రాజ్యసభలో టీడీఎల్పీ బీజేపీలో విలీనం

20 Jun, 2019 16:49 IST|Sakshi

ఇక టీడీపీకి మిగిలింది ఇద్దరు ఎంపీలే

 

సాక్షి, న్యూఢిల్లీ : మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా మారింది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి తేరుకోకముందే ఆ పార్టీకి మరో భారీ షాక్‌ తగిలింది. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు ఆ పార్టీని వీడారు. రాజ్యసభ సభ్యులు ఎంపీలు సుజనా సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు బీజేపీలో చేరనున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభలో తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుకు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు నలుగురి సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్‌కు అందజేశారు. జాతి ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు తమను ఆకర్షించాయని లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగా ఆయన నాయకత్వంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ 4 వ పేరగ్రాఫ్‌లో పేర్కొన్న అంశాలను అనుసరించి తమ పార్టీ సభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీకి ఇక ఇద్దరు రాజ్యసభ సభ్యులు మాత్రమే మిగిలారు. కాగా విజయవాడ ఎంపీ కేశినేని కూడా టీడీపీని వీడి బీజేపీలో చేరతారని ఢిల్లీ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా... తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో టీడీపీ కాపు నేతలు రహస్యంగా సమావేశమైన సంగతి తెలిసిందే. దాదాపు 20 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే పార్టీ ఓటమికి గల కారణాలను సమీక్షించేందుకే సమావేశమయ్యామని వారు చెబుతున్నా.. పార్టీలో అంతర్గత సంక్షోభానికి ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదే విధంగా చంద్రబాబు సూచనల మేరకే తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు