వైజాగ్‌లో నీ అంతు చూస్తా

1 Jan, 2018 08:27 IST|Sakshi
అధికారులను దూషిస్తున్న ఎమ్మెల్యే అప్పలనాయుడు

విజయనగరంలో అధికారులపై రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే

రహదారి పనుల బిల్లుల్లో జాప్యం, ప్రొటోకాల్‌ విషయంపై వివాదం

ఎమ్మెల్యే తీరును తీవ్రంగా పరిగణించిన జిల్లా అధికార యంత్రాంగం

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘బిల్లులు క్లియర్‌ చేయరా.. నువ్‌ చెబితే నేను వినాలా.. వేషాలేస్తున్నావా.. ఏమనుకుంటున్నావ్‌ ప్రజాప్రతినిధులంటే.. బయటకురా నీ కథ తేలుస్తా.. వైజాగ్‌లో ఉంటావ్‌గా రా..అక్కడే నీ అంతు చూస్తా.’ అంటూ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు రెచ్చిపోయారు. విజయనగరం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఆయన తిట్ల పురాణం అందుకుని, బెదిరింపుల పర్వానికి తెరలేపారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి అధ్యక్షతన ఆదివారం సర్వసభ్య సమావేశం జరిగింది. మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, కలెక్టరు వివేక్‌యాదవ్, జిల్లా అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఎలాంటి చర్చ లేకుండా బడ్జెట్‌ను ఆమోదించారు. పంచాయతీరాజ్‌ రోడ్ల పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో విడుదల చేయడం లేదని, తమ ప్రాంతంలో జరిగే అధికారిక సమావేశాలకు తమను పిలవడం లేదనే అంశాలపై టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు.

వీటికి అధికారులు సమాధానం చెబుతుండగా గజపతినగరం ఎమ్మెల్యే అప్పలనాయుడు వారిపై రెచ్చిపోయారు. ఇంజనీరింగ్‌ అధికారులు సక్రమంగా పని చేయడం లేదని, కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని విమర్శిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం, పార్వతీపురం ఈఈ వీఎస్‌ఎన్‌ మూర్తి, విజయనగరం ఈఈ వైవీ శాస్త్రి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడంతో ఎమ్మెల్యే మరింతగా రెచ్చిపోయారు. దీంతో అధికారులు మౌనంగా ఉండిపోయారు. అనంతరం వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఏడీ జీవన్‌బాబుపై టీడీపీ సభ్యులు విరుచుకుపడ్డారు. గరివిడిలో సమావేశం పెట్టి తనకు, ఇతర ప్రజాప్రతినిధులకు చెప్పలేదంటూ జెడ్పీ ఉపాధ్యక్షుడు బలగం కృష్ణమూర్తి ఆరోపించారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఎమ్మెల్యే అప్పలనాయుడు కలెక్టర్‌ను కోరగా, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.


బెదిరింపులతో మౌనంగా నిల్చున్న అధికారులు

తిరుగుబాటుకు సిద్ధమవుతున్న అధికారులు..
అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమపై చేసిన ఆరోపణలు, దూషణలపై జిల్లా అధికారులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఏజేసీ కె.నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లాలోని ప్రభుత్వ విభాగాల అధిపతులు దాదాపు 25 మంది సాయంత్రం కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. జెడ్పీ సమావేశంలో అధికారులను టీడీపీ నేతలు బూతులు తిట్టడం, బెదిరించడం వంటి పరిణామాలను తీవ్రంగా ఖండించారు. బూతులతో విరుచుకుపడటం అధికారపక్ష నేతలకు అలవాటుగా మారిందని, ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఇక పనిచేయలేమని వారంతా అభిప్రాయపడ్డారు. అధికారులను దూషించిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలంటూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని తీర్మానించారు. కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం తమ ఫిర్యాదును ఆయనకు అందజేయనున్నారు.

మరిన్ని వార్తలు