ఎలా నెగ్గుకురాగలం!

9 Mar, 2020 04:52 IST|Sakshi

స్థానిక ఎన్నికలపై టీడీపీ నేతల అంతర్మథనం 

ఎన్నికలకు క్యాడర్‌ సిద్ధంగా లేదని ఆందోళన

 సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా నెగ్గుకురావాలో తెలియక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు తల పట్టుకుంటున్నారు. కోర్టు కేసుల ద్వారా ఎన్నికలను అడ్డుకోవచ్చని భావించినా ఆ వ్యూహం ఫలించలేదు. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో వారిలో ఆందోళన పెరిగిపోతోంది.  ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సహా టీడీపీ నాయకులంతా ఇప్పటికిప్పుడు ఎన్నికలు ప్రకటిస్తే ఎలా అని వాపోతున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు అనువైన వాతావరణం లేదంటూ తాము పోటీకి సంసిద్ధంగా లేమని చెప్పుకుంటున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.   
- బీసీ రిజర్వేషన్ల విషయంలో అనుసరించిన వైఖరి వల్ల పూర్తిగా దెబ్బతిన్నామనే భావన టీడీపీ నాయకుల్లో వ్యక్తమవుతోంది.  
- రిజర్వేషన్లను అడ్డుకునేందుకు తమ పార్టీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డితో కోర్టులో కేసు వేయించడం, రిజర్వేషన్లు కావాలని మళ్లీ పార్టీ తరపున కోర్టుకు వెళ్లడం పెద్ద తప్పిదమని గోదావరి జిల్లాలకు చెందిన మాజీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు.  
- బీసీలకు రిజర్వేషన్లు తగ్గిపోవడానికి ప్రభుత్వమే కారణమని ఎంత ఎదురుదాడి చేసినా ప్రజలు నమ్మడం లేదని, అసలు దీనిపై కేసు వేయించింది టీడీపీయేనన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.  
- అధికార వైఎస్సార్‌సీపీ ప్రకటించినట్లుగానే తాము కూడా బీసీలకు అదనంగా 10 శాతం టికెట్లు ఇస్తామని ప్రకటన చేయలేకపోవడం తమ బలహీనతకు నిదర్శనమన్న చర్చ టీడీపీలో జరుగుతోంది.  
- సాధారణ ఎన్నికల్లో ఎదురైన ఓటమినే ఇంకా జీర్ణించుకోలేని క్యాడర్‌ స్థానిక ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమని టీడీపీ నేతలు వాపోతున్నారు.  
- సోషల్‌ మీడియా, అనుకూల మీడియా ద్వారా హడావుడి చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పార్టీ శ్రేణులు నిరుత్సాహంలోనే ఉన్నాయని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.  
- ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండడంతో అభ్యర్థులను గుర్తించడం కష్టమని నియోజకవర్గ నేతలు అంటున్నారు.  
- వ్యతిరేక పరిస్థితుల్లో గ్రామ, వార్డు స్థాయిల్లో పోటీ చేసేందుకు పార్టీకి అనుకూలంగా ఉన్నవారే ఇష్టపడడంలేదని ఇన్‌ఛార్జిలు చెబుతున్నారు.  
- చేసేదేమీ లేదని, సమయం తక్కువ ఉన్నా పోటీ చేయాలి కాబట్టి చేయడమేనని టీడీపీ సీనియర్‌ నాయకులు సైతం ప్రైవేట్‌ సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.   

మరిన్ని వార్తలు