బడుగులు భగ్గు

6 May, 2018 10:08 IST|Sakshi

ఆత్మీయ సదస్సులో నిరాదరణపై గంటాపైమైనారిటీలు గుర్రు

కులం పేరుతో దూషించారనివాసుపల్లిపై దళితుల తిరుగుబాటు

ఇళ్ల కేటాయింపులో అన్యాయం చేశారని వెలగపూడిపై మత్స్యకారులు ఫైర్‌

అండగా ఉన్న బలహీనవర్గాలపైనే అధికార పార్టీ నేతల ప్రతాపం

టీడీపీతోపాటు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతున్న పరిణమాలు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నెలరోజుల వ్యవధిలోనే నగరానికి చెందిన ముగ్గురు టీడీపీ ప్రజాప్రతినిధులు దళితులు, మైనారిటీలు, బలహీనవర్గాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది. ఓ పక్క దళితులు, బడుగు బలహీనవర్గాలే తమ తొలి ప్రాధాన్యమని టీడీపీ  అధినేత, సీఎం చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తుంటే.. మరో పక్క ఆయా వర్గాల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి గంటా శ్రీనివాసరావు సహా ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, వెలగపూడి రామకృష్ణబాబులు వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది.

యాధృచ్ఛికమే కావొచ్చు కానీ.. జిల్లాకు  చెందిన ముగ్గురు టీడీపీ ప్రజాప్రతినిధులపై ఒకేసారి బడుగులు, దళితులు, మైనారిటీల నుంచి తిరుగుబాటు మొదలైంది.ఆది నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన మత్స్యకారుల నుంచి తూర్పు ఎమ్మెల్యేవెలగపూడి రామకృష్ణబాబు వ్యతిరేకతను ఎదుర్కొన్నారు..విశాఖ దక్షిణంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ దళితుల నుంచి తీవ్ర ప్రతిఘటన చవిచూస్తున్నారు. ఆయనపై ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది.తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావుపై ముస్లిం మైనారిటీలు ఆగ్రహంతో ఉన్నారు.ఆ ముగ్గురిపై తిరుగుబాటు చేస్తున్న ఆయా వర్గాల్లోని బాధితులందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కావడం విశేషం.పార్టీకి కొమ్ముకాస్తూ ఏళ్ళతరబడి సేవ చేస్తున్న తమను పూచిక పుల్ల మాదిరిగా తీసిపారేస్తారా.. అంటూ ఆ వర్గాల నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.అసలు ‘దేశం’లో ఏం జరుగుతోంది.. నాలుగేళ్లుగా అధికార బలంతో  రెచ్చిపోతున్న టీడీపీ నేతలు చివరికి పార్టీలోని బడుగు బలహీన వర్గాలపై కూడా ప్రతాపం చూపిస్తున్నారనేందుకు ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలే నిదర్శనాలు.

వాసుపల్లిపై దళితాగ్రహం
తెలుగుదేశం అర్బన్‌ జిల్లా అ«ధ్యక్షుడిగా రెండోసారి కొనసాగుతున్న విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌పై సొంత నియోజకవర్గంలోనే.. సొంత పార్టీ నుంచే అసంతృప్తి సెగలు ఎగసిపడుతున్నాయి. 23వ వార్డు పార్టీ అధ్యక్ష మార్పు వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. పార్టీలో సీనియర్‌ అయిన పీవీరామారెడ్డిని కాదని ఇటీవలే పార్టీలో చేరిన బంగారు రవిశంకర్‌కు అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో రామారెడి వర్గీయులు వాసుపల్లిపై తిరుగుబాటు చేశారు. ఈ విషయమై గత నెల 18న సుపల్లిని నిలదీసేందుకు పార్టీ కార్యాలయానికి వెళ్లగా రామారెడ్డి వెంట ఉన్న దళిత నేతల పట్ల వాసుపల్లి వ్యవహరించిన తీరు పార్టీలోనే కాకుండా దళిత సామాజిక వర్గీయుల్లో తీవ్ర దుమారం రేపింది. సహజంగానే దూకుడుగా ఉండే వాసుపల్లి దళితులని కూడా చూడకుండా  నోటికొచ్చినట్టు మాట్లాడటం, అమర్యాదగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. ఇన్నాళ్ళూ పార్టీని, వాసుపల్లిని భుజాన మోసిన తమను కులం పేరుతో దూషించడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. పార్టీలోని దళిత నేతలను కూడగట్టి వాసుపల్లిపై త్రీటౌన్‌ పోలీస్‌స్టేన్‌లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.  ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు విచారణ తీవ్రతరం చేశారు. ఈ వ్యవహారం నియోజకవర్గంలోని దళితులందర్నీ ఏకంచేసింది. వాసుపల్లిపై తిరుగుబాటుకు దారి తీసింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఈ నెల 11న నియోజకవర్గంలో భారీ బహిరంగసభ పెట్టాలని పార్టీలోని దళిత నేతలు నిర్ణయించారు. ఈ సభకు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, మాల మహానాడు రాష్ట్రాధ్యక్షుడు జి. చెన్నయ్యలను ఆహ్వానించారు. దళితులను బుజ్జగించేందుకు వాసుపల్లి చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. రాజీ కోసం కొంతమంది నేతలకు రెండేసి ఇళ్లు, రూ.30వేల నగదు ఇవ్వచూపినట్టు ప్రచారం జరిగింది. దీనిపై కూడా దళిత నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. డబ్బుతో లొంగదీసుకోవాలని చూడటం తమను అవమానించినట్టేనని దళిత నేతలు భావించారు. ఈ ఉదంతం తర్వాతే వాసుపల్లిని సస్పెండ్‌ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా మంత్రులు లోకేష్, చినరాజప్ప, గంటా, అయ్యన్న, జవహర్, నక్కా ఆనందబాబు, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావులకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలన్నీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

గంటాపై ముస్లింల గుర్రు
ఇక మంత్రి గంటా శ్రీనివాసరావుపై పార్టీకే చెందిన ముస్లిం మైనారిటీ నేతలు, శ్రేణులు గుర్రుగా ఉన్నారు. పార్టీ ముస్లిం మైనారిటీల సదస్సులో వారి మనోభావాలను పట్టించుకోకుండా లెక్కలేనితనంతో వెళ్లిపోయిన గంటా తీరు చిలికి చిలికి గాలివానలా తయారవుతోంది. శుక్రవారం జరిగిన  ముస్లింల సదస్సులో ముం దుగా తాను మాట్లాడి వెళ్లిపోతానని గంటా మైక్‌ పట్టుకోగా.. మాజీ ఎమ్మెల్యే రెహమాన్‌ నిలువరించారు. జిల్లా మైనారిటీ నేతలు మాట్లాడే వరకు వేచి ఉండాలని కోరినప్పటికీ గంటా లెక్కచేయకుండా అలిగి ఆగ్రహంతో వెళ్లిపోయారు. గంటా తీరుపై ఇప్పుడు పార్టీలోని మైనారిటీ వర్గాలు మండిపడుతున్నాయి. వాస్తవానికి గంటాను నిలువరించిన రెహమాన్‌ సామాన్య కార్యకర్త ఏమీ కాదు. మాజీ ఎమ్మెల్యేగా, వుడా మాజీ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. పైగా మంత్రి గంటాకు ఎన్నో ఏళ్ల నుంచి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అటువంటి రెహమాన్‌కు కనీస గౌరవం ఇవ్వకుండా అమర్యాదగా వ్యవహరించిన గంటా వ్యవహారశైలిపై ఇప్పుడు మైనారిటీ వర్గాల్లో ఆగ్ర హావేశాలు వ్యక్తమవుతున్నాయి. మైనారిటీల సదస్సులో గంటా తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిరా>్యదు చేస్తామని మైనారిటీ విభాగానికి చెందిన ఓ నేత సాక్షికి చెప్పుకొచ్చారు.

వెలగపూడిపై జాలర్ల తిరుగుబాటు
తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై మత్స్యకారులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పెదజాలారిపేటలోని  స్థానిక మత్స్యకారులను కాదని అనర్హులకు ఇళ్లు కేటాయించిన నిర్వాకంపై  వారు గత నెల 22న వెలగపూడిని అడ్డుకుని తీవ్ర నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పటివరకు మళ్లీ వెలగపూడి  జాలర్లను కలవలేని పరిస్థితి నెలకొంది. గతంలో పెదజాలారిపేటలో మత్స్యకారులకు ప్రభుత్వం 103 ఇళ్లు మంజూరు చేసినా ఇప్పటివరకు నిర్మాణాలకు అతీగతీ లేదు. సరిగ్గా అక్కడే వెలగపూడి మత్స్యకారులకు కాకుండా ఇతర వర్గాలకు 72 ఇళ్లు కేటాయించారు. దీనిపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా ఆ ఇళ్ల శంకుస్థాపనకు వెళ్లారు. వాస్తవానికి ఆ 72 ఇళ్ల లబ్ధిదారులకు గతంలోనే మధురవాడలో ఇళ్లు కట్టించి ఇచ్చారు. స్థానిక మత్స్యకారులను కాదని వారికే మళ్లీ ఇళ్లు కేటాయించడంతో రగిలిపోయిన మత్స్యకార వర్గీయులు వెలగపూడిని శంకుస్థాపన చేయనివ్వకుండా అడ్డుకున్నారు. జాలారిపేటలోకి అడుగుపెట్టకుండా నిలువరించారు. న్యాయపరమైన డిమాండ్‌తో నిరసన తెలిపిన మత్స్యకారులను కనీసం ఆ తర్వాతైనా వెలగపూ బుజ్జగించలేదు. దీంతో జాలర్లు మరింత ఆగ్రహంతో ఊగిపోతున్నారు. గత ఎన్నికలలో ఎమ్మెల్యేను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ఇదేనా మాకు బహుమతి అంటూ రగిలిపోతున్నారు.

>
మరిన్ని వార్తలు