ఆ నియోజకవర్గ టికెట్‌ కోసం క్యూలో టీడీపీ నేతలు

11 Feb, 2018 10:33 IST|Sakshi
అవంతి శీను , చోడవం ఎమ్మెల్యే రాజు , గంటా రవితేజ

2009లో వెయ్యి ఓట్లు.. 2014లో  805 ఓట్లు.. ఇలా వరుసగా రెండుసార్లు అదృష్టం వరించి  అతి తక్కువ మెజారిటీతో ఎమ్మెల్యే అయిన నేత బహుశా రాష్ట్రంలో చోడవరం టీడీపీ ఎమ్మెల్యే  కెఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ఒక్కరే అయిఉంటారు.  కానీ ఏం లాభం..  తొమ్మిదేళ్ల నుంచి ప్రజాప్రతినిధిగా ఉన్నా.. ‘నేను ఇది సాధించాను.. నియోజకవర్గ ప్రజలకు ఇది చేశాను’.. అని గర్వంగా చెప్పుకొనే ఒక్క పని కూడా చేయలేకపోయారు.  బినామీ పేర్లతో మైనింగ్, క్వారీ వ్యాపారాలు చేసుకోవడం, ఇసుక దందా, నిధుల గోల్‌మాల్‌తో గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీని పీల్చి పిప్పి చేయడం,  ఆస్తులు సమకూర్చుకోవడం మినహా చోడవరాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్న విమర్శలనే ఆయన మూటకట్టుకున్నారు. గత ఎన్నికల సమయంలో ‘ఇదే చివరి అవకాశం.. మళ్లీ పోటీ చేయను అని బహిరంగంగానే ప్రకటించి సానుభూతి ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు మూడోసారి పోటీకి  రంగం సిద్ధం చేసుకుంటున్నారనే అంటున్నారు.  ప్రజల కనీస ‘రుణం’ తీర్చుకోకుండా మూడో ‘ముచ్చట’ తీర్చుకునేందుకు ఆయన ఉబలాటపడినా.. సరైన ‘ఫలితం’ ఇచ్చేందుకు నియోజకవర్గ ఓటర్లు అప్పుడే రెడీగా ఉన్నారు.  ఆయనకే కాదు.. టీడీపీ తరఫున ఎవరు బరిలోకి దిగినా ఇదే పరిస్థితి.. ఇది తెలిసి కూడా చోడవరం టికెట్‌ కోసం పలువురు ఉబలాటపడుతుండటంతో చోడవరం దేశం  రాజకీయం అప్పుడే రంగులు మార్చుకుంటోంది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అధికార దన్నుతో జిల్లా తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో చాలామంది భూములపై పడి రూ.కోట్లకు కోట్లు కూడబెట్టుకుంటే.. చోడవరం ఎమ్మెల్యే రాజు మాత్రం గనుల దారి ఎంచుకున్నారు. బినామీ పేర్లతో ఎమ్మెల్యేలెవరూ పెద్దగా దృష్టి పెట్టని మైనింగ్, క్వారీ పనులు చేపట్టడం, శారదా నదిలో ఇసుక దందా, గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం.. వెరసి తొమ్మిదేళ్ల కాలంలో ఆయన ఆర్ధికంగా బాగానే కూడబెట్టుకున్నారు. తనను గెలిపించిన చోడవరం నియోజకవర్గానికి ఏమీ చేయలేదన్న అప్రతిష్టను అదే స్థాయిలో మూటకట్టుకున్నారు. తన వెన్నంటి ఉన్న టీడీపీ కార్యకర్తలు, నేతల బాగోగులను కూడా పట్టించుకోని సదరు ఎమ్మెల్యే రాజు విపక్ష పార్టీ శ్రేణులను మాత్రం గుర్తించుకుని మరీ టార్గెట్‌ చేస్తారన్న వాదనలు ఉన్నాయి.

మళ్లీ పోటీకి సై
గత ఎన్నికల ప్రచారంలో ఈసారికి గెలిపించండి.. ఇదే చివరిసారి.. మళ్లీ పోటీ చేయను.. అని సెంటిమెంట్‌ డైలాగులు కొట్టి ఎమ్మెల్యే అయిన రాజు ప్రజలకు చేసిన వాగ్దానాల్లాగే ఆ మాటను కూడా మరచిపోయినట్టున్నారు. మళ్లీ ఎన్నికల గోదాలో దిగేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేల పనితీరు, జన్మభూమి సభల నిర్వహణలపై టీడీపీ అధిష్టానం చేసిన సర్వేల్లో ఈయనకు వరుసగా  చివరి స్థానాలే దక్కుతున్నాయి. దీంతో ఈసారి రాజుకు టికెట్‌ ఇవ్వరనే ప్రచారం జోరుగా సాగుతోంది. తన సొంత సామాజికవర్గం ఓట్లు ఒక్కశాతం కూడా లేకపోయినా  పంచాయతీ సర్పంచ్‌ నుంచి వివిధ పదవులు చేసి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారంటే రాజు రాజకీయ చతురత అర్ధమవుతుంది. అందువల్లే ఈసారి టికెట్‌ మళ్లీ ఆయనకే వస్తుందని అతని వర్గీయులు చెప్పుకుంటున్నారు. కానీ రెండుసార్లు ఎమ్మెల్యే అయినా  పనులేమీ చేయకుండా తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్న రాజుకు టికెట్‌ రావడం అసాధ్యమేనన్న అభిప్రాయం మెజారిటీ టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అందుకే టీడీపీ టికెట్‌ కోసం పోటీ పడుతున్న జాబితా పెద్దదవుతోంది.

బరిలోకి ‘మల్లు’డు
గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ చైర్మన్‌ గూనూరు మల్లునాయుడు ఈసారి ఎమ్మెల్యే సీటుకు  సిద్ధమయ్యారని అంటున్నారు. ఈ క్రమంలోనే తమ సామాజిక వర్గానికి చెందిన మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడితో సంబంధాలు నెరుపుతూ టిక్కెట్టు కోసం  ప్రయత్నాలు చేస్తున్నారు.

అవంతి ఆసక్తి
‘ఎంపీగా చేద్దామా.. ఎమ్మెల్యేగా చేద్దామా.. అసలు ఎక్కడి నుంచి పోటీ చేద్దాం.. అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామా,, లేక విశాఖ నగరంలోని ఏదో ఒక నియోజకవర్గం ఎంచుకోవడమా.. లేదా చోడవరం నుంచి చేద్దామా..’ ఇలా ఇప్పటివరకు ఎటూ తేల్చుకోలేకపోయిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు ఈసారి చోడవరం నుంచి పోటీ  చేయాలన్న యోచనలో ఉన్నారని చెబుతున్నారు.. తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం, ఎంపీగా వస్తూ పోతూ తన కంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని కూడా తయారుచేసుకున్న అవంతి కన్ను చోడవరంపై ఉందన్న వాదన వినిపిస్తోంది.

గంటా వారసుడొస్తాడా?
చోడవరం నుంచే తొలిసారి శాసనసభకు ఎన్నికైన గంటా శ్రీనివాసరావుకు ఇప్పటికీ నియోజకవర్గంలో వర్గ ప్రాబల్యం ఉంది. ఎన్నికలకో నియోజకవర్గానికి తిరిగే గంటా ఇప్పటివరకు ఒకసారి పోటీ చేసిన సెగ్మెంట్‌ నుంచి మళ్లీ పోటీ చేయలేదు. ఈ లెక్కన గంటా తిరిగి చోడవరానికి రావడం అనుమానంగానే ఉన్నా.. ఆయన కుమారుడు  జయదేవ్‌(రవితేజ)ను మాత్రం ఈసారి ఇక్కడి నుంచే రాజకీయ ఆరంగ్రేటం చేయిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఆ మధ్య తాను నటించిన  తొలి చిత్రం జయదేవ్‌ విడుదల సందర్భంగా చోడవరం వచ్చిన గంటా కుమారుడు రవితేజ... చోడవరం నుంచి పోటీ చేయాలనుందని చెప్పి టీడీపీలో కొత్త చర్చకు తెరలేపారు. ఎన్నికల్లో పోటీ విషయమై  చివరి నిమిషం వరకు ఎటూ తేల్చని గంటా అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఆయనే చోడవరం వస్తారా.. లేదా తన కుమారుడిని రంగంలోకి దించుతారా అన్నది ఎన్నికల వరకు ప్రశ్నార్ధకమే.

ఆడారి కుటుంబం ఇక్కడకొస్తుందా?
విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు కుటుంబం నుంచి అతని కుమార్తె, కుమారుల్లో  ఎవరో ఒకరిని ఇక్కడ బరిలోకి దించేందుకు  ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సుమారు 11వేల వరకు  తమ సామాజిక వర్గ ఓట్లు ఉండటంతో ఆడారి కుటుంబం టికెట్‌ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. రెండు సార్లు తన విజయానికి ఆడారి తులసీరావు ఎంతో కొంత సాయం చేశారనే భక్తితో రాజు ఆయన్ను రాజకీయ గురువుగా భావిస్తుంటారు. ఈ  నేపథ్యంలో ఒకవేళ రాజు ఈసారి నిలబడకపోతే తమకు మద్దతు ఇవ్వాలని ఆడారి కుటుంబం అతన్ని అడిగే అవకాశముంది. వాస్తవానికి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు తోడు.. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా ఏమీ చేయని రాజు నిర్వాకానికి  చోడవరంలో దేశం ప్రభ ఎప్పుడో తగ్గిపోయింది. కేవలం పోటీ కోసమే టీడీపీ నేతలు క్యూ కట్టడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

మరిన్ని వార్తలు