దౌర్జన్యం .. భయోత్పాతం! 

10 Apr, 2019 09:20 IST|Sakshi

ఓటమి భయంతో అధికార తెలుగుదేశం పార్టీ బరితెగింపు 

సాక్షి, అమరావతి: విజయావకాశాలపై విశ్వాసం సన్నగిల్లిన తెలుగుదేశం పార్టీ.. దాడులు, దౌర్జన్యాలు, అరాచక శక్తులతో భయోత్పాతం సృష్టించి, తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకునే కుట్రకు తెగబడుతోందా? ఇందుకోసం ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమైందా? కీలక ప్రాంతాల్లో ఘర్షణలతో ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పి లబ్ధి పొందే వ్యూహం రూపొందించిందా? ఈ మేరకు అరాచక శక్తులు మోహరించాయా? ఘర్షణల నెపాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీపై నెట్టేసే ఆలోచన అధికార తెలుగుదేశం చేస్తోందా?.. కేంద్ర ఎన్నికల నిఘా వర్గాలు ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రచారం చివరి ఘట్టంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఈ అనుమానాలకు తావిస్తున్నాయని ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఎన్నికల సంఘానికి నివేదించినట్టు తెలిసింది.

ఎన్ని కుయుక్తులు పన్నినా విజయావకాశాల్లేక.
‘తెలుగుదేశం పార్టీ చొక్కాలేసుకుని వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు దిగుతారనే సమాచారం వచ్చింది‘ అని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా చంద్రబాబు వ్యూహాత్మకంగానే ఆ విధంగా వ్యాఖ్యానించారని కేంద్ర ఎన్నికల నిఘా బృందాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమై అన్ని ప్రాంతాల నుంచి పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించాయి. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆయన తల్లి వైఎస్‌ విజయమ్మ, సోదరి షర్మిల ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి భారీయెత్తున స్పందన లభించింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం పార్టీకి ప్రతికూల వాతావరణం నెలకొందని, ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపే ప్రజల పూర్తి మొగ్గు ఉందని అనేక సర్వేలు స్పష్టం చేశాయి.

ఈ పరిస్థితుల్ని అధిగమించేందుకు చంద్రబాబు.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు వంటి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఎత్తుగడలు వేసినా ఫలితం దక్కలేదు. ఉద్యోగులకు జీతాలు సైతం ఇవ్వకుండా ప్రభుత్వ నిధులన్నీ ఎన్నికల పథకాలకు మళ్లించి ప్రచారం చేసినా పెద్దగా స్పందన రాలేదని టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే స్వయంగా రంగంలోకి దిగి భారీగా డబ్బు, మద్యం పంపిణీ చేసి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నా.. విజయావకాశాలు కనుచూపు మేరలో కూడా కన్పించని నేపథ్యంలో.. చివరకు దాడులు, దౌర్జన్యాలతో భయానక వాతావరణం సృష్టించి, పోలింగ్‌ తమకు అనుకూలంగా జరిగేలా చేసుకోవాలనే కుట్రకు టీడీపీ దిగుతున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది.

ఎన్నికల కమిషన్‌ అప్రమత్తం 
ఈ మేరకు కేంద్ర నిఘా వర్గాలు, ఎన్నికల నిఘా బృందాల నుంచి అందిన సమాచారంతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ అప్రమత్తమైంది. మంగళవారం సాయంత్రం ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ఇతర ప్రాంతాల నుంచి తరలించిన, ఘర్షణలకు సిద్ధం చేసిన అరాచకశక్తులను అదుపులోకి తీసుకోవాలని పోలీసు వర్గాలను ఆదేశించింది. సరిహద్దు ప్రాంతాల్లో బందోబస్తు పటిష్టం చేయాలని ఆదేశించింది. అన్ని ప్రాంతాల్లోనూ నాకాబందీ నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిడులనూ లెక్కచేయొద్దని సూచించింది.  

కీలక స్థానాలే టార్గెట్‌ 
రాష్ట్ర వ్యాప్తంగా 68 స్థానాల్లో ఘర్షణలకు దిగాలని తెలుగుదేశం పార్టీ వ్యూహం పన్నినట్టు  ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి తనయుడు లోకేశ్‌ పోటీ చేస్తున్న మంగళగిరిపై మరింత ప్రధానంగా దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఇక్కడ వైఎస్సార్‌సీపీకి బలమైన ప్రాంతాల్లో అరాచక శక్తులు విరుచుకుపడేలా అంతర్గత ఆదేశాలు వెళ్ళినట్టు తెలిసింది. అవసరమైతే పోలింగ్‌ ఏజెంట్లను రహస్య ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లు  కూడా చేసినట్లు అనుమానిస్తున్నారు.

ఓటర్లను భయపెట్టి తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవడం దీని వెనుక అసలు వ్యూహంగా భావిస్తున్నారు. ఈ మేరకు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, అచ్చెన్నాయుడు, ఆదినారాయణ రెడ్డితో పాటు మరి కొంతమంది మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల స్థానాల్లో ఇప్పటికే అరాచకశక్తులు మోహరించినట్టు తెలుస్తోంది. కరడుగట్టిన టీడీపీ కేడర్‌లోని నేర చరితులను పురిగొల్పడం ద్వారా కూడా భయాందోళనలు సృష్టించాలని టీడీపీ యోచిస్తున్నట్టు తెలిసింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు