వాళ్లకు ఓట్లు వేయలేదట–డబ్బులు ఇచ్చేయాలట!!

16 Apr, 2019 10:41 IST|Sakshi

రికవరీ వేటలో పడ్డ తెలుగుదేశం నాయకులు

తిరగబడుతున్న ఓటర్లు

చిత్తూరు, గుడిపాల: మండలంలోని ఓటర్లు అధిక సంఖ్యలో వైఎస్సార్‌ సీపీకి ఓట్లు వేశారని, తమ పార్టీకి వేయలేదని, కాబట్టి తాము ఇచ్చిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు రికవరీ వేటలో పడ్డారు. అయితే, ఓటర్లు నిష్కర్షగా తిరస్కరించారు. వారిపై మండిపడ్డారు.  ఈ ఘటన మండలంలోని పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 205లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఈ పోలింగ్‌బూత్‌లో పిళ్లారికుప్పం, వెప్పాలమానుచేను, పిళ్లారికుప్పం ఆదిఆంధ్రవాడకు సంబంధించి 999మంది ఓటర్లు ఉన్నారు. ఈ బూత్‌లో ఎక్కువగా బీసీ కులస్తులున్నారు. మొత్తంగా ఇక్కడ 852 ఓట్లు పోలయ్యాయి.  ఇక్కడ గతంలో టీడీపీపికి ఈ బూత్‌ కంచుకోటగా ఉండేది.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్, నవరత్నాల పథకాలకు  చాలామంది వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గుచూపారు. వీరందరూ వైఎస్సార్‌ సీపీకే అధికంగా ఓట్లు వేశారనే అనుమానంతో టీడీపీ నాయకులు కుతకుతలాడిపోయారు. సోమవారం ఆయా గ్రామాల్లోని ఓటర్ల వద్దకు వెళ్లి తాము ఇచ్చిన డబ్బులు ఇచ్చేయాలంటూ అల్టిమేటం ఇచ్చారు. దీంతో ఓటర్లు వారిపై తిరగబడ్డారు. ‘మేము ఓటు వేసింది మీరేమైనా చూశారా?..మీ చేతి నుంచి ఏమైనా డబ్బులు ఇచ్చారా?.. ఎవరో ఇచ్చిందాన్ని మీరిచ్చారు..ఎన్నికలై పోయాయి.. ఇంకెందుకు మేము డబ్బులు ఇస్తాం..’’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీన్‌ రివర్స్‌ అయ్యేసరికి టీడీపీ నేతలు కంగుతిన్నారు. నేతలు ఇచ్చిన డబ్బులు పంపిణీ చేసి, చివరకు ఇలా అయినకాడికి రాబట్టుకుని, జేబులు నింపుకుందామని తలచిన ఆ నేతలకు ఓటర్లు ఇలా షాక్‌ ఇవ్వడంతో నిరాశతో వెనుదిరిగారు. అంతేకాకుండా పలు గ్రామాల్లో డబ్బులు పంపిణీ చేసినా వైఎస్సార్‌ సీపీకే ఓట్లు వేశారో ఆయా చోట్ల కొంతైనా డబ్బులు తిరిగి రాబట్టుకోవాలని టీడీపీ నేతలు యోచిస్తున్నట్టు సమాచారం. తెలుగుదేశం నాయకులు ఇలానే వేధిస్తే త్వరలో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తగిన బుద్ధి చెబుతామని ఆయా గ్రామాలు తేల్చి చెబుతుండడంతో మింగలేక కక్కలేక కిక్కురుమంటున్నారట!! 

మరిన్ని వార్తలు