ప్రభాకరా.. ఇదేమి టోకరా!

11 Apr, 2019 09:03 IST|Sakshi

సాక్షి, అనంతపురం టౌన్‌ : అధికార పార్టీ ప్రలోభాలు పెచ్చుమీరుతున్నాయి. అధికారం తమదే.. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తలచారు.. మాయజేసి అయినా..మభ్యపెట్టి అయినా..అక్కడికీ వినకపోతే ప్రలోభపెట్టి అయినా ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని పన్నాగం పన్నారు. ముందుగా ఓటర్లకు ఇంటింటికీ వెళ్లి టోకన్లు పంపిణీ చేశారు. కానీ నోటు మాత్రం ఇవ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఓటర్లు  టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వైకుంఠం ప్రభాకర్‌చౌదరి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. అంతటితో ఆగకుండా ఇంటి బయట వేసిన టెంట్లను పెకిలించి, బుధవారం భారీ ఎత్తున నిరసనకు దిగారు. నగరంలోని పలు డివిజన్లకు చెందిన ఓటర్లకు ప్రభాకర్‌చౌదరి అనుచరులు,నాయకులు టోకన్లను పంపిణీ చేశారు. టోకన్లను ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి ఇంటి వద్దకు తీసుకెళ్లితే డబ్బులిస్తారని మభ్యపెట్టారు. 

టోకన్లు తీసుకున్న మహిళలు పెద్ద ఎత్తున ప్రభాకర్‌చౌదరి ఇంటివద్దకు చేరుకున్నారు. టోకన్లు తీసుకొని డబ్బులివ్వాలని కోరారు. అయితే ‘ఇక్కడ డబ్బులేవు.. మళ్లీ ఇస్తాం’ అంటూ కొందరు టీడీపీ నాయకులు ఓటర్లకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. వారు ససేమిరా అన్నారు. నగదు ఇస్తే ఇప్పుడే ఇవ్వండి.. లేకపోతే ఇవ్వలేమని చెప్పండి.. అంతేగానీ టోకన్లు ఇచ్చి, మోసం చేస్తారా? అంటూ నిరసన తెలియజేశారు. ఇంటి బయట వేసిన సేమియానా (టెంటు)ను సైతం తొలగించి ఆందోళన చేశారు. ఆందోళన కాస్త పెద్దది కావడంతో వెంటనే అక్కడి టీడీపీ నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు రంగప్రవేశం చేసి వారికి సర్దిచెప్పే ప్రయత్నాలు చేసి అక్కడి నుంచి పంపించారు. డబ్బులిచ్చే స్థోమత లేనప్పుడు టోకన్లు ఇచ్చి ఓటర్లను తప్పుదోవ పట్టించాలి? అని నిట్టూర్చారు. అయితే పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోగా ఎమ్మెల్యే ఇంటి ముందు పార్కింగ్‌ చేసిన వాహనాలకు జరిమానా విధించి అక్కనుంచి వెళ్లిపోవడం విశేషం.

36వ డివిజన్‌లో మహిళల ఆందోళన..
నగరంలోని 36వ డివిజన్‌ లక్ష్మీనగర్‌లో మహిళలు ఆందోళన చేపట్టారు. టీడీపీ పార్టీకి చెందిన  రుక్మిణీ అనే మహిళా సంఘం సభ్యురాలు డబ్బులివ్వలేదని ఆమె ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ప్రతి ఓటరుకూ డబ్బులిస్తామని హామీ ఇచ్చి ఇలా చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో పాటు నగరంలో పలు చోట్ల టీడీపీకి చెందిన పలువురు ఓటర్లు ఆందోళనకు దిగారు.  

మరిన్ని వార్తలు