పులివెందులలో టీడీపీ నేతల ఓవరాక్షన్‌

12 Apr, 2019 11:56 IST|Sakshi
ఉర్దూ స్కూలు వద్ద సీఐతో మాట్లాడుతున్న వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, తదితరులు

సాక్షి, పులివెందుల : పులివెందులలో  గురువారం  జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతలు ఓవరాక్షన్‌ చేశారు. పలు పోలింగ్‌ బూత్‌ల వద్ద వైఎస్సార్‌సీపీకి చెందిన నేతలు, కార్యకర్తలపై జులుం ప్రదర్శించడానికి ప్రయత్నించారు. వీటిని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తిప్పి కొట్టారు. టీడీపీ నేతల దౌర్జన్యాలకు అంతు లేకుండా పోయింది. చివరకు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎన్నికల విధులు నిర్వహించే బీఎల్‌ఓలపై కూడా తమ ప్రతాపం చూపారు. పట్టణంలోని ఇస్లాంపురంలోని ఉర్దూ పాఠశాలలో పోలింగ్‌ విధులు నిర్వహిస్తున్న బీఎల్‌ఓలు ఎం.లక్ష్మిదేవి, డి.లక్ష్మిదేవిలపై  టీడీపీ నాయకుడు హేమాద్రిరెడ్డి జులుం ప్రదర్శించారు.

టీడీపీ జిల్లా అధికార ప్రతినిధిగా, పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా ఉన్న హేమాద్రిరెడ్డి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. అయితే ఉర్దూ స్కూలు పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లి అక్కడ విధులు నిర్వహిస్తున్న బీఎల్‌ఓలపై వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారంటూ జులుం ప్రదర్శించారు. బీఎల్‌ఓల చేతిలో ఉన్న ఓటరు స్లిప్పులను లాక్కొని చించడంతోపాటు మహిళలు అని చూడకుండా  దుర్భాషలాడారు.  పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు తూగుట్ల మధుసూదన్‌రెడ్డి, ముక్క భాస్కర్‌రెడ్డి  దౌర్జన్యం చేసేందుకు ప్రయత్నించారు. వీరి దౌర్జన్యాలను ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తిప్పి కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు వైఎస్సార్‌సీపీ నాయకులను, టీడీపీ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి పోలింగ్‌ ముగిసిన అనంతరం పూచీకత్తుపై విడుదల చేయడం జరిగింది.  

మరిన్ని వార్తలు