అంత కథ నడిచిందా..

16 Mar, 2019 07:15 IST|Sakshi

పొలిటికల్‌ గాసిప్‌

విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత గురించి ప్రజలు, ప్రతిపక్షాలు కాదు.. స్వయంగా తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రేణులు గొంతుక చించి అరిచే మాటలవి. ఆమెకు టికెట్‌ వద్దంటూ ఏకంగా వేలాదిమంది టీడీపీ కార్యకర్తలు ధర్నాలు, ప్రదర్శనలు చేపట్టారంటే పాయకరావుపేటలో ఆమె ఎంతటి వ్యతిరేకత మూట కట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. తమ డిమాండ్‌ కాదని ఆమెకు సీటు ఇస్తే 30 వేల ఓట్ల తేడాతో ఓడిస్తామని స్వయంగా టీడీపీ నేతలు శపథం కూడా చేశారు. అలాంటి అనితను ఇప్పుడు జిల్లాలు దాటించి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో పోటీ చేయించడం వెనుక చాలా పెద్ద కథ నడిచిందని తెలుస్తోంది.

2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనిత అనతికాలంలోనే లెక్కలేనంత అపకీర్తి సొంతం చేసుకున్నారు. ఎన్నికల వేళ వచ్చేసరికి ఇక టికెట్‌ దక్కదన్న సంకేతాలు ఆమెకు అందాయి. దీంతో ఆమె సరిగ్గా సీఎం చంద్రబాబుకి అత్యంత సన్నిహితులైన ఇద్దరిని రంగంలోకి దింపారని తెలుస్తోంది. ఓ మీడియా అధిపతితో పాటు కేంద్ర మాజీ మంత్రి వకాల్తా పుచ్చుకుని అనితకు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ సీటివ్వాలని బాబుపై ఒత్తిడి చేసినట్టు చెబుతున్నారు. పాయకరావుపేటలో ఆమె కనీస పోటీ ఇవ్వలేరని చంద్రబాబు చెప్పినప్పటికీ అనిత విషయంలో ఆ లెక్కలేమీ చూడొద్దని ఆ ఇద్దరు పెద్దలూ స్పష్టం చేశారట. దీంతో తలపట్టుకున్న చంద్రబాబు.. అనితకు అక్కడే ఇస్తే చాలా బ్యాడ్‌ అయిపోతాం.. వేరే జిల్లాకు పంపిస్తానని మధ్యేమార్గంగా చెప్పడంతో అనిత వకాల్తాదారులు ఓకే చెప్పినట్టు తెలిసింది. ఆ మేరకే రాష్ట్రంలోని అన్ని ఎస్సీ రిజర్వుడ్‌ స్థానాలు వెతికి చివరికి మంత్రి జవహర్‌ స్థానానికి ఎర్త్‌ పెట్టినట్టు చెబుతున్నారు.

కేవలం అనిత కోసమే కొవ్వూరు నుంచి జవహర్‌ను కృష్ణా జిల్లాలో మారుమూల నియోజకవర్గం తిరువూరుకు పంపించారనేది నిర్వివాదాంశం. వాస్తవానికి కొవ్వూరులో జవహర్‌ను వ్యతిరేకిస్తూ టీడీపీ వర్గ నేతలు రెచ్చిపోయినా.. ప్రతిపక్ష నేతను నోటికొచ్చినట్టు తిట్టే జవహర్‌నే ఈసారికి పోటీ చేయిద్దామని చంద్రబాబు భావించారట. కానీ అనితను తరలించడం అనివార్యం కావడంతో జవహర్‌ను పదిహేనేళ్లుగా టీడీపీకి ప్రాతినిధ్యం లేని కృష్ణా జిల్లాలో తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన తిరువూరుకి తరలించేశారు.

కొసమెరుపు ఏమిటంటే.. టీడీపీ తమదే అని భావించే ‘వర్గ’ పెద్దల ప్రాబల్యంతో జిల్లాలు దాటి అనిత టికెట్‌ తెచ్చుకోగా.. పశ్చిమగోదావరి జిల్లాకే చెందిన దళిత ఎమ్మెల్యే పీతల సుజాత ఆ జిల్లా నేతలు మాగంటి బాబు, చింతమనేని ప్రభాకర్‌ అరాచకాలను ప్రశ్నించి టికెట్‌ సాధించలేక పోయారు. 2004లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అయిన పీతల సుజాత 2009లో పునర్విభజన నేపథ్యంలో టికెట్‌ దక్కకపోయినా.. చంద్రబాబునే నమ్ముకుని ఉండిపోయారు. 2014లో చివరి నిమిషంలో చింతలపూడి స్థానానికి ఎవ్వరూ దొరక్కపోవడంతో డెల్టా నుంచి పీతల సుజాతను దిగుమతి చేసినా గెలిచి చూపించారు. కానీ ఈ ఎన్నికలకు మాత్రం ఆమె పనికి రాదని టికెట్‌ నిరాకరించిన చంద్రబాబు ఆ పెద్దల ఒత్తిడికి తలొగ్గి వంగలపూడి అనితను మాత్రం ఏకంగా జిల్లాలు దాటించారు. తెలుగుదేశంలో వర్గ నేతల ప్రాబల్యానికి ‘అనితకు మళ్లీ టికెట్‌’ కంటే ఏం కావాలని ఆ పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
– గరికిపాటి ఉమాకాంత్‌, సాక్షి ప్రతినిధి, విశాఖ

మరిన్ని వార్తలు