నాయకా.. తగునా!

10 Feb, 2018 06:52 IST|Sakshi
బి.కె.పార్థసారథి

నియోజకవర్గ ఓటర్లపై ఎమ్మెల్యే పార్థసారథి బూతు పురాణం

ఇతర పార్టీల నాయకులనూ వదలని వైనం

తరచూ విచక్షణ కోల్పోయి అసభ్యపదజాలం

చర్చనీయాంశంగా టీడీపీ జిల్లా అధ్యక్షుని వైఖరి

ఈ... కొడుకులను చెప్పుతో కొట్టి అరెస్టు చేసి నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టండి. వీళ్లను వదలొద్దు. తమాషా చేస్తారా? వాళ్ల సంగతి చూడు.’
♦ ఈ నెల 8న పెనుకొండలో ధర్నా చేస్తున్న విపక్షనేతపై బీకే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు
... నా కొడకా, అవతారం చేస్తావా? ...మూసుకుని ఉండవోయి. ఈ నా కొడుకును తీసుకెళ్లి కేసులు పెట్టండి. అప్పుడు తెలుస్తాది.’
ఇంటింటికీ టీడీపీలో బ్రహ్మసముద్రంలో సొంత పార్టీ కార్యకర్తపై పార్థుడి దురుసు
బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి విచక్షణ మరిచి రెచ్చిపోతున్న వైనమిది. ఓట్లేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటున్న తీరిదీ. నరం లేని నాలుక పలుకుతున్న బూతు పురాణమిది. అడ్డూఅదుపు లేకుండా.. రాయలేని భాషను ఉపయోగిస్తున్న తీరు ప్రజల్లోనే కాదు.. రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది.

సాక్షి ప్రతినిధి, అనంతపురం:ఆ ఎంపీ.. ఈ ఎమ్మెల్యే అంతే. నోటికి ఏది వస్తే అది.. ఏది తోస్తే అది అనేయడమే. ఇప్పటి వరకు టీడీపీలో ఆ ఇద్దరికే పరిమితమైన నోటి దురుసును మరో ఎమ్మెల్యే అందిపుచ్చుకున్నారు. పెనుకొండ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బి.కె.పార్థసారథి వ్యవహారం అందరినీ కలవరపరుస్తోంది. ఓటమి భయమో.. పార్టీ తీరుతోనే ఆయన ఇటీవల కాలంలో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. బూతులు తిట్టడం.. కేసులు నమోదు చేయండని పోలీసులను పురమాయించడం చూస్తుంటే ప్రజాస్వామ్యం ఏమైపోతుందనే చర్చకు తావిస్తోంది. ఇటీవల ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో పార్థసారథి సోమందేపల్లి మండలం బ్రహ్మసముద్రంలో పర్యటించారు. అప్పుడు జగన్‌ అనే టీడీపీ కార్యకర్త గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలో రోడ్లు, మంచినీళ్లు తదితర కనీస సౌకర్యాలు కూడా లేవని.. ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు రావడం, వెళ్లిపోవడం మినహా సమస్యలను పట్టించుకోవట్లేదని వాపోయాడు. ఓట్లేసి గెలిపించిన ఓటరుగా ప్రశ్నించే హక్కు ఆయనకుంది. ఇందుకు బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన ఎమ్మెల్యే పార్థు తీవ్ర పదజాలంతో దూషించిన తీరు అక్కడి ప్రజలను నివ్వెరపోయేలా చేసింది. కేసులు పెట్టండని పోలీసులను పురమాయించడంతో భయాందోళనకు లోనైన ఆ వ్యక్తి పది రోజులకు పైగా గ్రామం విడిచి వెళ్లి హిందూపురంలో తలదాచుకోవడం గమనార్హం.

బంద్‌ సమయంలోనూ బూతులు
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఈనెల 8న సీపీఐ, సీపీఎంతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో వామపక్ష పార్టీల నేతలు పెనుకొండలోని అంబేద్కర్‌ సర్కిల్‌కు చేరుకున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే పార్థసారథి కారులో అటుగా వచ్చి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నిల్చున్నారు. అక్కడ కారుకు అడ్డంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష నేతలు నినాదాలు చేశారు. కొందరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గళంవిప్పారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే వారిని బూతులు తిడుతూ నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేయాలని సీఐ శ్రీనివాసులును ఆదేశించారు. బ్రహ్మసముద్రం, పెనుకొండలోనే కాదు చాలా సందర్భాల్లో పార్థసారథి ఇలా విచక్షణ కోల్పోయి మాట్లాడారు. దీనిపై నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఎఫ్‌ఐ, వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నేతలు పెనుకొండలో పార్థసారథి దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు.

మరిన్ని వార్తలు