిస్తామని బెదిరించారు. పట్టణంలోని రెస్టారెంట్లకు చికెన్‌ ఫైన్‌ వేశారు. ఇలా 300 కేజీల చికెన్‌ తెప్పించుకున్నారు. ఇదంతా చూసిన వ్యాపారులు, డీలర్లు, ప్రజలు కేఎస్టీ పీడ ఎప్పుడు విరగడవుతుందా అని దుమ్మెత్తిపోస్తున్నారు.

గుంటూరు, నరసరావుపేట టౌన్‌: ముఖ్యనేత పుట్టినరోజు వేడుకల కోసం టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం అక్రమ వసూళ్లకు పాల్పడింది. అడిగినంత ఇవ్వాల్సిందేనంటూ తెలుగు తమ్ముళ్లు బలవంతపు వసూళ్లకు తెగబడ్డారు. ఇవ్వకుంటే వ్యాపారాలు ఎలా చేసుకుంటారో చూస్తామంటూ బెదిరింపులకు దిగారు.  నియోజకవర్గ ప్రజలకు అధికారపార్టీ అక్రమాలు, అవినీతి పీడ విరగడైందనుకుంటున్న  సమయంలో ముఖ్యనేత జన్మదినం పేరిట మరో మారు అక్రమ వసూళ్లకు పాల్పడటంతో ఇటు వ్యాపార వర్గాలు అటు రేషన్‌ డీలర్లు విస్తుపోతున్నారు.  వివరాల్లో కెళితే.. తాజా మాజీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు జన్మదిన వేడుకల పేరిట టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతుండటంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. పట్టణ, మండల పరిధిలో ఉన్న 115 మంది రేషన్‌ డీలర్ల వద్ద  ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.1000 చొప్పున వసూలు చేశారు. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో డీలర్లతో అధికారులు సమావేశం నిర్వహించారు. అధికారుల ఎదుటే డీలర్ల సంఘ ప్రతినిధులు డాక్టర్‌ కోడెల జన్మదినం నిర్వహించుకునేందుకు డీలర్లు అంతా చందాలు ఇవ్వాలని కోరారు. దీనికి కొంతమంది రేషన్‌ డీలర్లు వ్యతిరేకించటంతో బెదిరింపులకు పాల్పడ్డారు. తహసీల్దార్‌ కార్యాలయంలో సమావేశం ముగిసిన అనంతరం కోడెల నివాసంలోకి రేషన్‌ డీలర్లు అందరినీ  ద్వితీయ శ్రేణి నాయకులు పిలిచారు. పుట్టినరోజు వేడుకలకు ఫండింగ్‌ ఇవ్వకుంటే అధికారులతో రేషన్‌ దుకాణాలపై దాడులు నిర్వహిస్తామని బెదిరింపులకు దిగినట్లు సమాచారం. దీనికి ఎక్కువశాతం మంది వ్యతిరేకించటంతో దిగివచ్చిన ద్వితీయ శ్రేణి నాయకులు మే నెల సరుకులు కార్డుదారులకు ఇవ్వకుండా నల్లబజారుకు తరలించి తద్వారా అర్థికంగా లబ్ధి పొందాలని సూచించారు. అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలియవచ్చింది. దీంతో చేసేదేమి లేక తలా రూ.1000 రూపాయలు ముట్టచెప్పామని పలువురు డీలర్లు వాపోయారు.

రెస్టారెంట్‌లకు చికెన్‌ ఫైన్‌..
వేడుకలకు సంబంధించి నిర్వహించే వంటకాలకు అవసరమైన చికెన్‌ను రెస్టారెంట్ల యాజమాన్యం తెచ్చి ఇవ్వాలని హుకుం జారీ చేశారు. పట్టణంలో ఉన్న బార్‌ అండ్‌ రెస్టారెంట్ల యాజమాన్యం అందరూ కలిసి 300 కేజీల చికెన్‌ తెచ్చి ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. దీంతో వ్యాపారులంతా సమావేశమై మాంసానికి అయ్యే ఖర్చును తలా కాస్త వేసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ కార్యక్రమాలు ఏం చేపట్టినా ఖర్చును రేషన్‌ డీలర్లు, మద్యం దుకాణాల నిర్వాహకుల వద్ద నుంచి వసూలు చేయటం గతం నుంచి ఆ పార్టీ నాయకులకు పరిపాటిగా మారింది. ఈ అరాచకం ఇంకెన్నాళ్లు భరించాలో అంటూ ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ యజమాని వాపోయాడు.

కేఎస్‌టీతో బెంబేలు...
తెలుగుదేశం ప్రభుత్వం అ«ధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి పనికి కేఎస్‌టీ వసూళ్లు చేసి వ్యాపారులతో పాటు సామాన్య ప్రజానీకాన్ని సైతం వదిలిపెట్టకుండా అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం అవినీతి పీడ విరగడైపోతుందని  నియోజకవర్గం ప్రజానీకం ఊపిరి పీల్చుకున్నారు. ఈనెల 23న ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో గురువారం కోడెల పుట్టినరోజును పురస్కరించుకొని వ్యాపారులు, రేషన్‌ డీలర్‌లు, బిల్డర్‌లను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడటంతో మళ్లీ నియోజకవర్గ ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. కోడెల అవినీతికి చరమగీతం పాడేరోజులు త్వరగా రావాలని కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు