జీవీ ఇంటిని ముట్టడించిన రావెల వ్యతిరేక వర్గీయులు

27 Sep, 2018 13:33 IST|Sakshi
టీడీపీ జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులును చుట్టుముట్టిన రావెల వ్యతిరేక వర్గం

టీడీపీలో ముదిరిన విభేదాలు

సాక్షి, గుంటూరు: టీడీపీలో వర్గ విభేదాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ సామాజికవర్గ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో మూడేళ్లుగా స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేక వర్గాలు తయారై పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఎమ్మెల్యేలను సైతం అడ్డుకుని దాడులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. జిల్లా నేతలు వారి మధ్య సఖ్యత కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించడంలేదు. తాడికొండలో ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పూర్ణచంద్రరావు వర్గీయులు పనిచేస్తున్నారు. తాజాగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు వ్యతిరేక వర్గంపై ఆయన పీఏ ఫిర్యాదు మేరకు పలువురు టీడీపీ ముఖ్యనేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యాయి.

దీంతో టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ నెల 23వ తేదీన వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో కొందరు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబును ఆయన వ్యతిరేక వర్గీయులు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతూ దాడికి యత్నించారు. దీంతో పోలీసులు రావెలను గ్రామం నుంచి తీసుకొచ్చారు. రావెల పీఏ ఫిర్యాదుతో పలువురు టీడీపీ నేతలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కావడంతో వ్యతిరేక వర్గీయులు రగిలిపోయారు. భారీ ఎత్తున మహిళలు, యువకులు గుంటూరులోని టీడీపీ జిల్లా అధ్యక్షులు జి.వి.ఆంజనేయులు ఇంటికి బుధవారం ర్యాలీగా వెళ్లి చుట్టుముట్టారు. రావెలకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, కేసులను ఎత్తివేయించాలని ఆంజనేయులుకు విన్నవించారు. రెండు వర్గాల మధ్య ఎలా సఖ్యత కుదుర్చాలో తెలియక జిల్లా నేతలు తలలు పట్టుకున్నారు. తమ ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేయకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామంటూ రావెలకు మద్దతుగా దళిత సంఘాలు హెచ్చరించడంతో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మిగతావారిని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఎవరినీ అరెస్టు చేయడానికి వీల్లేదంటూ రావెల వ్యతిరేక వర్గాన్ని నడిపిస్తున్న ఓ మంత్రి, పలువురు ఎమ్మెల్యేలు పట్టుబట్టడం గమనార్హం.

మరిన్ని వార్తలు