వైఎస్సార్‌ సీపీలోకి  భారీ చేరికలు

2 Sep, 2019 06:47 IST|Sakshi

జిల్లాకు చెందిన ప్రముఖ నేతలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో సార్వత్రిక ఎన్నికల తర్వాత కొన ఊపిరితో ఉన్న టీడీపీకి కోలుకోలేని షాక్‌ తగిలింది. విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు తనయుడు, కృషి ఆస్పత్రి చైర్మన్, డెయిరీ ట్రస్ట్‌ సీఈవో ఆడారి ఆనంద్, డెయిరీ డైరెక్టర్, యలమంచిలి మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారి సహా పలువురు నాయకులు అమరావతిలో వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. 

సాక్షి, అనకాపల్లి: విశాఖ జిల్లాకు చెందిన ప్రముఖ నేతలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో సార్వత్రిక ఎన్నికల తర్వాత కొన ఊపిరితో ఉన్న టీడీపీకి ఊహించని షాక్‌ తగిలినట్లైంది. విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు తనయుడు, కృషి ఆస్పత్రి చైర్మన్, డెయిరీ ట్రస్ట్‌ సీఈవో ఆడారి ఆనంద్, డెయిరీ డైరెక్టర్, యలమంచిలి మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పిళ్లా రమాకుమారితో సహా పలువురు నాయకులు అమరావతిలో వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆదివారం   పార్టీలో చేరారు. ఆనంద్‌ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

దశాబ్దాల కాలంగా టీడీపీలో కొనసాగిన ఆనంద్‌ కుటుంబసభ్యులు, డెయిరీ డైరెక్టర్లు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరితోపాటు విశాఖ డెయిరీ డైరెక్టర్లు మలసాల రమణరావు (కశింకోట మండలం), గేదెల సత్యనారాయణ (బుచ్చెయ్యపేట మండలం), దాడి గంగరాజు (చోడవరం), శీరంరెడ్డి సూర్యనారాయణ (చీడికాడ మండలం), సుందరపు గంగాధర్‌ (కె.కోటపాడు), శరగడం శంకరరావు (పెందుర్తి), రెడ్డి రామకష్ణ (పాయకరావుపేట), చిటికల రాజకుమారి(నర్సీపట్నం), గౌరీశంకర్‌ (యలమంచిలి), కోళ్ల కాటమయ్య(ఎస్‌.కోట), ఆరంగి రమణబాబు (అచ్చెర్ల), శీరంరెడ్డి సూర్యనారాయణ (నర్సీపట్నం) తదితర డైరెక్టర్లు వైఎస్సార్‌సీపీలో చేరినవారిలో ఉన్నారు. రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి,  జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడు, అదీప్‌రాజు, పెట్ల ఉమాశంకర్‌ గణేష్, అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు శరగడం చినఅప్పలనాయుడు, మజ్జి శ్రీనివాస్‌ (చిన్న శ్రీను), జి.వి.తదితరులు పాల్గొన్నారు.

యలమంచిలి నుంచి.. :
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో యలమంచిలికి చెందిన జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఆడారి శ్రీధర్, ఊటకూటి రమేష్, గొంతిన హరీష్, నగిరెడ్డి కాసుబాబు ఉన్నారు.

చోడవరం నుంచి..:
గోవాడ చక్కెర కర్మాగారం మాజీ చైర్మన్‌ దొండా కన్నబాబు, మాజీ ఎంపీపీ పినపోలు వెంకటేశ్వరరావు, బుచ్చెయ్యపేట మాజీ మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు దాడి సూర్యనాగేశ్వరరావు, సూరిశెట్టి రామ సత్యనారాయణవైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.

ఆర్‌ఈసీఎస్‌ మాజీ చైర్మన్‌ బొడ్డేడ చేరిక.. 
ఆర్‌ఈసీఎస్‌ మాజీ చైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌ సొంత గూటికి తిరిగి చేరారు. బొడ్డేడ ప్రసాద్‌తోపాటు వైఎస్సార్‌సీపీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి అప్పారావు కూడా తిరిగి వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.

పార్టీకి మరింత బలం: మంత్రి అవంతి 
విశాఖ డెయిరీ డైరెక్టర్లంతా వైఎస్సార్‌సీపీలో చేరడంతో జిల్లాలో పార్టీ మరింత బలం పుంజుకుంటుందని పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో విశాఖ డెయిరీ డైరెక్టర్లు వైఎస్సార్‌సీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  డెయిరీ పరిధిలోని రైతులకు అండగా ఉండి న్యాయం చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన భరోసాతో డెయిరీ డైరెక్టర్లంతా వైఎస్సార్‌సీపీలో చేరారన్నారు. జిల్లాలో పార్టీ మరింత బలోపేతమైందని, రానున్న కాలంలో మరికొంతమంది ముఖ్యనేతలు వైఎస్సార్‌సీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 

రైతు పక్షపాతి జగన్‌: ఆడారి ఆనంద్‌
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పట్ల చూపిస్తున్న ఆదరణ, ప్రేమ చూసి తాము వైఎస్సార్‌సీపీలో చేరామని కృషి ఆస్పత్రి చైర్మన్‌ ఆడారి ఆనంద్‌ తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన అనంతరం ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. విశాఖ డెయిరీ సంక్షేమం కోసం తాము వైఎస్సార్‌సీపీలో చేరామన్నారు. మొదటి నుంచి ముఖ్యమంత్రి రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయన నాయకత్వంలో రైతులకు న్యాయం జరుగుతుందని భావించి తాము వైఎస్సార్‌సీపీలో చేరామన్నారు. విశాఖ డెయిరీ పరిధిలోని మూడు జిల్లాలకు చెందిన రెండున్నర లక్షల కుటుంబాలకు జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటారని భరోసా ఇచ్చారని ఆనంద్‌ చెప్పారు. డెయిరీ డైరెక్టర్లందరూ సంపూర్ణంగా వైఎస్సార్‌సీపీలో చేరడం వెనుక రైతులకు న్యాయం చేయాలనే ధృక్పథం ఉందన్నారు. జగన్‌ నాయకత్వంలో రాష్ట్రంలోని రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు.

మరిన్ని వార్తలు