బాబోయ్‌ ... మాకొద్దీ టిక్కెట్‌

2 Mar, 2019 08:02 IST|Sakshi
తోట నరసింహం, మాగంటి మురళీమోహన్‌

టీడీపీలో పోటీకి ఆసక్తి చూపించని సిట్టింగ్‌ ఎంపీలు

ఒకరు వైఎస్సార్‌సీపీలోకి రాక

మరో ఇద్దరు పోటీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్న వైనం

సీఎం సమక్షంలో కాకినాడ, రాజమహేంద్రవరం

పార్లమెంటరీ నియోజకవర్గాలపై సమీక్ష

జగ్గంపేట, ప్రత్తిపాడులపై వీడని చిక్కుముడి

సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీకి విచిత్రకరమైన పరిస్థితి ఎదురైంది. ఈసారి వైఎస్సార్‌సీపీకే రాష్ట్ర ప్రజలు పెద్ద పీట వేస్తున్నారని, ఆ పార్టీ అభ్యర్థులే గెలుస్తారని జాతీయ చానెల్స్‌తోపాటు అనేక సర్వే సంస్థలు ప్రకటిస్తుండడంతో టీడీపీకి భయం పట్టుకున్నట్టు ఉంది. వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటంతో ఎంపీలుగా పోటీ చేసేందుకు సిట్టింగులు ఆసక్తి చూపడం లేదు. భారీగా ఖర్చు పెట్టినా లాభం లేదని అనుకుంటున్నారో ఏమో గానీ పోటీకి వెనక్కి తగ్గుతున్నారు.  కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గాలపై విజయవాడలో సీఎం సమక్షంలో శుక్రవారం జరిగిన సమీక్షల్లో సిట్టింగులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది.

ఎందుకిలా...
పార్టీ పరిస్థితి బాగోలేని విషయం, బాబు పాలనను ప్రజలు చీదరించుకుంటున్న వైనం...ఆది నుంచీ సీఎం చంద్రబాబు చేస్తున్న యూ టర్న్‌ గిమ్మిక్కులతో ఓటర్ల నాడి తెలుసుకున్న టీడీపీ నేతలు పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారేమో... ఈసారికి తమకు టిక్కెట్‌ వద్దంటూ సున్నితంగా తిరస్కరిస్తున్నారు. సంకుచితతత్వంతో రాష్ట్రానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని, అవినీతి పెరిగిపోయిందని చెప్పి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. జిల్లాకు సంబంధించి ఇప్పటికే అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. దీంతో అమలాపురం పార్లమెంట్‌కు టీడీపీ నేతలు మరో వ్యక్తిని పెట్టుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక, కాకినాడ ఎంపీ తోట నరసింహం అయితే అనారోగ్య కారణాలుతో ఎంపీగా పోటీ చేయలేనని అధిష్టానానికి చెప్పేశారు. ఈ నేపథ్యంలో తన సతీమణికి జగ్గంపేట అసెంబ్లీ టిక్కెట్‌ కేటాయించాలని పట్టుబడుతున్నారు. మరోవైపు రాజమహేంద్రవరం ఎంపీ, సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాన అనుచరుడైన మురళీమోహన్‌ కూడా పోటీ చేయలేనని చేతులేత్తేశారు. తనకు ఎంపీగా పోటీ చేయాలన్న ఆసక్తి లేదంటూనే తనకున్న డిమాండ్లను చంద్రబాబు ముందు అప్పటికే పెడుతున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని విజయవాడలో జరిగిన పార్టీ సమీక్షలో సీఎం చంద్రబాబుకు నేరుగా చెప్పినట్టుగా పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దీంతో జిల్లాలోని మూడు పార్లమెంట్‌ స్థానాలకు సిట్టింగులు ఆసక్తిచూపకపోవడంతో కొత్తవారిని చూసుకోవల్సిన విచిత్రకరమైన పరిస్థితి ఏర్పడింది.

జగ్గంపేట, ప్రత్తిపాడుపై వీడని చిక్కుముడి...
జగ్గంపేట నుంచి గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి జంపయ్యారు. తనకున్న వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ స్వలాభాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో జగ్గంపేట టిక్కెట్‌ తనకే వస్తుందన్న ధీమాతో జ్యోతుల నెహ్రూ ఉన్నారు.  ఈ పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చేయలేనని చెప్పి, జగ్గంపేట టిక్కెట్‌ తన సతీమణి వాణికి ఇవ్వాలని తోట నరసింహం డిమాండ్‌ చేస్తున్నారు. శుక్రవారం జరిగిన సమీక్షలో ఇదే డిమాండ్‌ పెట్టడంతో జగ్గంపేటపై చంద్రబాబు స్పష్టత ఇవ్వలేకపోయారు. మరోవైపు జ్యోతుల నెహ్రూ మాదిరిగానే పార్టీ ఫిరాయించిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పరిస్థితి కూడా దయనీయంగా ఉంది.

తానొక్కటి తలిచితే మరోటి జరిగిందన్నట్టుగా వరుపుల సుబ్బారావు అడుగులు వేయగా డామిట్‌ కథ అడ్డం తిరిగినట్టు తన మనవడు వరుపుల రాజా రూపంలో ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గెలిపించిన పార్టీని కాదనుకుని వస్తే ఇప్పుడు టిక్కెట్‌ లేదంటూ టీడీపీ అధిష్టానం నుంచి సంకేతాలు అందుతుండటంతో అయోమయంలో పడ్డారు. ప్రస్తుతానికి ప్రత్తిపాడుపై కూడా పీటముడి మరింత బిగిసుకుంటోంది. ఈ విషయంపై కూడా విజయవాడలో జరిగిన సమీక్షలో స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మిగతా నియోజకవర్గాలపై మాత్రం సూచన ప్రాయంగా స్పష్టత ఇచ్చినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు