బాబుతో భేటీకి 10 మంది డుమ్మా

16 Nov, 2019 04:07 IST|Sakshi

ఫోన్లు చేసి పిలిచినా పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరు

సాక్షి, అమరావతి:  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మరోసారి ఝలక్‌ ఇచ్చారు. విజయవాడలో ఇసుక దీక్షకు గైర్హాజరై తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసిన పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం చంద్రబాబు నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి సైతం డుమ్మా కొట్టారు. చంద్రబాబుతో సమావేశానికి పది మంది ఎమ్మెల్యేలు దూరంగా ఉండటం గమనార్హం. తాను నిర్వహించిన ఇసుక దీక్షకు ఒకేసారి 15 మంది ఎమ్మెల్యేలు రాకపోవడంతో ఆందోళన చెందిన చంద్రబాబు వెంటనే శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

ఇది ముఖ్యమైన సమావేశమని, అధినేత కీలక అంశాలపై మాట్లాడతారని, తప్పనిసరిగా రావాలని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ముఖ్య నేతలు ఒకటికి రెండుసార్లు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసినా పది మంది గైర్హాజరయ్యారు. దీక్షకు బలవంతంగా వచ్చిన ఎమ్మెల్యేలు కూడా పట్టుమని పది నిమిషాలు కూడా వేదికపై ఉండకపోవటంతో చంద్రబాబు కంగు తిన్నట్లు నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన వారిలో సగం మందికిపైగా ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉండడంతో టీడీపీలో అన్ని స్థాయిల్లో గందరగోళం కనిపిస్తోంది.

చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, పీజీవీఆర్‌ నాయుడు (గణబాబు), అనగాని సత్యప్రసాద్, బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, బాలకృష్ణ, బెందాళం అశోక్, వల్లభనేని వంశీ హాజరు కాలేదు. గన్నవరం ఎమ్మెల్యే వంశీని సస్పెండ్‌ చేయాలని సమావేశంలో నిర్ణయించి షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. వంశీ గతంలోనే టీడీపీకి రాజీనామా చేసినా సస్పెండ్‌ చేయడం ద్వారా పార్టీ పరువు కాపాడుకునే ప్రయత్నం చేసినట్లు నేతలు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు