రాజధాని రైతులను రెచ్చగొడుతున్నారు

31 Dec, 2019 03:39 IST|Sakshi

వారి మాటలు నమ్మవద్దు

ఐదేళ్లలో చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేయలేదు

ఇంగ్లిష్‌ మీడియంపై ప్రజల్లో సానుకూలత

నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే సీఎం జగన్‌ను కలిశా 

టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌ రావు  

సాక్షి, అమరావతి: రాజధాని రైతులను కొందరు రెచ్చగొడుతున్నారని, వారి మాటలు నమ్మొద్దని కోరుతున్నానని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు చెప్పారు. ఐదేళ్లలో రాజధాని అమరావతిని చంద్రబాబు అభివృద్ధి చేయలేదన్నారు. సోమవారం మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌తో కలిసి  మద్దాలి గిరి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్లలో రాజధాని అమరావతిని ఎంత అభివృద్ధి చేశామన్న విషయంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఆయన హయాంలో రాజధానికి కేవలం రూ.5 వేల కోట్లే ఖర్చు చేశారన్నారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే రూ.లక్ష కోట్లుపైనే కావాలని చెప్పారు. రైతులకు ఏం చేశామా అన్న విషయం గురించి బాబు ఆలోచన చేసుకోవాలని సూచించారు. రాజధానిపై సీఎంకు స్పష్టమైన వైఖరి ఉందన్నారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయన్నారు. రాజధానులపై ప్రభుత్వం హై పవర్‌ కమిటీ వేసిందని, కమిటీ నివేదిక అనంతరం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు.

ఆంగ్ల మాధ్యమంపై చంద్రబాబు ద్వంద్వ వైఖరి 
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఏర్పాటుపై ప్రజల్లో అనుకూలత ఉందని, ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం దీనిపై ద్వంద్వ వైఖరితో ఉన్నారని మద్దాలి గిరి చెప్పారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే సీఎం జగన్‌ను కలిశానని చెప్పారు. స్పందించిన సీఎం అక్కడికక్కడే రూ.25 కోట్లు నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను సీఎం వైఎస్‌ జగన్‌ సమర్థంగా అమలు చేస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా పార్లమెంట్‌ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా