టీడీపీకి వంశీ ఝలక్‌ 

29 Oct, 2019 09:28 IST|Sakshi

సాక్షి, విజయవాడ : జిల్లా తెలుగుదేశం పార్టీలో భారీ కుదుపు.. 2019 ఎన్నికల్లో కృష్ణాజిల్లా నుంచి ఎన్నికైన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలలో ఒకరైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ ఆ పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ.. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకి వాట్సాప్‌లో లేఖ పంపారు. అయితే ఎమ్మెల్యే పదవిని, పార్టీని వీడవద్దంటూ ఎంపీ కేశినేని శ్రీనివాస్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ద్వారా వంశీని బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

రెండుసార్లు ఎమ్మెల్యే..
గన్నవరం ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీమోహన్‌ రెండుసార్లు గెలుపొందారు. వల్లభనేని అరుణా మెమోరియల్‌ ట్రస్టు ద్వారా గన్నవరంలో సేవా కార్యాక్రమాలు ప్రారంభించిన వంశీ 2009లో గన్నవరం టీడీపీ టికెట్‌ ఆశించారు. అయితే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థిగా లగడపాటి రాజగోపాల్‌పై పోటీగా బరిలోకి దింపారు. ఈ ఎన్నికల్లో వంశీ పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత విజయవాడ అర్బన్‌ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినప్పటికీ తిరిగి గన్నవరం రాజకీయాలపై దృష్టి సారించారు. 2014లో గన్నవరం టీడీపీ సీటు సంపాదించి గెలుపొందారు. 2019లో తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాజీ మంత్రి దేవినేని ఉమాను ఆయన తీవ్రంగా విభేదించారు. 

ఒకటితో సరి..
2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభంజనం ముందు టీడీపీ యోధులంతా మట్టికరిచారు. అయితే గన్నవరం నుంచి వల్లభనేని వంశీ మోహన్, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దెరామ్మోహన్‌ మాత్రం గెలిచి టీడీపీ పరువు నిలబెట్టారు. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా పేరుపొందిన జిల్లాలో ఎంపీ కేశినేని నాని తర్వాత ఈ ఇద్దరు నేతలే కీలకమయ్యారు. ప్రస్తుతం వంశీ పార్టీకి రాజీనామా చేయడంతో జిల్లాలో ఎమ్మెల్యేల సంఖ్య ఒకటికి పడిపోయింది. ప్రస్తుతం టీడీపీ వ్యవస్థాపకుడు  ఎన్టీఆర్‌ సొంత జిల్లాలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. 

చంద్రబాబుకు వాట్సాప్‌లో లేఖ..
వంశీమోహన్‌ తాను పార్టీ వీడేందుకు గల కారణాలను వాట్సాప్‌లో ఇప్పటి వరకు రెండు లేఖల్లో తెలియజేశారు. వీటిపై చంద్రబాబు స్పందిస్తున్నారు. పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండమంటూ వంశీకి సర్థి చెప్పే ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో ఎంపీ కేశినేని శ్రీనివాస్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలను రంగంలోకి దింపి వంశీని బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కాగా తాను పార్టీ పదవుల్ని, ఎమ్మెల్యే పదవిని వదిలి రాజకీయాలకు దూరంగా ఉంటానని వంశీ చెబుతున్నారు. 

టీడీపీని వీడుతున్న వంశీ అనుచరులు..
గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీకి బలమైన అనుచరగణం ఉంది. ప్రతి మండలంలోనూ ప్రతిగ్రామంలో ఆయనకు అనేక మంది కార్యకర్తలతో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. వారికి ఏ కష్టం వచ్చినా వంశీ ఆదుకుంటారనే నమ్మకం కార్యకర్తల్లో ఉంది. అయితే ఇప్పుడు వంశీ తెలుగుదేశం పార్టీనీ వీడుతూ ఉండటంతో ఆయనతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, ఆయన అనుచరులు పార్టీని వీడుతున్నారు. దీంతో గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి భారీగా నష్టం వాటిల్లనుంది. 

మరిన్ని వార్తలు