తెలుగు సినిమా వాళ్లకి అంత సీన్‌ లేదు

21 Mar, 2018 01:57 IST|Sakshi

హైదరాబాద్‌లో బానిస బతుకులు బతుకుతున్నారు 

ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ ఫైర్‌ 

సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా పోరాటంపై తెలుగు సినిమా పరిశ్రమకు ఏ మాయరోగం వచ్చింది? చేవ తగ్గిపోయిందా? రూ.వందల కోట్ల కనక వర్షం మత్తులోంచి బయటకు రాలేకపోతున్నారా? అంటూ ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ వై.రాజేంద్రప్రసాద్‌ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ తెలుగు హీరోలకు అంత సీన్‌ లేదని, వారు హాలీవుడ్‌ స్థాయి నటులు కారని, అంతా ఏజ్‌ బార్‌ అయిపోయిన ముసలివాళ్లే ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. తెలుగు డైరెక్టర్లు హీరోయిన్ల అందాలను వర్ణించడానికే పనికొస్తారు తప్ప.. వారికి సామాజిక స్పృహ, బాధ్యత లేవని దుయ్యబట్టారు.

తెలుగు సినిమా కళాకారులు హైదరాబాద్‌లో బానిస బతుకులు బతుకుతున్నారన్నారు. ప్రత్యేక హోదాకు మద్దతు పలికితే తెలంగాణ ప్రజలు హైదరాబాద్‌ నుంచి తన్ని తరిమేస్తారని, ఆస్తులు లాక్కుంటారని భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. తమిళనాడులో జల్లికట్టు కోసం సినీపరిశ్రమంతా ఒక్కతాటిపైకి వచ్చి ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తే ఇక్కడి కళాకారులు మాత్రం ఏసీ గదుల్లో కులుకుతున్నారంటూ ఆరోపించారు. అవార్డులు రాకపోతే లొల్లి చేసే వీరు రాష్ట్రానికి నిధులు రావడం లేదన్న విషయం చెవులకు ఎక్కడం లేదా? మీ కళ్లకు కనపడటం లేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలుగు సినిమా పరిశ్రమ హోదా ఉద్యమంలో పాల్గొనాలని లేకపోతే 5 కోట్ల మంది ఆంధ్రులు తెలుగు సినిమా కళాకారులను వెలివేయడానికి వెనుకాడరంటూ హెచ్చరించారు.   

మరిన్ని వార్తలు