పచ్చనేతల ఆశలపై హాయ్‌‘ల్యాండ్‌మైన్‌’

22 Dec, 2018 11:11 IST|Sakshi

అప్పనంగా కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దల ఎత్తుగడ

హైకోర్టు ఆదేశాలతో ఆశలు ఆవిరి

కనీస ధర రూ.600 కోట్లుగా నిర్ణయించాలని కోర్టు స్పష్టీకరణ

ఇకపై ఎవరైనా వేలంలో పోటీ పడి కొనుక్కొవాల్సిందే..

సాక్షి, అమరావతి: హాయ్‌ల్యాండ్‌ను అప్పన్నంగా కొట్టేద్దామనుకున్న ‘పచ్చ’నేతల ఆశలు ఆవిరయ్యాయి. హాయ్‌ల్యాండ్‌ కనీస ధర రూ.600 కోట్లుగా నిర్ణయించి, విక్రయానికి బిడ్‌లు పిలవాలంటూ అగ్రిగోల్డ్‌ కేసులో హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు ప్రభుత్వ పెద్దలకు కలవరపాటుగా మారింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల్లో అత్యంత విలువైన హాయ్‌ల్యాండ్‌ను సొంతం చేసుకునేందుకు ముఖ్యనేతలు సాగిస్తున్న ప్రయత్నాలకు చెక్‌పెట్టినట్టు అయ్యింది.

చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి–16 వెంబడి గుంటూరు జిల్లాలో ఉన్న హాయ్‌ల్యాండ్‌ దాదాపు 86 ఎకరాల్లో విస్తరించి ఉంది. 68 ఎకరాల్లో హాయ్‌ల్యాండ్‌తోపాటు క్లబ్, 18 ఎకరాల్లో కల్యాణమండపం, క్లబ్‌హౌస్, వాహనాల పార్కింగ్, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. గుంటూరుకు చెందిన ఓ వ్యాపారి ఇందులోనే సుమారు పది ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఆరంభించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక హాయ్‌ల్యాండ్‌పై ప్రభుత్వ పెద్దలు కన్నేశారు.

ఎవరి లెక్కలు వారివే..
అగ్రిగోల్డ్‌ ఆస్తుల్లో అత్యంత కీలకమైన హాయ్‌ల్యాండ్‌ను పచ్చ నేతలు కేవలం రూ.250 నుంచి 350 కోట్లలోపు ధరకే అప్పన్నంగా కొట్టేసే ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలున్నాయి. అయితే, హాయ్‌ల్యాండ్‌ విలువ రూ.1,000 కోట్లు ఉంటుందని అగ్రిగోల్డ్‌ యాజమాన్యం పేర్కొంది. ‘ఆర్కా’ సంస్థ రూ.1800 కోట్లుగా చెప్పింది. హాయ్‌ల్యాండ్‌ విలువను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.503 కోట్లుగా లెక్కగట్టింది. అగ్రిగోల్డ్‌ను టేకోవర్‌ చేసేందుకు ముందుకొచ్చిన సుభాష్‌చంద్ర ఫౌండేషన్‌ హాయ్‌ల్యాండ్‌ విలువను రూ.522 కోట్లుగా అంచనా వేసింది. ఇదే సమయంలో అగ్రిగోల్డ్‌ యాజమాన్యం తరఫు న్యాయవాది హాయ్‌ల్యాండ్‌ విలువ రూ.1,000 కోట్లు ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హాయ్‌ల్యాండ్‌ విలువను రూ.600 కోట్లుగా నిర్ధారించింది. నిజానికి దాని ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.1,500 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల వరకు ఉంటుందని రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు చెబుతున్నారు.  

హాయ్‌ల్యాండ్‌ విలువ దాదాపు రూ.1,800 కోట్లు
దేశంలో దాదాపు 32 లక్షల మంది ఖాతాదారులను మోసం చేసిన అగ్రిగోల్డ్‌ వ్యహారంలో సీబీఐ దర్యాప్తు చేయించాలని బాధితులు డిమాండ్‌ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ, ఈ కేసును సీఐడీకి అప్పగించడంపై అప్పట్లో అనుమానాలు తలెత్తాయి. అగ్రిగోల్డ్‌ సంస్థ మోసాలపై కేసులు నమోదు కావడం, ఆస్తుల స్వాధీనం వంటివి ప్రభుత్వ పెద్దలకు కలిసొచ్చాయి. తొలినుంచి అగ్రిగోల్డ్‌ సంస్థతో సంబంధం లేకుండా ఆస్తుల జాబితా నుంచి హాయ్‌ల్యాండ్‌ను తప్పించి అప్పన్నంగా కొట్టేసేందుకు గట్టి ప్రయత్నాలు సాగించారు. తొలుత ఆస్తుల ఎటాచ్‌మెంట్‌లో హాయ్‌ల్యాండ్‌ విషయమై ఆచితూచి వ్యవహరించారు. అటు తరువాత వేలం ప్రక్రియలోను హాయ్‌ల్యాండ్‌ తొలిదశలో లేకుండా తప్పించారు.

రూ.1,500 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల విలువ చేసే  హాయ్‌ల్యాండ్‌ తమది కాదని చెప్పి తప్పించుకోవడం ద్వారా ప్రభుత్వ పెద్దలకు సహకరించి, తద్వారా లబ్ధి పొందేందుకు అగ్రిగోల్డ్‌ యాజమాన్యం ప్రయత్నించిదనే విమర్శలున్నాయి. అగ్రిగోల్డ్‌ సంస్థకు హాయ్‌ల్యాండ్‌తో సంబంధం లేదంటూ యాజమాన్యం నివేధించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో సీఐడీ అధికారులు హడావుడిగా హాయ్‌ల్యాండ్‌ ఎండీ అల్లూరి వెంకటేశ్వరరావును అరెస్టు చేశారు. దీంతో మాట మార్చిన అగ్రిగోల్డ్‌ యాజమాన్యం హాయ్‌ల్యాండ్‌ తమదేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే హాయ్‌ల్యాండ్‌ను వేలం వేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో దాన్ని ఎవరైనా సరే వేలంలో పోటీ పడి కొనుక్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని వార్తలు