పోస్టల్‌ ఓట్లకు నోట్ల గాలం!

2 Apr, 2019 08:01 IST|Sakshi
మైలవరంలో పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకుంటున్న వారి వద్ద నిలబడి పైరవీలు చేస్తున్న టీడీపీ నాయకులు 

కృష్ణాజిల్లా మైలవరంలో ప్రలోభాలకు దిగిన టీడీపీ 

ఆశా, అంగన్‌వాడీ వర్కర్లకు ఎర

ఓటుకు రూ.వేయి, మూడువేలు ఇస్తామంటూ వల

శిక్షణా శిబిరంలోనే తంతు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు

సాక్షి, అమరావతి బ్యూరో/మైలవరం : జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించారు. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఓటర్లను విపరీతమైన ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో గెలుపోటములను నిర్దేశించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై అధికార టీడీపీ నేతలు గురిపెట్టారు. ఓటుకు రూ. వేయి, రెండు, మూడు వేలు ఇచ్చయినా పోస్టల్‌ బ్యాలెట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. సోమవారం మైలవరంలోని డాక్టర్‌ లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ నాయకులు పైరవీలు చేస్తూ కనిపించడమే  ఇందుకు నిదర్శనం. 

శిక్షణా శిబిరం వద్దే ప్రలోభాల పర్వం 
రెండు రోజులుగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్‌ అధికారులకు, సహాయకులకు ఈవీఎమ్‌లు, వీవీ ప్యాట్‌ల వినియోగంపై శిక్షణా కార్యక్రమం జరుగుతోంది. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 1200 మంది హాజరయ్యారు. వీరు ఈ నెల 11న జరిగే ఎన్నికల విధులకు హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వారికి ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను అందజేశారు. దీంతో వారు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు శిక్షణా  కేంద్రం వద్దకు చేరుకుని బ్యాలెట్‌ బాక్స్‌ వద్ద ఉండి మరీ ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేశారు. 

తపాలా ఓట్లపై నోట్ల వర్షం.. 
జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 వేల మంది ఉద్యోగుల కోసం జిల్లా వ్యాప్తంగా తపాలా బ్యాలెట్‌ నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటు జయాపజయాలను నిర్ణయించేది కావడంతో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ముందుగానే ప్రలోభాలకు తెర తీశారు. వారం, పది రోజుల నుంచి ఆ పార్టీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లోని ఉద్యోగుల వివరాలు సేకరించారు. తరువాత బేరాలకు దిగారు. నేరుగా ఉద్యోగులను, లేదా ఉద్యోగుల బృందాలను, సంఘాల నేతలను కలవడం, డబ్బు గుమ్మరించడం చేశారు. ఓటుకు రూ. వేయి నుంచి రూ. 3,000 వరకు ముట్టజెప్పినట్లు సమాచారం. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే తంతు కొనసాగింది.  అలాగే పోలీసుల ఓట్లు తమ పార్టీకి అనుకూలంగా వేయించేలా నియోజకవర్గానికి ఓ డీఎస్పీని నియమించి బ్యాలెట్‌ పత్రాలు ఆ ఉన్నతాధికారికే ఇవ్వాలని పోలీసులపై ఒత్తిడి చేస్తుండటం తెలిసిందే. 

రహస్యం కాస్త బహిరంగం 
రహస్యంగా జరగాల్సిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఎటువంటి రక్షణ లేకుండా బహిరంగంగా నిర్వహించడంపై ఎన్నికల అధికారులపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు దగ్గర ఉండి ఆంగన్‌వాడీ కార్యకర్తలను, ఆశా వర్కర్లను ప్రలోభాలకు గురిచేస్తుండటం పట్ల ఉపాధ్యాయ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. చివరకు మీడియాకు విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. శిక్షణా శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా టీడీపీ నాయకులను బయటకు పంపి చేతులు దులుపుకున్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నాయకులు రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు