ఏమైనా చేసుకోండి..సీఎం సభకు జనం రావాలి!

17 May, 2018 11:06 IST|Sakshi

సీఎం సభకు ప్రజలను తరలించేందుకు బెదిరింపులు

ప్రతి గ్రూపులో మహిళ కచ్చితంగా రావాల్సిందే..

లేదంటే ఆ గ్రూపు రుణాలు మంజూరు చేయం

వెలుగు సిబ్బందికి అధికారుల హుకుం = అదే బాటలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌

కందుకూరు రూరల్‌: కందుకూరు పట్టణంలోని మార్కెట్‌ యార్డులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నీరు–ప్రగతిపై గురువారం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ప్రజలను తరలించే పనిలో అధికారులు తలమునకలవుతున్నారు. ‘మీరు ఏమైనా చేసుకోండి సీఎం సభకు ప్రజల అధిక సంఖ్యలో రావాల’ని జిల్లా ఉన్నతాధికారులు మండల స్థాయి అధికారులకు హుకుం జారీ చేశారు. దీంతో మండలాల్లోని అధికారులు బెదిరింపులకు దిగారు. ‘డ్వాక్రా గ్రూపుల్లోని ప్రతి మహిళ సీఎం సభకు హాజరు కావాలి. గ్రామ సమైక్య అధ్యక్షరాలిదే ఆ బాధ్యత. ప్రతి గ్రూపు లీడరు గ్రూపులోని సభ్యులను తీసుకురావాలి. లేదంటే ఆ గ్రూపు సభ్యులకు రుణాలు మంజూరు చేయమ’ని వెలుగు అధికారులు బెదిరింపులకు దిగారు.

లీడర్లు చెప్పిన మాట గ్రూపులోని సభ్యులందరూ వినడం లేదని చెప్పినప్పటికీ ‘ఏం చేసుకుంటారో ఏమో మాకు తెలియదు కచ్చితంగా ప్రతి గ్రూపు సభ్యురాలు సభకు హాజరు కావాలని, సభ ప్రాంగణంలో హాజరు తీసుకుంటామ’ని హెచ్చరిస్తున్నారు. గైర్హాజరైన వారికి వెలుగు ద్వారా ఎటువంటి లబ్ధి చేకూరదని చెబుతున్నారు. వేసవి కాలంలో సభలకు రావాలంటే అయ్యే పని కాదని, అధికారులు బెదిరించడం ఏమిటని డ్వాక్రా మహిళలు పెదవిరిస్తున్నారు. అదే విధంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం అధికారులు కూడా ‘వెలుగు’ రూట్‌లో నడుస్తున్నారు. సభకు వచ్చే కూలీలకు ఒక రోజు మస్టర్‌ వేస్తామని చెబుతున్నారు. ‘పనులు చేయకపోయినా ఫర్వాలేదు. సీఎం సభకు రావాల’ని అధికారులు ఆదేశాలిస్తున్నారు. అదే విధంగా ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలకు సంబంధించిన బస్‌లు ప్రజలను తరలించేందుకు వినియోగించాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలిచ్చారు. కనీసం ఆయిల్‌ ఖర్చులు కూడా ఇవ్వకుండా ప్రజలను తరలించాలని చెప్పడంతో ఆయా పాఠశాలలు, కళాశాలల యజమానులు మండిపడుతున్నారు. ప్రతిసారీ తాము సొంత ఖర్చులు ఎలా భరించగలమని ఆవేదన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు