నిమ్మల X అంగర

24 Nov, 2018 08:14 IST|Sakshi
అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా టీడీ జనార్దన్‌తో ఎమ్మెల్సీ అంగర, ఎమ్మెల్యే నిమ్మల

నీ బతుకు నాకు తెలుసు నువ్వెంత అంటే నువ్వెంత

టీడీ జనార్దన్‌ ఎదుట దూషణల పర్వం

అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవంలో రోడ్డునపడ్డ విభేదాలు

సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి, ఏలూరు: పాలకొల్లు తెలుగుదేశం పార్టీలో విభేదాలు రోడ్డెక్కాయి. పార్టీ సీనియర్‌ నేత తొండెపు దశరథ జనార్దన్‌ సాక్షిగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహనరావు బూతులు తిట్టుకున్నారు. నీ బతుకు నాకు తెల్సంటే... నీ బతుకు నాకు తెల్స ని దూషించుకున్నారు. నీ సొంత ఊర్లో వంద ఓట్లు కూడా వేయించలేవు. నీకు రెండోసారి ఎమ్మెల్సీ ఇవ్వడమే దండుగ అంటూ ఎమ్మెల్సీ అంగర రామమోహనరావుపై నిమ్మల రామానాయుడు విరుచుకుపడ్డారు. ఈ వివాదానికి పాలకొల్లులోని అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవం వేదికగా మారింది. దీంతో టీడీ జనార్ధన్‌ ఇరువురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న విషయానికి రోడ్డెక్కడం ఏంటని, రేపు మాట్లాడుకుందామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే... పాలకొల్లు పట్టణంలో శుక్రవారం సాయంత్రంఅన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్‌ నేత టి.డి జనార్ధన్‌ హాజరయ్యారు.

ముందుగా క్యాంటీన్‌ వద్ద రోడ్డుపై సమావేశం ఏర్పాటుచేశారు. సమావేశం అనంతరం టి.డి జనార్ధన్‌ వెళ్లి పోతుండగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆయన్ను సాగనంపేందుకు కూడా వెళ్లారు. జనార్ధన్‌ కారు ఎక్కుతుండగా ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ వెళ్లి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిపై ఫిర్యాదు చేశారు. పాలకొల్లులో తాను కట్టించిన ఫ్లెక్సీలను తీయించి వేశారని, ఇదేం పద్ధతని చెబుతుండగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు జోక్యం చేసుకోవడంతో ఇరువురి మధ్య వివాదం ముదిరింది. తాను ముందు నుంచి పార్టీలో ఉంటున్నానని అంగర చెబుతుండగా అయితే ఏంటి నేను ఇక్కడ ఎమ్మెల్యేని అని నిమ్మల సమాధానం ఇచ్చారు. దీంతో నీ బతుకు నాకు తెలుసు, నీ అంత బోకు లేడంటూ ఒకరిపై మరొకరు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో వందల కోట్లు అవినీతి చేశాడని ఎమ్మెల్సీ అంగర ఆరోపించగా, గత ఎన్నికల్లో నువ్వు ఎవరికి పనిచేశావో తెలుసులే,  నీ సొంత ఊర్లో వంద ఓట్లు వేయించడం చేతకాలేదంటూ ఎమ్మెల్యే ప్రత్యారోపణ చేశారు. ఒకదశలో అసభ్య పదజాలంతో దూషించుకోవడంతో జనార్ధన్‌ జోక్యం చేసుకుని ఇరువురిపై ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఫ్లెక్సీల తొలగింపే కారణం
అధికార పార్టీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య వివాదానికి ఫ్లెక్సీల తొలగింపు కారణంగా మారిందని సమాచారం. ప్రచారానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రజాప్రతినిధుల్లో జిల్లాలో నిమ్మలదే పైచేయి. బీసీ నాయకుడిగా, వరుసగా జిల్లాలో రెండవసారి ఎమ్మెల్సీ అయిన అంగర రామమోహన్‌  వివాదరహితునిగా ఉంటారు. టీడీ జనార్ధన్‌ పాలకొల్లు వస్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ అంగర పట్టణంలో మండల పరిషత్‌ కార్యాలయం వద్ద, లాకు సెంటర్‌ వద్ద రెండు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసి దగ్గరుండి అ రెండు ఫ్లెక్సీలను ఎమ్మెల్యే నిమ్మల తొలగించారని అంగర వర్గం ఆరోపిస్తోంది. వివాదాలకు దూరంగా ఉండే ఎమ్మెల్సీ అంగర తాను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే తీరుతో విసుగు చెందిన ఎమ్మెల్సీ అన్న క్యాంటీన్‌ సమావేశం తర్వాత తన ఆవేశాన్ని, ఆవేదనను వెళ్లగక్కారు. ఈ సమావేశంలో కూడా ఆయన అసహనంగా, అంటీముట్టనట్లుగా వ్యవహరించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా