ముగ్గురు ‘దేశం’ నేతలపై విచారణ

16 May, 2018 07:02 IST|Sakshi

తూర్పుగోదావరి, అమలాపురం టౌన్‌: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పపై సోషల్‌ మీడియాలో అమలాపురానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు వ్యక్తిగతంగా విమర్శిస్తూ చేసిన కామెంట్లపై పట్టణ సీఐ సీహెచ్‌ శ్రీరామ కోటేశ్వరరావు మంగళవారం కూడా విచారించారు.

3వ వార్డు మున్సిపల్‌  కౌన్సిలర్, టీడీపీ నాయకుడు దున్నాల దుర్గ, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు రేకపల్లి ప్రసాద్‌లను మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు. రాజప్ప ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి దివంగత డాక్టర్‌ మెట్ల సత్యనారాయణరావుపై చేసిన వ్యాఖ్యలపై పట్టణ టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. రాజప్పపై పోస్టులు పెట్టారన్న ఆరోపణలు, ఆధారాలతో కౌన్సిలర్‌ దుర్గ, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు ప్రసాద్‌లను విచారించి సాయంత్రం నుంచి పంపించారు.

అలాగే మరో టీడీపీ నాయకుడు గంధం శ్రీను, సోషల్‌ మీడియాలో పోస్టులు క్రియేట్‌ చేశాడన్న అభియోగంపై ఆర్డీఎస్‌ ప్రసాద్‌లను కూడా సాయంత్రం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మరోవైపు పట్టణంలో రౌడీ షీటర్లపై కూడా విచారణ జరుగుతోంది. వారి కదిలికపై పోలీసులు దృష్టి పెట్టారు.

కొందరు రౌడీ షీటర్లు కూడా సోషల్‌ మీడియాలో విమర్శనాత్మకమైన పోస్టింగ్‌లు పెట్టినట్లు ఈ సందర్భంగా పోలీసులు గుర్తించారు. వారిని కూడా బుధవారం అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.
అలాగే ఈ నలుగురినీ డీఎస్పీ ఏవీఎల్‌ ప్రసన్నకుమార్‌ కూడా తన కార్యాలయంలో ప్రత్యేకంగా విచారించారు. అయినవిల్లి మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పట్టణానికి చెందిన అదే పార్టీకి చెందిన కొందరు టీడీపీ నాయకులపై సోషల్‌ మీడియాలో రాజప్పకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టింగులపై ఫిర్యాదు చేయడం వల్లే పోలీసులు ఈ విచారణను ముమ్మరం చేశారు.

మరిన్ని వార్తలు