చంద్రబాబు వద్ద తేలని నాని పంచాయితీ

5 Jun, 2019 21:05 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ ముగిసింది. స్వయంగా చంద్రబాబుతో భేటీ అయినప్పటికీ విజయవాడ కేశినేని నాని పంచాయితీ తేలలేదు. చంద్రబాబు బుజ్జగించినప్పటికీ పార్లమెంటరీ విప్‌ పదవిని నాని తిరస్కరించినట్లు తెలుస్తోంది. విప్‌ పదవి నిరాకరించడంతో పాటు, గత కొన్ని రోజులుగా తనపై జరుగుతున్న ప్రచారాలను చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న ప్రచారంపై బాబుకు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. విప్‌ పదవికి తాను అర్హుడిని కాదని, పదవి తీసుకునేది లేదని చంద్రబాబుకు నాని తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో విప్‌ పదవి తీసుకోవడంపై ఇంకా స్పష్టత రాలేదు. 

పార్లమెంటరీ విప్‌ పదవిని తిరస్కరిస్తూ నాని బుధవారం ఉదయం సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా పార్టీ పెద్ద తీరు మారకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గల్లా కుటుంబానికి పార్టీ పొలిట్‌బ్యూరో, పార్లమెంటరీ పదవులు కట్టబెట్టడంతో కేశినేని కినుక వహించినట్టుగా తెలుస్తోంది. తాను బీజేపీలో చేరతానని ప్రచారం జరుగుతున్న సమయంలో తనకు పార్లమెంటరీ విప్‌ ఇవ్వజూపడం పట్ల సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇప్పటికైనా పార్టీలో పనిచేసింది ఎవరు, పెత్తనం చేసింది ఎవరనేది గుర్తించాలని కేశినేని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. టీడీపీ పార్లమెంటరీ పక్ష నేతగా గల్లా జయదేవ్‌ను నియమించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు