తిట్టినా.. తుడిచేసుకొని!

25 Mar, 2019 08:38 IST|Sakshi
వెంకటరాముడికి టీడీపీ కండువా వేస్తున్న బీకే

సాక్షి, పెనుకొండ రూరల్‌: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరంటారు. ఈ కోవలోనే ఉప్పునిప్పుగా ఉన్న ఎమ్మెల్యే బీకే పార్థసారధి, ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీ పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి మునిమడుగు చిన వెంకటరాముడు ఒక్కటయ్యారు. ఆదివారం ఉదయం పెనుకొండ మండలంలోని మునిమడుగులో బీకే ఆయనకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరిక సందర్భంగా చిన వెంకటరాముడు తన వర్గీయులను పెద్ద ఎత్తున టీడీపీలోకి తీసుకొస్తారని ఆశించినా నిరాశే మిగిలింది. ఆయన కుటుంబ సభ్యులు, గ్రామానికి చెందిన కొందరు అనుచరులు మినహాయిస్తే పెద్దగా స్పందన లేకపోవడం బీకేతో పాటు టీడీపీ శ్రేణులను తీవ్ర అసహనానికి గురిచేసింది. పైగా మంత్రి పరిటాల సునీత కూడా కార్యక్రమానికి రాకపోవడం గమనార్హం.

సోషల్‌ మీడియాలో హల్‌చల్‌
ఆదివారం ఉదయం నుంచి ఒక వీడియో సోషియల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గత ఏడాది ప్రత్యేక హోదా కోసం పెనుకొండ పట్టణంలో ధర్నా నిర్వహిస్తున్న అప్పటి కాంగ్రెస్‌ పార్టీ హిందూపురం పార్లమెంట్‌ బాధ్యుడు, ప్రస్తుతం టీడీపీలో చేరిన మునిమడుగు చిన వెంకట్రాముడును ఉద్దేశించి స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారధి తీవ్ర పదజాలంతో దూషించారు. రోడ్డుపై ధర్నా చేస్తూ తన కారుకు అడ్డుగా తగిలాడనే కారణంతో బండ బూతులు తిట్టిన వీడియో ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. పెనుకొండ నియోజకవర్గంలో తన ఓటమి ఖాయమని తేలిపోయిన పరిస్థితుల్లో ఎమ్మెల్యే బీకే పడుతున్న పాట్లను చూసి అధికారం కోసం ఇంతటి నీచానికి దిగజారుతారా? అని చర్చించుకుంటున్నారు. ఇకపోతే చిన వెంకటరాముడు కూడా ప్యాకేజీ కోసం తనను బండ బూతులు తిట్టిన ఎమ్మెల్యే పంచన చేరడాన్ని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

మహిళా నేత మధ్యవర్తిత్వం
చిన వెంకటరాముడు టీడీపీలో చేరిక వెనుక పెద్ద డీల్‌ కుదిరినట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో రాప్తాడుకు చెందిన ఓ మహిళా ప్రజాప్రతినిధి కీలకంగా వ్యవహరించగా.. కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేత కూడా మధ్యవర్తిత్వం నెరిపినట్లు తెలుస్తోంది. పెనుకొండకు చెందిన ఓ మహిళా నేత రాప్తాడులో కుల ఓట్లను ఆకట్టుకునేందుకు ప్రచారం చేస్తుండటంతో.. ఇందుకు ప్రతిగా రాప్తాడుకు చెందిన మహిళా నేత ఈ డీల్‌ కుదిర్చినట్లుగా చర్చ జరుగుతోంది. ఇందుకోసం చిన్న వెంకటరాముడుకు పెనుకొండ నేత రూ.50లక్షలు, పార్లమెంట్‌ నేత రూ.30లక్షలు, రాప్తాడు మహిళా ప్రజాప్రతినిధి రూ.20లక్షలు ముట్టజెప్పినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు