తమ్ముళ్లలో ఓటమి భయం

11 Apr, 2019 04:43 IST|Sakshi

ఫ్యాను స్పీడు చూసి చేతులెత్తేస్తున్న టీడీపీ నేతలు, అభ్యర్థులు 

వైఎస్సార్‌సీపీ గెలుపుపై సర్వేల స్పష్టీకరణతో కలవరం

చంద్రబాబు ప్రచారానికి స్పందన శూన్యమంటున్న నాయకులు

డబ్బు వెదజల్లుతున్నా ఓట్లు పడతాయనే నమ్మకం లేక బెంబేలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఖాయమని సర్వేలన్నీ ఘోషిస్తుండడం, క్షేత్ర స్థాయిలో ఫ్యాను ఫుల్‌ స్పీడ్‌లో తిరుగుతున్నట్టుగా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయి. ఎక్కడికక్కడ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండడంతో వారంతా ఓటమి భయంతో వణికిపోతున్నారు. పార్టీ అధినేత ఇస్తున్న భరోసాతో పోలింగ్‌ సమయానికైనా మార్పు వస్తుందని ఎదురుచూసిన నాయకులు, క్యాడర్‌ అంతకంతకూ పెరిగిపోతున్న ఫ్యాను గాలి హోరును తట్టుకోలేక బెంబేలెత్తుతున్నారు. పోలింగ్‌కు ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండగా.. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు సైలెంట్‌ అయిపోవడం పార్టీలో నెలకొన్న అభద్రత వాతావరణాన్ని స్పష్టం చేస్తోంది. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో తమను కొట్టినవారు లేరని, ఎంత హడావుడి చేసినా ఈ విషయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తమ ముందు నిలవలేరని చెప్పుకునే టీడీపీ క్యాడర్‌ తాజా పరిణామాలతో బెంబేలెత్తిపోతోంది.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, క్యాడర్‌ వ్యూహాత్మకంగా ముందుకెళుతూ, ఊహించని విధంగా పనిచేస్తుండడం టీడీపీ నేతలకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలోనే పలువురు అభ్యర్థులు పోలింగ్‌కు ముందే చేతులెత్తేసిన ఉదంతాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా.. టీడీపీకి బలమైన జిల్లాలుగా చెప్పుకునే కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనే ఈ తరహా పరిస్థితి నెలకొనడం గమనార్హం. కృష్ణా జిల్లాలో టీడీపీ గెలుపు గ్యారంటీ అని ప్రచారం చేసిన రెండు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఊహించని రీతిలో పుంజుకుని పనిచేయడంతో అధికార పార్టీ అభ్యర్థులు కంగారుపడుతున్నారు. ఈ మూడు జిల్లాల్లో పలు స్థానాల్లో టీడీపీ మూడో స్థానంలోకి వెళ్లిపోయే పరిస్థితులు నెలకొనడంతో పార్టీ అధినాయకత్వమే ఆందోళన చెందుతోంది. ఉత్తరాంధ్రలోనూ పలుచోట్ల టీడీపీ అభ్యర్థులు ఆశలు వదిలేసుకున్నారనే సమాచారం ఆ పార్టీ నేతల్లో గుబులు రేకెత్తిస్తోంది. 

విషం కక్కినా స్పందన శూన్యం
చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ప్రచారం కూడా క్యాడర్‌లో ఊపు తేలేకపోయిందని, ప్రజల్లో ఏమాత్రం సానుకూల వాతావరణం తేలేకపోయిందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. ప్రతిరోజూ ఎనిమిది, తొమ్మిది నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం, రోడ్‌ షోలు నిర్వహించారు. తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా వైఎస్‌ జగన్‌పై విషం కక్కడానికే ఎక్కువ సమయం వెచ్చించినా జనాన్ని మెప్పించలేకపోయారని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఎక్కడా ఆశించిన స్థాయిలో ప్రజాదరణ రాలేదని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. విపక్ష నేత వైఎస్‌ జగన్‌తో పాటు విజయమ్మ, షర్మిల ప్రచార సభలకు జనం పోటెత్తగా.. చంద్రబాబు సభలు మాత్రం తేలిపోయాయనే వాదన పార్టీలోనే వినిపిస్తోంది. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో సోమవారం ఉదయం జగన్, సాయంత్రం చంద్రబాబు నిర్వహించిన సభలకు వచ్చిన జనాన్ని వారు పోల్చి చూపుతున్నారు. కృష్ణాజిల్లా మైలవరంలో జగన్‌ సభకు 50 వేల మందికిపైగా వచ్చిన నేపథ్యంలో.. వెంటనే చంద్రబాబు సభ నిర్వహించేందుకు అక్కడి టీడీపీ అభ్యర్థి, మంత్రి దేవినేని ఉమా వెనుకంజ చేసి రద్దు చేసుకున్నారు. మరికొన్నిచోట్లా ఇలాంటి పరిస్థితులే చోటుచేసుకోవడం గమనార్హం.

డబ్బు వెదజల్లినా.. 
ఆఖరి ప్రయత్నంగా నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి ఓట్లు దండుకోవాలనే వ్యూహం కూడా బెడిసికొట్టిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లకు వెయ్యి నుంచి రెండు వేలు, కొన్నిచోట్ల మూడు, నాలుగు వేలు ఇస్తున్నా, ఇస్తామని ఆశ చూపిస్తున్నా ఆ ఓట్లు తమకు పడతాయనే నమ్మకం కుదరని పరిస్థితి ఉందని అంటున్నారు. చంద్రబాబు ఆయన కోటరీ.. అన్ని నియోజకవర్గాలకు చాలారోజుల ముందే భారీ ఎత్తున డబ్బు మూటలు పంపినట్లు ప్రచారం జరిగింది. నియోజకవర్గానికి రూ.25 నుంచి రూ.30 కోట్లు, కొన్ని నియోజకవర్గాలకు రూ.50 కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు సిద్ధమైనా ప్రజల్లో కనీస స్పందన కూడా కనిపించకపోవడంతో టీడీపీ నాయకులు ఓటమి భయంతో వణికిపోతున్నారు. డబ్బు ఖర్చు పెట్టినా ఫలితం ఉండదనే అభిప్రాయంతో పలుచోట్ల నాయకులు డబ్బు పంచడం లేదనే ప్రచారం జరుగుతోంది. 

విఫలమైన చంద్రబాబు వ్యూహం
ఎన్నికలకు కొద్దినెలల ముందు ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లో అనూహ్య ఆదరణను తీసుకొస్తాయని టీడీపీ నాయకత్వం, నేతలు భావించారు. అయితే క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఆదరణ లభించకపోవడంతో వారికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పోలింగ్‌కు ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యేలా ఇచ్చిన పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, రైతు రుణమాఫీ చెక్కులు క్యాష్‌ అయ్యే పరిస్థితి లేకపోవడంతో ఆయా వర్గాల నుంచి టీడీపీ నేతలు తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సివచ్చింది. వాస్తవానికి.. ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేని నేపథ్యంలో ఈ మూడింటి వల్ల క్షేత్ర స్థాయిలో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ముఖ్య నేతలు భావించారు. అయితే ఈ మూడు పథకాలకు సంబంధించి కొన్నిచోట్ల లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ అయినా.. పెద్దగా సానుకూల వాతావరణం ఏర్పడలేదని, ప్రభావాలు, ప్రలోభాలకు మించి ఫ్యాను జోరు ఉందని టీడీపీ నాయకులు, ఆ పార్టీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గట్టెక్కిస్తాయనుకున్న నిరుద్యోగ భృతి, పింఛను పెంపు, అన్న క్యాంటీన్లు వంటివి కూడా ఆదుకునే పరిస్థితి లేదంటూ బిక్కమొహం వేస్తున్నారు.

మరిన్ని వార్తలు