ఎమ్మెల్యే అనుచరుల డిష్యుం.. డిష్యుం..

8 Jan, 2018 11:49 IST|Sakshi

సీఎం సభకు జనం తరలించే విషయంలో విభేదాలు

ఒకరి పరిస్థితి విషమం

నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలింపు

బండిఆత్మకూరు: సిద్ధాపురం ఎత్తిపోతల పథకం ప్రారంభంలో భాగంగా ముఖ్యమంత్రి సభకు జనం తరలించే విషయం టీడీపీ నేతల మధ్య విభేదాలుకు కారణమైంది. దీంతో సింగవరంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అనుచరులు ఒకరిపై మరొకరు కట్టెలతో దాడులు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...ఎమ్మెల్యేకు గ్రామానికి చెందిన రామసుబ్బయ్య ఒకవైపు, వెంకటసుబ్బయ్య, నాగేష్, బూరగయ్య సోదరులు మరోవైపు అనుచరులుగా ఉన్నారు.  ముఖ్యమంత్రి సభ కోసం ఇరువర్గాలకు రెండు బస్సులు పంపించారు. దీంతో ఎవరి బస్సులో వారు పట్టుదలతో సీఎం సభకు జనాలను తరలించారు.   సీఎం సభ ఆవరణలో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

ఆ తర్వాత రాత్రి  ఇరువర్గాల వారు ఇంటికి చేరుకున్నారు.  రామసుబ్బయ్య వర్గానికి చెందిన మల్లయ్య బైక్‌పై వెళ్తుండగా వెంకటసుబ్బయ్య, బూరగయ్య, నాగేష్‌లు కట్టెలతో దాడి చేశారు. దీంతో రామసుబ్బయ్య వర్గానికి చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రతీకార దాడులు చేశారు. ఈ క్రమంలో బూరగయ్య, వెంకటసుబ్బయ్య, నాగేష్‌లకు గాయాలు కావడంతో అక్కడి నుంచి వారు పరారయ్యారు. ఈ క్రమంలో వారు మొదట దాడి చేసిన మల్లయ్య తలపై రక్తస్రావం కావడంతో అతని పరిస్థితి సీరియస్‌గా మారింది. ఎస్‌ఐ విష్ణునారాయణ గ్రామానికి వచ్చి ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మల్లయ్య పరిస్థితి విషమించడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు