అమరావతికి టికెట్ల వేడి!

22 Feb, 2019 11:55 IST|Sakshi

 పోటాపోటీగా టీడీపీ నేతల పైరవీలు

ఈసారి తనకే టికెట్‌ ఇవ్వాలంటూ ఒత్తిళ్లు

బాబు వద్ద కొందరు.. లోకేష్‌ వద్ద మరికొందరు

రాజధానిలోనే తిష్టవేసిన ఆశావహులు

తిరుపతి రేసులో అత్యధిక మంది

టీడీపీ టికెట్ల సెగ రాష్ట్ర రాజధానిని తాకింది. ఎన్నికలు  సమీపిస్తున్న కొద్దీ చోటామోటా నేతల్లో టెన్షన్‌ రెట్టింపవుతోంది. టికెట్ల కోసం ఎవరికి వారు పైరవీలు చేస్తున్నారు. కొందరు నేతలుఅమరావతిలోనే మకాం వేశారు. మరికొందరు అధినాయకత్వం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇంకొందరు బలనిరూపణకు దిగుతున్నారు. ఆశావహులు తమకే టికెట్‌ అంటూ ప్రచారాలకు దిగుతున్నారు.     పెదబాబు, చినబాబు ఏం చేయాలో దిక్కుతోచక తలలు  పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.

సాక్షి, చిత్తూరు, తిరుపతి: ‘పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నాను. ఈసారి టికెట్‌ నాకే ఇవ్వాలి.’ అంటూ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఎవరికివారు అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్‌ని కలిసి విన్నవించుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ సమయం సమీపిస్తుండడంతో జిల్లా టీడీపీ నేతల్లో టెన్షన్‌ మొదలైంది. టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు టికెట్‌ నాదేనని చెప్పుకుని ప్రచారం చేసుకుంటున్నారు. అధికారికంగా ఇప్పటి వరకు టికెట్లు ఖరారు చేయకపోవడంతో ఆశావహులు రాజధాని బాట పట్టారు. ఒకరికి తెలి యకుండా ఒకరు అధినేత చంద్రబాబును, లోకేష్‌ బాబును విడివిడిగా కలుస్తున్నారు. ఎమ్మెల్యే సుగుణమ్మ ఈసారి కూడా తిరుపతి టికెట్‌ తనకే ఇవ్వాలని సీఎం చంద్రబాబును పలుమార్లు కలిసి విన్నవించారు.

గురువారం తుడా చైర్మన్‌ నరసింహయాదవ్‌ సీఎంను కలిశారు. తండ్రి కదిరప్ప నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నామని, తిరుపతిఅసెంబ్లీ టికెట్‌ తనకే ఇవ్వాలని కోరారు. తుడా చైర్మన్‌ తన అనుచరులుతో సీఎంని కలవడం  తీవ్ర చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ద్వారా ఊకా విజయకుమార్‌ కూడా తనకే తిరుపతి టికెట్‌ ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు. తిరుపతికే చెందిన డాక్టర్‌ ఆశాలత గురువారం మంత్రి నారాలోకేష్‌ని కలిసి టికెట్‌ ఇవ్వమని కోరారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా సీఎంని కలిశారు.  తన కుమారుడు బొజ్జల సుధీర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వమని కోరారు. మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు అమరావతిలో తిష్టవేసి తరచూ సీఎ లోకేష్‌ను కలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తి టికెట్‌ తనదేనని ఎస్సీవీకి గట్టిగా హామీ ఇచ్చినట్లు తన అనుచరుల వద్ద స్పష్టం చేశారు. అందుకే ఎస్సీవీ కేబుల్‌ నెట్‌వర్క్‌ని విక్రయించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఒకరికి తెలియకుండా ఒకరు
మదనపల్లెకు చెందిన మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి  టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరూ విడివిడిగా చంద్రబాబుని, లోకేష్‌ని కలిశారు. రామదాస్‌చౌదరి, మరికొందరు మదనపల్లె టికెట్‌   కోసం సీఎంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ మరోసారి  అవకాశం కల్పించాలంటూ తరచూ సీఎంను, మంత్రి లోకేష్‌ను కలిసి వస్తున్నారు. సత్యవేడు విషయానికి వస్తే సిట్టింగ్‌ ఎమ్మెల్యే తలారి ఆదిత్య లోకేష్‌ ద్వారా ఈ సారి కూడా తనకే టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు సత్యవేడు టికెట్‌ హేమలతకు ఇప్పించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ అల్లుడు వేణుగోపాల్‌కి టికెట్‌ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గంగాధరనెల్లూరు కోసం తనూజా చంద్రారెడ్డి, డాక్టర్‌ పద్మజ తనకు అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. టికెట్‌ కోసం ఎవరికి వారు సీఎం, మంత్రిని కలవడంతో పాటు పార్టీ ముఖ్యనాయకులను కలిసి  పైరవీలు చేస్తున్నారు.  జిల్లాలోని అన్ని నియోజక వర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారని, అన్ని అసెంబ్లీ స్థానాల్లో వర్గపోరు కారణంగా అభ్యర్థులను ప్రకటించటానికి చంద్రబాబు వెనుకడుగు వేస్తుండడం గమనార్హం.

మరిన్ని వార్తలు