ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతా

12 Mar, 2019 09:06 IST|Sakshi

విలేకరుల సమావేశంలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి

అనంతపురం, రాయదుర్గం : పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను, నాయకులను మంత్రి కాలవ శ్రీనివాసులు అవమానించారు..దాడులు చేయించారు..అక్రమంగా కేసులు పెట్టించారు..అందుకే వారంతా ఆయనపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. టీడీపీ టిక్కెట్‌ కాలవకే కేటాయించడంతో ఈ సారి ఎన్నికల బరిలో దిగాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకు రాయదుర్గంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నా...మంత్రి కాలవను ఓడించి తీరుతా’’ అని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఆయన  ‘చేయూత’ ట్రస్ట్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి కాలవ శ్రీనివాసులు తనకు కావాల్సిన వారిని మాత్రమే అమరావతికి తీసుకెళ్లి  నియోజకవర్గ రివ్యూలో తనకు అనుకూలంగా చెప్పించుకున్నాడన్నారు.

టీడీపీలోనే మంత్రి కాలవపై 20 నుంచి 30 వేల మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. అలాగే దీపక్‌ రెడ్డి వర్గం అనే భావనతో నియోజకవర్గంలో ఎంతో మంది టీæడీపీ నాయకులపై మంత్రి కాలవ అక్రమ కేసులు బనాయించారని, దాడులు చేయించారని ఆరోపించారు. గత ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఉన్న తనపై, తన కార్యకర్తలపై దాడులు చేసిన  వైఎస్సార్సీపీ నాయకుడైన పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి వర్గానికి ఇస్తున్న ప్రాధాన్యత మంత్రి కాలవ టీడీపీ వారికి ఇవ్వడం లేదని దుమ్మెత్తిపోశారు.  మంత్రి నియోజకవర్గంలోని టీడీపీలో వర్గాలు ఏర్పాటు చేస్తున్నాడని, తన కోటరీలో దొంగలకు ఇస్తున్న ప్రాధాన్యత ఇస్తున్నాడన్నారు. అందువల్లే కార్యకర్తల నిర్ణయం మేరకు ఇండింపెండ్‌ంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యానన్నారు. రెండురోజుల్లో కార్యకర్తల అభిప్రాయం మేరకు తుది నిర్ణయం వెల్లడిస్తానన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు పసుపులేటి రామాంజనేయులు, మహాబలి, ఆదెప్ప, మారెన్న , చంద్రశేఖర్‌ రెడ్డి, ఓబనాయక, జయరాములు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు