వదల బొమ్మాళీ..!

13 Jun, 2019 06:59 IST|Sakshi

సాక్షి,  ఒంగోలు : జిల్లాలో టీడీపీ నేతలు పనులు చేయకుండానే కోట్లాది రూపాయల నిధులు మెక్కారు. పాత గుంతలు చూపించి బిల్లులు దండుకున్నారు. చెరువుల్లో  పూడిక తీత పేరుతో మట్టి అమ్ముకున్నారు. కాలువలు, చెరువుల ఆధునికీకరణ పేరుతో పాత పనులు చూపించి కొన్నిచోట్ల నిధులు స్వాహా చేయగా, మరికొన్ని చోట్ల అసలు పనులు చేయకుండానే  బిల్లులు చేసుకున్నారు.

అయిదేళ్ల పాలనలో  నీరు–చెట్టులో అవినీతికి అంతు లేకుండా పోయింది. అక్రమాలకు అధికారుల సహకారమూ ఉంది. ఆది నుంచి నీరు –చెట్టు లో అక్రమాలు జరుగుతున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చెబుతూనే ఉన్నా చంద్రబాబు పెడచెవిన పెట్టారు. 

జిల్లాలో రూ. 80 కోట్ల పైనే బకాయిలు
జిల్లాలో నీరు–చెట్టుకు సంబంధించి ఇంకా రూ. 80 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చూపిస్తున్నారు. ఒంగోలు డివిజన్‌లో రూ. 50 కోట్లు, మార్కపురం డివిజన్‌లో రూ. 16 కోట్లుతో పాటు కందుకూరు, అద్దంకి ప్రాంతాల్లోని బిల్లులతో కలిపితే మొత్తం సుమారు రూ. 80 కోట్లున్నాయి. వైఎస్‌ జగన్‌ సర్కార్‌లో ఈ బిల్లులు చెల్లించాలన్నది అధికారుల ఉద్దేశ్యం. అయితే  ఎటువంటి పనులు జరగకుండానే టీడీపీ నేతలు అక్రమంగా  బిల్లులు చేయించుకున్నారన్నది వైఎస్సార్‌ సీపీ నేతల  ఆరోపణ.

క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకునేందుకు  సమగ్ర విచారణ జరిపించాలన్నది జగన్‌ సర్కార్‌ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అందుకే ముందు బిల్లులు నిలిపి వేసి విచారణ అనంతరం తదుపరి చర్యలకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక  నీటిపారుదల శాఖలో జరిగిన అవినీతిని వెలికి తీస్తామని, అందుకు కారణమైన ఎవరినీ వదిలేది లేదని ఆ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఇప్పటికే గట్టిగా చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలను వైఎస్‌ జగన్‌ సర్కార్‌ వదిలి పెట్టదని స్పష్టమవుతోంది.   

అక్రమాలిలా... 
నీరు–చెట్టులో అధికార పార్టీ నేతలు 50 శాతం పనులను మనుషులతో కాకుండా మిషన్లతో పూర్తి చేశారు. చెరువుల్లో మట్టిని ఒక్కో ట్రాక్టర్‌ రూ. 300 నుంచి రూ. 800 వరకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. అదే గుంతలు చూపించి పూడికతీత పేరుతో నీరు–చెట్టులో బిల్లులు తీసుకున్నారు. చెక్‌డ్యామ్‌లు నాసిరకంగా నిర్మించి పెద్ద ఎత్తున దండుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 నియోజకవర్గాల్లోని అవినీతికి అంతే లేదు. ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలో అక్రమాలకు కొదువలేదు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆర్థిక లబ్ధి కోసమే ఈ పథకం పెట్టినట్లయింది. అధికారులు అందినకాడికి కమీషన్లు పుచ్చుకొని నేతలు, కార్యకర్తలతో కలిసి వాటాలు తీసుకొన్న సంఘటనలు కోకొల్లలు. ప్రతి సోమవారం గ్రీవెన్స్‌ డేకు వచ్చే అర్జీల్లో అధిక శాతం వినతులు నీరు–చెట్టు అక్రమాలపైనే ఉండటం గమనార్హం. 

 కొన్ని ఉదాహరణలు :

  • ఒంగోలు శివారులోని కొప్పోలు, చెరువుకొమ్ముపాలెం, పెళ్లూరు చెరువుల నుంచి రోజూ వందల కొద్ది ట్రాక్టర్లు పెట్టి ట్రిప్పు మన్ను రూ. 250 నుంచి రూ. 500 వరకూ విక్రయించారు. అధికార పార్టీ నేతలు ట్రాక్టర్ల వద్ద సైతం ట్రిప్పుకు రూ. 50 చొప్పున కమీషన్లు పుచ్చుకున్నారు.
  • ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని అక్కన్నవారి చెరువు, బుర్రవానికుంట, వలేటివారిపాలెం చెరువు, వరగమ్మ వాగు, ముదిగొండ వాగు, చిన్నచెరువులతో పాటు పలు చెరువులు, వాగుల్లో జరిగిన నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. 
  • గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని ఉయ్యాలవాడ, గడికోట, తిమ్మాపురం, సంజీవరాయునిపేట, దంతెరపల్లి, రాచర్ల ప్రాంతాల్లో నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
  • యర్రగొండపాలెం మండలంలోని బోయలపల్లి చెరువు మట్టిని రోడ్డుకు తోలుకొని నీరు–చెట్టు పనుల్లో బిల్లులు తెచ్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. పుల్లలచెరువు మండలంలోని కాటివీరన్నచెరువు, చేపలమడుగు, పెద్దచెరువు, పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు చెరువులతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. 
  • అద్దంకి–నార్కెట్‌పల్లి దారిలో నీరు–చెట్టులో నిర్మించిన చెక్‌డ్యామ్‌లు అప్పుడే శిథిలావస్థకు చేరుకున్నాయి. జె.పంగులూరు మండలం చినమల్లవరం, అరికట్లవారిపాలెం ప్రాంతంతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా జరిగిన నీరు–చెట్టు పనుల్లో అక్రమాలకు కొదువ లేదు. 
  • దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు మండలం దొర్నపువాగు పరివాహక ప్రాంతం, తోటవెంగన్నపాలెం, రాజానగరం, కొర్రపాటివారిపాలెం, వీరన్నవాగుతో పాటు పలు ప్రాంతాల్లో నీరు–చెట్టు పనుల్లో అక్రమాలు వెల్లువెత్తాయి. కోమలకుంటచెరువు, ఎర్రచెరువు, తానంచింతం, అబ్బాయిపాలెం, చందలూరు చెరువు పనుల్లోనూ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 
  • కందుకూరు నియోజకవర్గంలోని మోపాడు చెరువు, గుడ్లూరు నాయుడుపాలెం చెరువులతో పాటు నియోజకవర్గంలో జరిగిన నీరు–చెట్టు పనుల్లో  అక్రమాలు చోటు చేసుకున్నాయి. 
  • కనిగిరి పరిధిలోని దోమలేరు, గోకులం, జిల్లెళ్ళపాడులతో పాటు నియోజకవర్గవ్యాప్తంగా జరిగిన నీరు–చెట్టు పనుల్లో అక్రమాలకు కొదువ లేదు. 
  • కొండపి పరిధిలోని టంగుటూరు మండలం కొణిజేడు, కొండేపి చెరువుతో పాటు నియోజకవర్గంలో పలు చెరువులు, వాగుల్లో జరిగిన నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు  జరిగినట్లు ఆరోపణలున్నాయి.
  • మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం చెరువుతో పాటు కొనకనమిట్ల అంబచెరువు, పొదిలి ప్రాంతంలోని అన్నవరం, మల్లవరం, యేలూరు, కొచ్చెర్లకోటతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన నీరు–చెట్టు పనుల్లో అక్రమాలు జరిగాయి.
  • పర్చూరు పరిధిలోని దేవరపల్లి సూరాయకుంట, నూతలపాడులోని బూరాయికుంట, దగ్గుబాడు, నాయుడువారిపాలెం గ్రామాలతో పాటు జరిగిన నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి.
  • సంతనూతలపాడు పరిధిలోని మద్దిపాడు మండలం పెదకొత్తపల్లి ఎండోమెంట్‌ చెరువులో పెద్ద ఎత్తున మట్టిని తరలించి అక్రమాలకు పాల్పడ్డారు. దొడ్డవరప్పాడు, ముదిగొండ వాగు, జతివారికుంట, పాపాయి చెరువులతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన నీరు–చెట్టు పనుల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

నీరు–చెట్లు పనుల మంజూరు ఇలా...

  • 2015–16 ఏడాదికిగాను నీరు–చెట్టు కింద జిల్లావ్యాప్తంగా 2,111 పనులు మంజూరు చేశారు. ఇందు కోసం రూ. 124.59 కోట్లు నిధులు కేటాయిం చారు. రూ. 87.24 కోట్లతో 1681 పనులను పూర్తి చేసినట్లు అధికారిక గణాం కాలు చెప్తున్నాయి.
  • 2016–17కు గాను జిల్లావ్యాప్తంగా 3,241 పనులను మంజూరు చేయగా రూ. 201.16 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 1510 పనులు పూర్తి చేసినట్లు లెక్కలు చెప్తున్నాయి. దీని కోసం రూ. 124.22 కోట్లు ఖర్చు చేశారు. అధికారులు మాత్రం 420 లక్షల క్యూ బిక్‌ మీటర్ల పూడికను తొలగించినట్లు లెక్కలు చూపించడం గమనార్హం.
  • 2017–18కుగాను జిల్లావ్యాప్తంగా 3,513 పనులను మంజూరు చేశారు. దీని కోసం రూ. 278.83 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 1282 పనులు పూర్తి చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఇందుకోసం రూ. 143.98 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా గత నాలుగేళ్లలో జిల్లావ్యాప్తంగా నీరు–చెట్టులో రూ. 840 కోట్లతో దాదాపు వెయ్యి పనులు మంజూరు చేయగా రూ. 450 కోట్లు వెచ్చించి 5 వేల పనులు పూర్తి చేసినట్లు గణాంకాలు చెప్తున్నాయి. 
మరిన్ని వార్తలు