రూ.30 కోట్ల ఆస్తి లాక్కున్నాడు

3 Apr, 2019 09:22 IST|Sakshi
కందికుంట చేసిన అన్యాయాన్ని వివరిస్తున్న డాక్టర్‌ ప్రభాకర్‌నాయుడు సతీమణి సరస్వతమ్మ

నా కొడుకును చంపుతామని బెదిరించాడు 

 టీడీపీ అభ్యర్థి కందికుంటకు ఓటు వేయొద్దు 

డాక్టర్‌ ప్రభాకర్‌నాయుడు భార్య పసుపులేటి సరస్వతమ్మ  

సాక్షి, కదిరి: ‘కదిరి ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ టీడీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న కందికుంట వెంకట ప్రసాద్‌ ఉన్నంత వరకు ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉండలేరు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతేనే ఎంతోమంది భూములను బలవంతంగా లాక్కున్నాడు. ఇక గెలిస్తే ఆయన విశ్వరూపం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దయచేసి పొరపాటున కూడా ఈ ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయకండి’ అని డాక్టర్‌ ప్రభాకర్‌నాయుడు సతీమణి పసుపులేటి సరస్వతమ్మ కోరారు. మంగళవారం ఆమె కదిరిలోని తన స్వగృహంలో కుమారుడు పవన్‌కుమార్‌తో కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని ‘సాక్షి’కి వివరించారు.  

ఆ పొలం అంటే ఆయనకు చాలా ఇష్టం 
‘నా భర్త ప్రభాకర్‌ నాయుడు పాముకాటు బాధితులకు వైద్యం అందించడంలో మంచి పేరుంది. అందుకే ఆయనను అందరూ ‘పాముల డాక్టర్‌’ అని పిలుస్తారు. మాకు కదిరి–హిందూపురం రోడ్‌లో వీవర్స్‌ కాలనీ వద్ద రోడ్డు పక్కనే 3 ఎకరాల పొలం ఉండేది. ఆ పొలం అంటే ఆయనకు చాలా ఇష్టం. నిత్యం పొలం ఏదో ఒక పంటతో కళకళలాడుతూ ఉండేది. ఓసారి కర్నూలుకు చెందిన శిల్ప వాళ్లు అక్కడ ప్లాట్లు వేసి ఇళ్లు నిర్మించి అమ్మేందుకు ఆ పొలం ఎకరం రూ.10 కోట్లకు అడిగారు. కానీ మా ఆయన ఇవ్వలేదు. తర్వాత మా ఆయన గుండెపోటుతో రెండేళ్ల క్రితం మరణించారు. 

పెద్ద కర్మ కూడా పూర్తి కాకుండానే.. 
మా ఆయన పెద్దకర్మ కూడా పూర్తికాకనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న కందికుంట వెంకట ప్రసాద్‌ అనుచరుడు, ప్రస్తుతం మున్సిపాలిటీలో బిల్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న మధు (ఈయన భార్య మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌)తో పాటు మరికొందరు  వాలిపోయారు. మా పొలంలోకి వచ్చి ‘మీ ఆయన ఈ పొలం మాకు రూ.2.50 కోట్లకు అమ్మినాడు. మా దగ్గర అడ్వాన్స్‌గా రూ. కోటి తీసుకున్నాడు’ అని చెప్పి మున్సిపాలిటీకి సంబంధించిన జేసీబీ తీసుకొచ్చి పొలంలో వేసిన సద్ద పంటను దౌర్జన్యంగా దున్నేశారు. నిజంగా పొలం అమ్మినట్లయితే మా ఆయన మాకు చెప్పేవారు. రూ.30 కోట్లకు అడిగితేనే మా ఆయన ఆ పొలం ఇవ్వలేదు. రూ2.50 కోట్లకు ఇచ్చారంటే అది పూర్తిగా అబద్ధం. 

ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే 
కోట్లు విలువ చేసే భూములను బలవంతంగా లాక్కుంటున్న కందికుంట వెంకట ప్రసాద్‌కు ఓటేస్తే కదిరి ప్రాంతంలో ఉన్న పాలాలన్నీ ఆక్రమించడం ఖాయం. కదిరిలో వ్యాపారస్తులను కూడా బెదిరించి నెలనెలా మామూళ్లు ఇవ్వాలని ఆయన అనుచరులు దందా సాగిస్తున్నారు. కదిరి ప్రజలకు రెండు చేతులు జోడించి నమస్కరించి చెబుతున్నాను. కందికుంటకు ఓటు వేయకండి. అందరికీ మంచి చేసే, కదిరిని అభివృద్ధి చేయాలనే తపన ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డిని గెలిపించండి’ అని ఆమె నియోజకవర్గ ప్రజలను వేడుకున్నారు. 

పొలం రాసివ్వకపోతే కొడుకును చంపేస్తామన్నారు!
ఆ పొలం మాకు రాసివ్వకపోతే నీ కొడుకును చంపేస్తామని కందికుంట అనుచరులు బెదిరించడంతో చేసేది లేక మేము ఆ పొలం వదుకోకతప్పలేదు. కందికుంటకు భయపడి ఎవ్వరూ మాకు అండగా నిలబడలేదు. మేము కూడా చాలా భయపడ్డాం. కొడుకు ప్రాణాలకన్నా ఆ పొలం ఎక్కువ కాదని కోటిన్నర రూపాయలు తీసుకొని వారు చెప్పినట్లు ఆ పొలాన్ని వదులుకోక తప్పలేదు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు. మాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగక్కూడదన్న ఉద్దేశ్యంతో మీడియా ముందుకు వచ్చి చెప్పక తప్పలేదు.  

మరిన్ని వార్తలు