క్రాస్‌ ఓటింగ్‌తో గట్టెక్కారు!

26 May, 2019 03:42 IST|Sakshi

శ్రీకాకుళంలో రామ్మోహన్, గుంటూరులో ‘గల్లా’, విజయవాడలో ‘కేశినేని’

స్వల్ప మెజార్టీలతో విజయం సాధించిన టీడీపీ ఎంపీ అభ్యర్థులు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, అమరావతి బ్యూరో/ గుంటూరు : రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్‌ ప్రభంజనంలో టీడీపీ ఎంపీ అభ్యర్థులందరూ కొట్టుకుపోయినా ముగ్గురు మాత్రం తక్కువ మెజారిటీతో గట్టెక్కారు. ఇందుకు ప్రధాన కారణం క్రాస్‌ ఓటింగేనని పోలింగ్‌ సరళిని బట్టి అర్ధమవుతోంది. శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు ఎంపీ ఫలితాలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. శ్రీకాకుళం సిట్టింగ్‌ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారు. 2014 ఎన్నికలలో రామ్మోహన్‌నాయుడు 1,27,692 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఇచ్ఛాపురం, టెక్కలిలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే క్రాస్‌ ఓటింగ్‌ కారణంగా రామ్మోహన్‌ గట్టెక్కారు. 

- ఇచ్ఛాపురం నియోజకవర్గంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బెందాళం అశోక్‌కు 79,405 ఓట్లు వస్తే రామ్మోహన్‌కు 82,640 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిరియా సాయిరాజ్‌కు 71,931 ఓట్లు వస్తే ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు కేవలం 68,570 ఓట్లు వచ్చాయి. ఈ ప్రకారం 3,361 ఓట్లు క్రాసింగ్‌ జరిగింది. 
-  పలాసలో గెలుపొందిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ సీదిరి అప్పలరాజుకు 75,357 ఓట్లు రాగా ఎంపీ అభ్యర్థి దువ్వాడకు కేవలం 65,939 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే.. 9,418 ఓట్లు తగ్గిపోయాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషకు 59,873 ఓట్లు రాగా రామ్మోహన్‌కు 68,813 ఓట్లు వచ్చాయి. 
- రామ్మోహన్, దువ్వాడ శ్రీనివాస్‌ ఇద్దరికీ సొంత ప్రాంతమైన టెక్కలి నియోజకవర్గంలో కూడా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినా స్వల్పమే. 
- పాతపట్నం నియోజకవర్గంలో విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రెడ్డి శాంతికి 75,669 ఓట్లు రాగా, ఇక్కడ దువ్వాడకు 70,698 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి కలమట వెంకటరమణకు 60,975 ఓట్లు రాగా రామ్మోహన్‌కు 64,656 ఓట్లు వచ్చాయి. నరసన్నపేటలో గెలుపొందిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌కు 85,622 ఓట్లు రాగా దువ్వాడకు 80,855 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడి టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి 66,597 ఓట్లు రాగా రామ్మోహన్‌కు 72,890 ఓట్లు వచ్చాయి. 
- శ్రీకాకుళం నియోజకవర్గంలో విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుకు 82,388 ఓట్లు రాగా దువ్వాడకు 75,253 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవికి 77,575 ఓట్లు రాగా రామ్మోహన్‌కు 84,631 ఓట్లు వచ్చాయి. ఆమదాలవలస నియోజకవర్గంలో గెలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాంకు 76,801 ఓట్లు రాగా, దువ్వాడకు 74,781 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్‌కు 63,274 ఓట్లు రాగా రామ్మోహన్‌కు 62,722 ఓట్లు మాత్రమే వచ్చాయి.  మొత్తం మీద 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో రామ్మోహన్‌నాయుడు గట్టెక్కారు. 

గుంటూరు లోక్‌సభ పరిధిలో..
గుంటూరు పార్లమెంట్‌ విషయానికొస్తే.. ఇక్కడి వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి కూడా క్రాస్‌ ఓటింగ్‌ కారణంతోనే ఓటమి పాలయ్యారు. ఇక్కడ గుంటూరు వెస్ట్‌ మినహా మిగతా ఆరు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఆరు చోట్లా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు 53,731 ఓట్ల మెజార్టీ వచ్చింది. మోదుగులకు మాత్రం ప్రత్యర్థి గల్లా జయదేవ్‌ కంటే 4,205 ఓట్లు తక్కువగా వచ్చాయి. సుమారు 55 వేల ఓట్ల మేర క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. మరో విచిత్ర విషయం ఏమిటంటే.. గుంటూరు పార్లమెంట్‌ పరిధిలో  సుమారు 10వేల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు చెల్లనివిగా కౌంటింగ్‌ అధికారులు తేల్చి పక్కన పడేశారు. అందుకు కవర్‌పై 13–సీ నంబరు లేకపోవడమే కారణంగా చెబుతున్నారు. కవర్‌లో ఉన్న పోస్టల్‌ బ్యాలెట్‌లో తప్పులు లేనప్పుడు అవి లెక్కించాలంటూ మోదుగుల పట్టుబట్టినప్పటికీ అధికారులు అంగీకరించలేదు.

విజయవాడలోనూ ఇంతే..
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామతో పాటు విజయవాడ నగరంలోని సెంట్రల్, పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల కంటే టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అటొక ఓటు.. ఇటొక ఓటు వేసిన ఫలితంగా వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వీరప్రసాద్‌ ఓటమి పాలయ్యారు. 
- విజయవాడ నగరంలోని సెంట్రల్, పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున పోటీచేసిన అభ్యర్థులకు మొత్తం 1,21,460 ఓట్లు రాగా.. కేశినేనికి మాత్రం 1,43,307 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ అభ్యర్థులతో పోలిస్తే కేశినేని నానికి 21,847 ఓట్లు అదనంగా లభించాయి. 
- ఇక జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లోనూ  క్రాస్‌ ఓటింగ్‌ ద్వారా కేశినేని లబ్ధిపొందారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు 3,40,369 ఓట్లు రాగా, కేశినేని నానికి 3,48,652 ఓట్లు లభించాయి. అసెంబ్లీ అభ్యర్థుల కంటే ఎంపీ అభ్యర్థికి 8,283 ఓట్లు అదనంగా వచ్చాయి. ఇదే నాలుగు నియోజకవర్గాల పరిధిలోని వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థులకు మొత్తం 3,79,516 ఓట్లు లభించగా, ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థి పొట్లూరి వీరప్రసాద్‌కు 3,64,744 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ అభ్యర్థులతో పోలిస్తే పొట్లూరికి 14,772 ఓట్లు తగ్గాయి. క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందనడానికి ఇవే తార్కాణాలు. 

>
మరిన్ని వార్తలు