‘ఉపాధి’ పనుల్లో టీడీపీ నేతల మేత

6 Jun, 2019 04:33 IST|Sakshi

ఎన్నికల ముందు నారా లోకేశ్‌ అండతో పనులు దక్కించుకున్న వైనం 

ప్రతిరోజూ ప్రభుత్వానికి రూ.15 కోట్ల దాకా బిల్లులు 

జూన్‌లో మొదటి నాలుగు రోజుల్లోనే రూ.37 కోట్ల బిల్లులు 

25 శాతానికి పైగా పనులు చేశామంటున్న టీడీపీ నాయకులు

సాక్షి, అమరావతి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తెలుగుదేశం పార్టీ నాయకుల దోపిడీ కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ముందు అప్పటి మంత్రి నారా లోకేశ్‌ అండతో ఈ పథకం కింద రూ.వేల కోట్ల విలువైన పనులను టీడీపీ నేతలు దొడ్డిదారిన దక్కించుకున్నారు. ఆయా పనులు పూర్తి చేశామంటూ ఇప్పటికీ ప్రతిరోజూ రూ.15 కోట్ల దాకా బిల్లులను ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు. జూన్‌ 1 నుంచి 4వ తేదీల మధ్య కేవలం నాలుగు రోజుల వ్యవధిలో రూ.37 కోట్ల బిల్లులు చెల్లించాలంటూ ఫండ్‌ ట్రాన్స్‌పర్‌ ఆర్డర్లు(ఎఫ్‌టీవో) ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ మంత్రిగా ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖలో ఒక్క ఉపాధి హామీ పథకం విభాగంలోనే ఎన్నికల ముందు దాదాపు రూ.6,584 కోట్ల విలువైన 1,12,347 పనులను తెలుగుదేశం పార్టీ నేతలకు నామినేషన్‌ కింద కట్టబెట్టారు. నిధులు లేకపోయినా ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా పనులు అప్పగించారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీకి ముందే ఉపాధి హామీ పథకంలో సిమెంట్‌ రోడ్లు వంటి పనులు చేసిన వారికి ప్రభుత్వం రూ.1,605 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్, మే నెలలతోపాటు జూన్‌లో నాలుగు రోజులకు మొత్తం రూ.586 కోట్ల దాకా పనులు చేసినట్టు బిల్లులు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. మొత్తంగా రూ.2,191 కోట్ల బిల్లులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 

ప్రారంభం కాని పనులు రద్దు 
ఉపాధి హామీ పథకంలో 2019 ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి రూ.34,758 కోట్ల విలువైన 20 లక్షల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన 10.22 లక్షల పనులు మొదలై పురోగతిలో ఉన్నాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి ప్రారంభం కాని పనులు రద్దు, 25 శాతం లోపే జరిగిన పనులకు బిల్లుల చెల్లింపులు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలోనూ కొన్ని పనుల రద్దుకు చర్యలు తీసుకున్నారు. ప్రారంభం కాని 8.91 లక్షల పనులతో పాటు 25 శాతం లోపే జరిగిన 3.80 లక్షల పనులను సైతం నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ అవే పనులను తప్పనిసరిగా చేపట్టాల్సి వస్తే కలెక్టర్, డ్వామా పీడీ నేతృత్వంలోని కమిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 25 శాతానికిపైగా జరిగిన పనుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తెలుగుదేశం పార్టీ నేతలకు ఇదే వరంగా మారింది. తాము 25 శాతానికి పైగానే పనులు చేశామంటూ ప్రభుత్వానికి బిల్లులు సమర్పిస్తున్నారు. వెంటనే నిధులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు