అవంతి పోకతో మొదలు.. టీడీపీకి చెదలు

15 Feb, 2019 12:56 IST|Sakshi
పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన దేవరాపల్లి ఎంపీపీ భాస్కరరావ

ఇటు బాబు రాకడ.. అటు అవంతి పోకడ

ఎంపీ రాజీనామాతో టీడీపీ కుదేలు

అధికార పార్టీని కకావికలం చేసిన 

ఆయన విమర్శనాస్త్రాలు

నా రాజీనామా ఉత్తరాంధ్రలోటీడీపీకి మరణ శాసనం : అవంతి

బాబు బాగోతాలు బయటపెడతానని హెచ్చరిక

తాజా పరిణామాలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో హుషారు

పు చూసి బలుపుగా భావిస్తూ.. తమ పార్టీ విశాఖలో ఓ రేంజ్‌లో ఉందని లెక్కలు వేసుకుంటున్న తెలుగుదేశం పెద్దలకు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు రూపంలో గట్టి షాక్‌ తగిలింది. సరైన సమయంలో గురి చూసి కొట్టినట్లు.. ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరడం టీడీపీలో పెను కలకలమే రేపింది. వెళుతూ వెళుతూ.. తెలుగుదేశం పార్టీలోనూ, పాలనలోనూ ఉన్న డొల్లతనాన్ని, టీడీపీ నీచ రాజకీయాలను. చంద్రబాబు కురచబుద్ధిని బయటపెడుతూ ఆయన సంధించిన విమర్శనాస్త్రాలు పార్టీ నేతలకు చెంప ఛెళ్లుమనేలా తగిలాయి. యాధృచ్ఛికమే కావొచ్చు గానీ.. సరిగ్గా ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనకు ఇలా విశాఖకు వచ్చిన సమయంలోనే..  అటు అవంతి టీడీపీకి, ఆ పార్టీ ద్వారా గెలిచిన ఎంపీ పదవికి రాజీనామా చేసి బాబుకు ఝలక్‌ ఇచ్చారు.

వాస్తవానికి అవంతి పార్టీ మారడంపై ఎప్పటినుంచో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. పార్టీ మారే సమయంలో లాంఛనప్రాయంగా కండువా కప్పుకుని.. సోసోగా ఏదో మాట్లాడేస్తారనే అందరూ భావించారు.
కానీ అవంతి.. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత బాబు సర్కారు అవినీతి, అక్రమాలపై నిప్పులు చెరిగిన తీరు చూసి టీడీపీ శ్రేణులే కంగుతిన్నాయి.

ఇక్కడితో ఆపను.. ఇప్పుడే మొదలైంది.. టీడీపీ అవినీతి బండారం మొత్తం బయటపెడతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.పార్టీ మారొద్దని స్వయంగా సీఎం చంద్రబాబే నన్ను ఎన్నో రకాలుగా ప్రలోభపెట్టారు.. అవన్నీ చెబితే బాగోదంటూ బాబు నైజాన్ని చెప్పకనే చెప్పిన అవంతి చేరిక.. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో హుషారు నింపగా.. ఊహించని షాక్‌తో టీడీపీ శ్రేణులు కుదేలయ్యాయి. 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్‌ అవంతి శ్రీనివాసరావు.. అవంతి విద్యాసంస్థల అధినేతగా 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ప్రజారాజ్యం పార్టీ తరఫున భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధిగా అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే తెలుగుదేశం సర్కారు ప్రత్యేక హోదా డిమాండ్‌పై యూటర్న్‌ తీసుకుని ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన క్షణం మొదలు ఆయన అసంతృప్తి రాగం వినిపిస్తూనే వచ్చారు. ఇక విశాఖ రైల్వే జోన్‌పై పార్టీ నిర్ణయాలతో సంబంధం లేకుండా వ్యక్తిగత అజెండాతో వివిధ రూపాల్లో విశాఖలోనూ, దేశ రాజధాని ఢిల్లీ లోనూ ఆందోళనలు నిర్వహిస్తూ వచ్చారు.

టీడీపీ గత ఏడాది నుంచి మళ్లీ ప్యాకేజీ వద్దంటూ ప్రత్యేక హోదా డిమాండ్‌తో చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొంటూనే పార్టీ నిబద్ధతను ప్రశ్నించారు. ఇక కొంతకాలంగా టీడీపీ విధాన నిర్ణయాలు, అవినీతి, అక్రమాలపై లోపాయికారీగా తీవ్ర వ్యతిరేకత కనుబరుస్తూనే వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా డిమాండ్‌ కోసం రాజీలేని పోరాటం, టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై, ప్రజాసమస్యలపై అలుపెరుగని ఉద్యమపంథాతో సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో లాంఛనంగా చేరారు. వైఎస్‌ జగన్‌ పార్టీ కండువా వేసి అవంతిని సాదరంగా ఆహ్వానించారు.

టీడీపీ కుదేలు
సామాజికవర్గ సమీకరణల నేపథ్యంలో అవంతి శ్రీనివాసరావు రాక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో హుషారు నింపగా, టీడీపీ వర్గాలు మాత్రం కుదేలయ్యాయి. సరిగ్గా సీఎం చంద్రబాబునాయుడు విశాఖ పర్యటనకు వచ్చిన రోజునే జిల్లాకు చెందిన ఎంపీ ప్రభుత్వ నిర్ణయాలను, బాబు వ్యవహారశైలిని తప్పుపడుతూ పార్టీని వీడటాన్ని టీడీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇప్పటి వరకు వైఎస్సార్‌ జిల్లా, ప్రకాశం జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఉత్తరాంధ్ర నుంచి తొలి అడుగుగా అవంతి చేరడం, ఆయనే స్వయంగా నాది మొదలే.. సిద్ధంగా ఎంతోమంది ఉన్నారు.. అని వ్యాఖ్యానించడం టీడీపీ వర్గాల్లో గుబులు రేపుతోంది.

‘అవంతి రాక శుభపరిణామం’

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి అవంతి శ్రీనివాసరావు రాక శుభ పరిణామంగా పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. గురువారం అవంతి చేరిక కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, జిల్లా నేతలు గుడివాడ అమర్‌నా«థ్, తైనాల విజయ్‌ కుమార్, మళ్ల విజయప్రసాద్, కరణం ధర్మశ్రీ, ఎంవీవీ సత్యనారాయణ, అదీప్‌రాజ్, సరగడం చిన అప్పలనాయుడు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు