మంగళగిరిలో ఎన్నికల తాయిలాలు

17 Mar, 2019 13:49 IST|Sakshi

బూత్‌ కన్వీనర్లకు అందిన సెల్‌ఫోన్లు

మాకందలేదంటూ మధనపడుతున్న టీడీపీ కార్యకర్తలు

సాక్షి, తాడేపల్లి రూరల్‌: నారా లోకేశ్‌ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎన్నికల తాయిలాల పంపకం మొదలైపోయింది. ఇందులో భాగంగా శనివారం కొంతమందికి సెల్‌ఫోన్లు అందజేస్తుండగా ఆ పార్టీలో పనిచేస్తున్న మిగతా కార్యకర్తలు, వారేనా పనిచేసేది, మాకు ఎందుకు ఇవ్వరంటూ నిలదీయడంతో పంపిణీకి వచ్చిన నాయకులు ఒక్కసారిగా అవాక్కవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేనిపోని వ్యవహారం పెట్టుకున్నాంరా.. బాబూ అంటూ వారిలోవారు మధనపడుతూ అధిష్టానం నుంచి వచ్చిన తాయిలాలు పంచి మెల్లగా అక్కడినుంచి జారుకున్నారు.

నియోజకవర్గం వ్యాప్తంగా 278 పోలింగ్‌ బూత్‌లు ఉండగా, అందులో ఇప్పటికే 200 బూత్‌లలో కూర్చునే కార్యకర్తలకు సెల్‌ఫోన్‌లు అందజేశారు. ఇచ్చిన సెల్‌ఫోన్లు పేరుగొప్ప ఊరుదిబ్బలా ఉన్నాయని ఆపార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. సెల్‌ఫోన్‌ల పంపకం తెలుగుదేశం పార్టీలో కిందిస్థాయి కార్యకర్తలకు తెలియడంతో, మా అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు, మా అమ్మాయికి సెల్‌ఫోన్‌ అవసరం, మాక్కూడా ఒకటి ఇప్పించండంటూ మండల స్థాయి, పట్టణ స్థాయి నాయకులను అడగడంతో, ఏం చేయాలో అర్థంకాక నాయకులు తలలు పట్టుకుంటున్నారు. కాగా, మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: మొదటిరోజే లోకేష్‌ అధికార దర్పం)

మరిన్ని వార్తలు