‘దేశం’ ఖాళీ

19 Aug, 2019 10:54 IST|Sakshi

గ్రేటర్‌ టీడీపీ జీరో  

బీజేపీలో చేరేందుకు నేతల క్యూ  

కాంగ్రెస్‌ నాయకులు సైతం  

సాక్షి, సిటీబ్యూరో: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నగరంలో జీరో అయింది. ఆ పార్టీలో మిగిలిన ఒకరిద్దరు నాయకులు సైతం బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం పార్టీ ఎల్బీనగర్, శేరిలింగంపల్లి ముఖ్య నాయకులు సామ రంగారెడ్డి, మొవ్వ సత్యనారాయణ బీజేపీలో చేరగా... రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్, ఆయన కుమారుడు వీరేందర్‌గౌడ్‌ త్వరలో బీజేపీలో చేరాలని నిర్ణయించారు. శాసనసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కూన వెంకటేశ్‌గౌడ్, పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక నందమూరి సుహాసిని, భవ్య ఆనంద్‌ ప్రసాద్‌ నియోజకవర్గాల వైపే చూడడం లేదు. పార్టీ తరఫున గెలిచిన ఏకైక కార్పొరేటర్‌ శ్రీనివాసరావు సైతం టీఆర్‌ఎస్‌లో చేరగా... మిగిలిన చిన్నాచితకా నాయకులంతా బీజేపీలో మూకుమ్మడిగా చేరిపోవాలని నిర్ణయించారు. రంగారెడ్డితో పాటు హైదరాబాద్‌లోనూ సీనియర్‌ నాయకుడిగా గుర్తింపు పొందిన దేవేందర్‌గౌడ్‌ ఈ నెల 22న ఢిల్లీలో బీజేపీ సీనియర్‌ నేతలతో భేటీ అనంతరం సెప్టెంబర్‌ 17న నగరంలో అమిత్‌షా సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉంది. 

కాంగ్రెస్‌ నేతలూ...
కాంగ్రెస్‌లో ఇమడలేని, అసంతృప్త నాయకులంతా బీజేపీలో చేరే యోచనలో ఉన్నారు. ఇప్పటికే మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించగా, కుత్బుల్లాపూర్‌కు చెందిన కొలను హన్మంతరెడ్డి సైతం పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చారు. మరోవైపు టీఆర్‌ఎస్‌లోని అసంతృప్త నాయకులను సైతం తమవైపు మళ్లించుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల లోపు ముఖ్య నాయకులందరినీ ఆకర్షించే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది.

మరిన్ని వార్తలు