సచివాలయంలో మంత్రుల నేమ్‌ ప్లేట్లు తొలగింపు

24 May, 2019 15:44 IST|Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వానికి స్వాగతం పలికేందుకు అమరావతిలోని సచివాలయం ముస్తాబవుతోంది. దీంతో సచివాలయంలో టీడీపీ కేబినెట్‌ మంత్రుల నేమ్‌ ప్లేట్లను తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖల ముందు ఏర్పాటు చేసిన నేమ్‌ బోర్డులను తొలగించాల్సిందిగా జీఏడీ అధికారులు ఈ సందర్భంగా సిబ్బందిని ఆదేశించారు. దీంతో  సచివాలయంలోని అన్ని బ్లాకుల్ని పరిశీలిస్తున్నారు. గత ప్రభుత్వంలో  పలువురు మంత్రుల పేషీల్లో ఉన్న ఫోటోలను తొలగించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోలను జీఏడీ సిబ్బంది తొలగించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే లోపు  అవసరమైన మరమ్మతులు పూర్తి చేయనున్నారు. పనికిరాని డాక్యుమెంట్లను క్లియర్‌ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
 
మరోవైపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, కొండపల్లి శ్రీనివాస్‌ తదితరులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతల మాట్లాడుతూ నూతన ప్రభుత్వానికి ఉద్యోగులు అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. వైఎస్ జగన్‌ గెలుపుపట్ల హర్షం వ్యక్తం చేస్తూ ...గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో ఉద్యోగుల కష్టాలు తీరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉద్యోగులకు ఎలాంటి కష్టాలు లేవని అన్నారు.

మరిన్ని వార్తలు