సీనియర్‌కు ఇదా గౌరవం?

25 Sep, 2018 12:17 IST|Sakshi

బొజ్జలకు అనారోగ్యం సాకుగా చూపుతున్న సీఎం

ఎస్సీవీ నాయుడి అభ్యర్థిత్వంపై మొగ్గు

అధిష్టానం నుంచి సంకేతాలు ఇప్పటికే ఆయనకు కాంట్రాక్టుల అప్పగింత

సాక్షి, చిత్తూరు, తిరుపతి: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఈసారి పార్టీ టికెట్‌ ఇచ్చే అవకాశాలు కనిపించ లేదు. జిల్లాలో నాలుగైదు అసెంబ్లీ నియోజక వర్గాలు మినహా మిగిలిన స్థానాలకు అభ్యర్థులను సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రకటించిన నియోజకవర్గాల్లో శ్రీకాళహస్తి ఒకటి. ఈ నియోజకవర్గానికి చెందిన  బొజ్జల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. ఎన్టీఆర్‌ హయాం నుంచి పార్టీలో ఉన్నారు.  మామకు వెన్నుపోటు పొడిచిన సమయంలో చంద్రబాబు పక్షాన కీలకభూమిక పోషించిన వారిలో ఈయన ఒకరు. అలిపిరి సంఘటనలో గోపాలకృష్ణారెడ్డి కూడా తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. 1999 నుంచి 2014 ఎన్నికల వరకు ఆరు పర్యాయాలు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2004లో మినహా అన్నిసార్లూ గెలిచారు. అలాంటి సీనియర్‌ నాయకుడ్ని మంత్రి పదవి నుంచి ముఖ్యమంత్రి తప్పించారు. దీంతో ఆయన పార్టీలో ముభావంగా ఉన్నారు. ఇదే తరుణంలో సీఎం ఆయనపై మరో పిడుగు వేశారు. వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పేరు  ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తన సామాజిక వర్గానికి చెందిన వారిని తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారనిటీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

బొజ్జలకు మొండిచేయి..
బొజ్జల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీన్ని సాకుగా చూపించి ఎస్సీవీ నాయుడికి టికెట్‌ ఇచ్చేందుకు సీఎం సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం తెలిసి బొజ్జల కుమారుడు సుధీర్‌రెడ్డి సీఎం చంద్రబాబును కలిసి తన తండ్రికే తిరిగి టికెట్‌ ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది. అయినా అధిష్టానం నుంచి ఎటువంటి స్పందనా కనిపించలేదు. ఇప్పటికే ఎస్సీవీ నాయుడికి కాంట్రాక్టు పనులు కట్టబెట్టారనే ప్రచారం జరుగుతోంది. రాజధాని అమరావతితో పాటు జిల్లాలో సుమారు రూ.300 కోట్లు విలువ చేసే పనులు అప్పజెప్పారని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎంత ఖర్చైనా పెట్టుకునేలా ఎస్సీవీ నాయుడుకి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది. ఇబ్బందుల్లో ఉన్న బొజ్జలకు అండగా నిలవాల్సిందిపోయి పక్కనబెట్టడంపై గోపాలకృష్ణారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జక్కంపూడి రామ్మోహన్‌రావు మంత్రిగా ఉన్నారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టినా మంత్రిగానే కొనసాగించటంతో పాటు జక్కంపూడి కుటుంబానికి వైఎస్సార్‌ అండగా నిలిచారని టీడీపీ కార్యకర్తలే గుర్తు చేసుకోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు