టీడీపీలో ప్రకంపనలు!

18 Jan, 2019 13:34 IST|Sakshi
కడపలో మైనార్టీ నాయకుడు అమీర్‌బాబు ఇంట్లో సమావేశమైన టీడీపీ నేతలు

మాజీ మంత్రి అహమ్మదుల్లా చేరికపై భగ్గుమంటున్న దేశం శ్రేణులు

అధికారంలో ఉండగా అక్రమ కేసులు బనాయించి... వేధింపులు

అదే విషయమై చర్చించిన కడప నగర నేతలు

పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించాలనే దిశగా యోచన

సాక్షి ప్రతినిధి కడప : టీడీపీలో రాజకీయ ప్రకంపనలు తీవ్రతరమయ్యాయి. మాజీ మంత్రి అహమ్మదుల్లా కుటుంబం టీడీపీ తీర్థం పుచ్చుకోవడాన్ని సీనియర్‌ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అధికారంలో ఉండగా వేధించి అక్రమ కేసులు బనాయించిన నాయకున్నే అక్కున చేర్చుకోవడాన్ని జీర్ణించుకోలేకున్నారు. పార్టీకి అండగా నిలిచిన కేడర్‌ను విస్మరించడంపై భగ్గుమంటున్నారు. ఏకపక్ష నిర్ణయాలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించారు.

రాజధాని అమరావతిలో గురువారం సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో మాజీ మంత్రిఅహమ్మదుల్లా, ఆయన తనయుడు అష్రపుల్లా టీడీపీలో చేరారు. సరిగ్గా అదే సమయంలో కడపలో మైనార్టీసెల్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అమీర్‌బాబు ఇంట్లో టీడీపీ సీనియర్‌ నేతలంతా సమావేశమయ్యారు. పార్టీ ఉన్నతికి మూడు దశాబ్దాలుగా కృషి చేస్తున్న వారిని కాదని, టీడీపీ కార్యకర్తలను వేధించి అక్రమ కేసులు బనాయించిన వారిని ఎలా చేర్చుకుంటారంటూ నిలదీత చర్యలు తెరపైకి వచ్చాయి. అమీర్‌బాబు నేతృత్వంలో జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు సుభాన్‌భాషా, బరకతుల్లా, ఇనాయతుల్లా, జింకాశ్రీను, బొమ్మిశెట్టి చంద్రశేఖర్, శాప్‌ మాజీ డైరెక్టర్‌ జయచంద్రలతోపాటు దాదాపు వివిధ హోదాల్లో ఉన్న 30 మంది సమావేశమయ్యారు. మాజీ మంత్రి అహమ్మదుల్లా కుటుంబం టీడీపీలో చేరడం వల్ల అదనపు ప్రయోజనమేమి లేదని పలువురు వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ అధిష్టానం వైఖరిపై పలువురు బాహాటంగా విభేదించారు.

యూజ్‌ అండ్‌ త్రో పాలసీ..
గతంలో టీడీపీ నాయకత్వం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు అండగా ఉండేదని, ప్రస్తుతం యూజ్‌ అండ్‌ త్రో పాలసీతో వ్యవహరిస్తోందని కడప నగర టీడీపీ సీనియర్‌ నేతలు వాపోయారు. వ్యాపార కార్యకలాపాల్లో ఉన్న దుర్గాప్రసాద్‌ను పిలిచి గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ కేటాయించారని, తాజా రాజకీయాల నేపథ్యంలో ఆయన పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని వివరించారు. కడపలో నాయకత్వ కొరత లేకపోయినా అరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏమిటని పలువురు నిలదీశారు. ఎమ్మెల్యే సీటు మైనార్టీలకు కేటాయిస్తే అమీర్‌బాబు లేదా సుభాన్‌బాషాల్లో ఎవరికో ఒకరికి ఇవ్వాలని కోరారు. బలిజ కమ్యూనిటీ కేటాయిస్తే దుర్గా ప్రసాద్‌ ఇవ్వాలని ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే టీకెట్‌ ముస్లిం మైనార్టీలకు ఇస్తే, మేయర్‌ స్థానం బలిజ సామాజిక వర్గానికి ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చారు. ఇదే విషయం జిల్లా నాయకత్వం ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని, అధిష్టానం నిర్ణయాన్ని బట్టి చర్యలుండాలని ఎట్టి పరిస్థితుల్లో మాజీ మంత్రి అహమ్మదుల్లా కుటుంబానికి సహాకరించేదీ లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. టీడీపీ నేతలుగా ఉద్యమాలు చేసిన చరిత్ర తమకు ఉందని, అహమ్మదుల్లా కుటుంబానికి ప్రజల్లో పట్టుగానీ, ఉద్యమాలు చేసిన చరిత్ర కానీ లేదని, కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చర్మిషాతో గెలిచారని ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా అందలం ఎక్కించడం ఏమిటని పలువురు నిలదీసినట్లు సమాచారం. ఈ సందర్భంగా పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై కన్నీరు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

డైలమాలో పుట్టా వర్గీయులు..
మైదుకూరు రాజకీయాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రోజుకో హాట్‌ టాఫిక్‌ తెరపైకి వస్తుండడంతో టీటీడీ చైర్మన్‌ మైదుకూరు టీడీపీ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌ వర్గీయులు డైలమాలో పడ్డారు. మైదుకూరు టీడీపీ అభ్యర్థిత్వం పట్ల పుట్టా సుధాకర్‌ను తిరస్కరించారని, ఆమేరకు సీఎం చంద్రబాబు రాజధానికి పిలిపించుకున్నారని, సీటు విషయం చర్చించారని గురువారం జోరుగా చర్చ నడిచింది. అదంతా ఒట్టి పుకారు మాత్రమే సీటు సుధాకర్‌యాదవ్‌దేనని అతని అనుచరులు కొట్టి పడేస్తున్నారు. మైదుకూరు చరిత్రలో టీడీపీ కోసం సుధాకర్‌యాదవ్‌ కష్టపడినట్లు  మరెవ్వరూ కష్టపడలేదని, పార్టీని అన్నీవిధాలుగా బలోపేతం చేశారని, ఆయన్నే అధిష్టానం గుర్తిస్తోందని ఆయన అనుచరులు ఘంటా పథంగా చెబుతున్నారు. కాగా ఏదో అపశ్రుతి కల్గుతోందని ఎప్పుడూ లేని డైలమా తాజాగా పుట్టా వర్గీయులు ఉండిపోయిందనీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

మరిన్ని వార్తలు