బలం లేనిచోట బరిలోకి దింపుతారా..!

19 Mar, 2019 09:15 IST|Sakshi

టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఆవేదన..!

సాక్షి, అమరావతి : ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పోటీకి దిగుతున్న అధికార టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. టీడీపీ ఓటమి ఖాయమన్న చోట సీట్లిచ్చారని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ సామాజిక వర్గం ఎక్కువగా లేని చోట బలవంతంగా బరిలోకి దింపుతున్నారని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులు శిద్ధా రాఘవరావు, బీద మస్తాన్‌రావు, సత్యప్రభ, వి. శివరామరాజు ఆవేదనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక బీసీలకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని అరిగిపోయిన రికార్డులు ప్లే చేసే చంద్రబాబు సీట్ల కేటాయింపులో వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేకపోయారు. ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు 7 ఎంపీ సీట్లు కేటాయించగా.. టీడీపీ మాత్రం 5 సీట్లే ఇచ్చింది. బీసీలు అత్యధికంగా ఉన్న రాజమండ్రి, విజయనగరం, కర్నూలు ఎంపీ సీట్లను బీసీలకు కాకుండా అగ్రవర్ణ నేతలకు కేటాయించారని పార్టీ శ్రేణులు చంద్రబాబు తీరుపై ఆందోళన వ్యక్త చేస్తున్నాయి. అశోక్‌ గజపతిరాజు-విజయనగరం, కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి-కర్నూలు, మాగంటి రూప-రాజమండ్రి నుంచి పోటీ  చేస్తున్నారు.

మాజీ ఎంపీకి షాకిచ్చిన బాబు..
నిన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉండి చంద్రబాబును ఏకిపారేసిన అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ టీడీపీలో చేరారు. అయితే, ఎంపీ టికెట్‌ హామీతో పచ్చపార్టీలో చేరిన హర్షకుమార్‌కు బాబు షాకిచ్చారు. ఆయనకు ఎటువంటి టికెట్‌ కేటాయించలేదు. అమలాపురం టికెట్‌ను గంటి హరీష్‌కు కేటాయించారు. ఇక టీడీపీలో చేరే సందర్భంలో హర్షకుమార్‌ చంద్రబాబు కాళ్లపై పడడంపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
(హర్షకుమార్‌ పాదపూజపై.. నెట్టింట ఆగ్రహం)

మరిన్ని వార్తలు