ప్రలోభాలకు గురి చేస్తే ఊచలు లెక్కించాల్సిందే

9 Mar, 2020 13:33 IST|Sakshi

అధికార పార్టీని ఎదుర్కోవడం ఎలా?

ప్రధాన ప్రతిపక్ష పార్టీలో అంతర్మథనం

నవరత్న పథకాల జోష్‌తో వైఎస్సార్‌సీపీ  

ఏకగ్రీవాల వైపు అధికార పార్టీ  మొగ్గు

ఓటమి భయంతో ప్రతిపక్షంలో ఆందోళన

స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగింది. రాజకీయ పార్టీలు స్థానిక సమరానికి సిద్ధమయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి మొదలుకానుంది. పోలింగ్‌కు ఎక్కువ సమయం లేకపోవడం..ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ప్రభుత్వం కట్టుదిట్టంగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తుండడంతో ప్రతిపక్ష పార్టీ నేతల వెన్నులో వణుకు పుడుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నవరత్న పథకాలతో జనరంజక పాలన కొనసాగిస్తోంది. పేద ప్రజల చెంతకే సంక్షేమ పథకాలు ఫలాలు వెళ్తుండడంతో పల్లెపోరులో అధికార పార్టీకి మంచి ఆదరణ లభిస్తోంది.

సాక్షి, నెల్లూరు: జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. పల్లె పోరుకు సర్వం సిద్ధమైంది. తొలుత 46 జెడ్పీటీసీ, 562  ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అనంతరం మున్సి³ల్, పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటనతో నోటిషికేషన్‌ విడుదలకు సిద్ధం అయ్యారు. ముందుగా స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల పక్రియ ముగియడంతో పల్లెల్లో రాజకీయ పార్టీ నేతలు పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ నెలఖారులోగా అన్ని ఎన్నికలకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో  ఎన్నికల నిర్వహణ వేగంగా సాగుతోంది.

ప్రలోభాలకు గురిచేస్తే ఊచలు లెక్కించాల్సిందే..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా నోట్లు, మద్యం పంపిణీ చేస్తే  తప్పక ఊచలు లెక్కించాల్సిందే. అంతేకాకుండా అనర్హత వేటు వేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చింది. మునుపెన్నడూ లేని విధంగా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఆర్డినెన్స్‌ను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈ విధానం ప్రతిపక్ష పార్టీలకు గుదిబండలా మారింది. 8 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ  ఘోరంగా ఓటమిపాలైంది. ఇప్పుడిప్పుడే  ఓటమి నుంచి కోలుకుంటోంది. ఈ సమయంలో మరోసారి పల్లెపోరులో అదే ఓటమి వెక్కిరిస్తే తమ ఉనికికే ప్రమాదమన్న సంకేతాలు వస్తుండడంతో వారిలో వణుకుపుడుతోంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే నవరత్న పథకాలను అమలు చేస్తూ రాజకీయ పార్టీలకు అతీతంగా పేదవర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ ప్రజలకు చేరువవుతుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ నేతలు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు జంకుతున్నారు. ఓటర్లను మద్యం, నోట్లుతో ప్రలోభానికి గురి చేస్తే తప్పక జైలుకు వెళ్లాల్సి వస్తుండడంతో పాటు అనర్హత వేటు పడే అవకాశం ఉండడంతో వారిలో ఆందోళన మొదలైంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుంటే కనీసం డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదు. ఈ క్రమంలో స్థానిక పోరును ఎలా ఎదుర్కోవాలని వారిలో భయం పట్టుకుంది. 

ఓటమి భయంతోనే..
జిల్లాలో జరిగే స్థానిక పోరులో ఓటమి భయం పట్టుకోవడంతో టీడీపీ నేతలు మున్సిపల్‌ ఎన్నికలను అడ్డుకునేందుకు న్యాయస్థానం మెట్లు ఎక్కారన్న విమర్శలు ఉన్నాయి. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు గూడూరు మున్సిపాలిటీ ఎన్నికలపై వార్డుల పునర్విభజన సరిగాలేదని కోర్టుకెళ్లి ఎన్నికలను అడ్డుకోవడం వెనుక ఓటమి భయం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ పథకాల అమలుతో అధికార పార్టీకి ప్రజల్లో ఆదరణ లభిస్తుండడంతో పాటు జిల్లాలో ఆది నుంచి కూడా టీడీపీకి సరైన ఆదరణ లేదు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీని జిల్లా ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు.  ఏ ఎన్నికలు వచ్చినా కూడా వైఎస్సార్‌సీపీ తిరుగులేని బావుటా ఎగురువేస్తూ వస్తోంది. దీనికి తోడు అధికారంలోకి రాగానే  ఎన్నికల హామీలను నెరవేర్చుతూ  పేదవర్గాలకు న్యాయం చేస్తోంది. ఈ క్రమంలో స్థానిక పోరురావడంతో మంచి జోష్‌లో ఉన్న అ«ధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనే శక్తి ప్రతి పక్షాలకు లేదు. దీంతో ఎలాగైనా ఎన్నికలను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు.  

ఏకగ్రీవాలపైనే దృష్టి  
పల్లెపోరులో సాధ్యమైనంత వరకు ఏకగ్రీవాలు చేసేందుకు అధికార పార్టీ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కువగా ఏకగ్రీవాలే చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చారు. దీంతో స్థానిక శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం ఏకగ్రీవాలు చేసేందుకు  ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీకి ప్రజల్లో ఆదరణ లేకపోవడంతో ఆ పార్టీ నేతలు పోటీలో నిలబడేందుకు జంకుతున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు ఏకగ్రీవాలవైపే మొగ్గుచూపుతున్నారు.

మరిన్ని వార్తలు