అనంత బాబుకు పట్టదంట

16 Mar, 2019 10:51 IST|Sakshi

గత ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో పూర్తిగా భిన్న వాతావరణం

12 సీట్లలో టీడీపీని గెలిపించిన ‘అనంత’కు తీరని అన్యాయం  

హంద్రీ–నీవా పారుతున్నా ఆయకట్టుకు నీరు ఇవ్వని వైనం

సాగునీరు అందించే డిస్ట్రిబ్యూటరీలను రద్దు చేస్తూ జీవో

ప్రజా ఉద్యమాలతో బలం పుంజుకున్న వైఎస్సార్‌సీపీ

అనంతపురం జిల్లాను టీడీపీకి కంచుకోటగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు అభివర్ణిస్తుంటారు. గత ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 12 సీట్లు, రెండు ఎంపీ స్థానాలు టీడీపీ ఖాతాలోనే పడ్డాయి. అయితే టీడీపీ మాత్రం ‘అనంత’కు తీరని అన్యాయం చేసింది. దేశంలో జైసల్మీర్‌ తర్వాత కరువుతో కొట్టుమిట్టాడే ‘అనంత’లో కనీసం సాగునీటి వసతి కూడా కల్పించలేదు. పారిశ్రామికాభివృద్ధిని విస్మరించారు. గత 58 నెలల్లో 273 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉపాధిలేక ఏటా 4 లక్షలమంది పొట్టకూటి కోసం కేరళ, కర్నాటక, తమిళనాడుకు వలసెళ్లుతున్నారు. దీంతో ప్రభుత్వంపై ‘అనంత’ వాసులు రగిలిపోతున్నారు. ఎం.రవివర్మసాక్షి ప్రతినిధి,అనంతపురం

జిల్లాలో అనంతపురం, హిందూపురం పార్లమెంట్‌ స్థానాలు ఉన్నాయి. ‘అనంత’ పార్లమెంట్‌ పరిధిలో అనంతపురం, శింగనమల, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం అసెంబ్లీ స్థానాలున్నాయి. ‘పురం’ పార్లమెంట్‌ పరిధిలో హిందూపురం, మడకశిర, పెనుకొండ, రాప్తాడు, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి అసెంబ్థీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కదిరి, ఉరవకొండ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు చాంద్‌బాషా, విశ్వేశ్వరరెడ్డి గెలుపొందారు. అయితే ఎన్నికల తర్వాత చాంద్‌బాషా కదిరి నియోజకవర్గ ప్రజల తీర్పును తాకట్టుపెట్టి ‘సైకిల్‌’ ఎక్కారు. మడకశిర ఎమ్మెల్యే ఈరన్నపై హైకోర్టు అనర్హత వేటు వేసి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రకటించింది.

వంచించిన చంద్రబాబు
గత ఎన్నికల్లో టీడీపీకి తిరుగులేని మెజార్టీని అందించిన జిల్లా ప్రజలను చంద్రబాబు వంచించారనే భావన సర్వత్రా ఉంది. ముఖ్యంగా సాగునీటి విషయంలో జిల్లాను మోసం చేశారు. 2012 నుంచి హంద్రీ–నీవా ద్వారా జిల్లాకు కృష్ణాజలాలు వస్తున్నాయి. 2014లో టీడీపీ అధికారం చేపట్టింది. ఏటా సగటున 25 టీఎంసీలు నీళ్లు వస్తున్నా ఆయకట్టుకు నీళ్లివ్వలేదు.
డిస్ట్రిబ్యూటరీలు రద్దు చేయాలని 2015 ఫిబ్రవరిలో జీఓ 22 జారీ చేశారు. ఈ కారణంగా 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు పొలాలను బీళ్లుగా పెట్టుకున్నారు. దీంతోపాటు పారిశ్రామిక అభివృద్ధిని కూడా నిర్లక్ష్యం చేశారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెట్టే ఒడిస్సీ సంస్థతో సైన్సు సిటీ స్థాపనకు ఒప్పందం చేసుకున్నారు. హిందూపురం నియోజకవర్గంలో పారిశ్రామికాభివృద్ధికి లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ను ఏర్పాటుచేశారు. ఇక్కడికి నీరు అందించేందుకు సోమశిల బ్యాక్‌వాటర్‌ నుంచి పైపులైన్‌ నిర్మాణ పనులు చేపట్టారు. వైఎస్‌ హయాంలోనే 25శాతం పనులు కూడా పూర్తయ్యాయి. చంద్రబాబు మాత్రం ఐదేళ్లలో పారిశ్రామిక అభివృద్ధికి ఏమాత్రం దోహదపడలేదు.  గత ప్రభుత్వ హయాంలో ‘అనంత’లో విమానాశ్రయం ఏర్పాటుకు బీజం పడినా చంద్రబాబు ముందుకు తీసుకెళ్లలేకపోయారు.  

అనంతపురం
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ప్రభాకర్‌చౌదరి 9,234 ఓట్లతో గెలుపొందారు. అయితే ఇప్పడు పరిస్థితి మారిపోయింది. చౌదరిని మార్చాలని ఎంపీ జేసీ పట్టుబడుతున్నారు. జేసీ వర్గంతో పాటు మాజీ ఎంపీ సైఫుల్లా, సీనియర్‌ నాయకులు, కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గంలో బలం పుంజుకుంది. మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి నియోజకవర్గం మొత్తం పర్యటించారు.దీంతో  వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి.

హిందూపురం
హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో 16,196ఓట్లతో గెలిచారు. అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఎమ్మెల్యేగా బాలకృష్ణ పేరుతెచ్చుకున్నారు.  ఐదేళ్లలో ఒక్క జన్మభూమి కార్యక్రమానికి కూడా హాజరుకాలేదు. మైనార్టీ ఓట్లు ఇక్కడ నిర్ణయాత్మక శక్తి! ఇక్కడి నుండి వైఎస్సార్‌సీపీ తరఫున మైనార్టీ నేతను బరిలోకి దించాలని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది.   

 శింగనమల
ఎమ్మెల్యేగా యామినీబాల కొనసాగుతున్నారు. తల్లి శమంతకమణి (ఎమ్మెల్సీ)తో కలిసి అక్రమంగా సంపాదించారనే ఆరోపణలున్నాయి.బండారు శ్రావణికి టికెట్‌ ఇవ్వాలని ఎంపీ జేసీ పట్టుబడుతున్నారు. మాజీ మంత్రి శైలజానాథ్‌ను టీడీపీలోకి ఆహ్వానించి టిక్కెట్‌ ఇవ్వాలని భావించినా, ఓడిపోయే స్థానం తనెందుకని ఆయన తేల్చిచెప్పారు.  మరోవైపు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి పాదయాత్ర చేసి ప్రజలకు చేరువయి గెలుపు దిశగా దూసుకుపోతున్నారు.   

మడకశిర   
గత ఎన్నికల్లో టీడీపీ నేత ఈరన్న గెలుపొందారు. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో వ్యక్తిగత సమాచారం తప్పుగా చూపించారని హైకోర్టు ఆర్నెళ్ల కిందట అనర్హత వేటు వేసింది. దీంతో వైఎస్సార్‌సీపీ నేత తిప్పేస్వామి కొనసాగుతున్నారు.  తక్కువ ఖర్చుతో నియోజకవర్గంలో వైద్యం అందిస్తూ మంచిపేరు తెచ్చుకున్నారు.  

 గుంతకల్లు
గత ఎన్నికల్లో విజయం సాధించిన జితేంద్రగౌడ్‌కు ఈ దఫా ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ ఇచ్చే పరిస్థితి లేదు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ గుప్తాకు టికెట్‌ ఇచ్చే యోచనలో పార్టీ ఉంది. గుప్తాకు టిక్కెట్‌ ఇస్తే జితేంద్ర ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.  మరోవైపు వైఎస్సార్‌సీపీ నేత వెంకట్రామిరెడ్డి నియోజకవర్గంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగారు. సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలకు అండగా నిలబడ్డారు.

పెనుకొండ
పెనుకొండ ఎమ్మెల్యేగా బీకే పార్థసారథి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శంకర్‌నారాయణపై 17,415ఓట్లతో గెలుపొందారు. పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి 2014లో పెనుకొండ నుంచి బరిలోకి దిగి 16,494 ఓట్లు చీల్చగలిగారు. దీంతో సారథి గెలిచారు. శంకర్‌నారాయణ సౌమ్యుడిగా ప్రజల్లో ఒకటిగా కలిసిపోతున్నారు. బీకే సొంత మండలం రొద్దంతో పాటు ఇటీవల భారీగా ఈ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీలోకి చేరికలు పెరిగాయి.

రాయదుర్గం
2014లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి మంత్రి కాలవ శ్రీనివాసులు చేతిలో 1758 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎంపీగా పనిచేసిన కాలవ తొలిసారి 2014లో ‘దుర్గం’ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాలవ విజయంలో మెట్టు గోవిందరెడ్డి కీలకం. తర్వాత మెట్టును నిర్లక్ష్యం చేశారని ఆయన ఇటీవలే  వైఎస్సార్‌సీపీలో చేరారు. మరోవైపు ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కాలవను ఓడిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే  వైఎస్సార్‌పీపీ అభ్యర్థి ‘కాపు’ విజయం ఖాయమైనట్లేనని స్పష్టమవుతోంది. 

కళ్యాణదుర్గం, ఉరవకొండ
కళ్యాణదుర్గం నుంచి హనుమంతరాయచౌదరి గత ఎన్నికల్లో గెలుపొందారు. నియోజకవర్గంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కురబ సామాజికవర్గానికి చెందిన ఉషాశ్రీ చరణ్‌  వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు చౌదరికి కుమారుడు మారుతి రూపంలో ‘సన్‌ స్ట్రోక్‌’ తగిలింది. అవినీతితో నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టించారని చంద్రబాబు టికెట్‌ నిరాకరించారు. మరోవైపు పీసీసీ చీఫ్‌ రఘువీరా ఇక్కడి నుంచి బరిలో ఉంటున్నారు. ఆయన కోసం టీడీపీ బలహీనమైన అభ్యర్థిని పోటీలో పెట్టే అవకాశం ఉందని సమాచారం.
ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సాధారణ వ్యక్తిగా జనంలో కలిసిపోయే మనిషి. సాగునీటి కోసం, నియోజకవర్గంలో ఇళ్లపట్టాల కోసం అలుపెరుగని పోరు, దీక్షలు చేశారు. మరోవైపు పయ్యావుల కేశవ్‌ టీడీపీ నుంచి బరిలోకి దిగనున్నారు.

 రాప్తాడు, ధర్మవరం
రాప్తాడు నియోజకవర్గం నుంచి మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అధికారం దక్కిన తర్వాత  తమ్ముళ్లు, కుటుంబసభ్యులను ఇన్‌చార్జ్‌లుగా నియమించి సామంతపాలన సాగించారు. ఈ దఫా ఎన్నికల్లో కుమారుడు పరిటాల శ్రీరాం బరిలోకి దిగుతున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి నిత్యం జనాల్లోనే ఉంటున్నారు. పరిటాల కోటపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేస్తామని ధీమాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఉన్నాయి.« దర్మవరంలో 2014లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై టీడీపీ నేత వరదాపురం సూరి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆర్నెళ్లపాటు ప్రత్యర్థులను నరికిచంపుకోవచ్చని, కేసులు లేకుండా తాను చూసుకుంటానని సూరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మరోవైపు కేతిరెడ్డి ‘గుడ్‌మార్నింగ్‌’ ధర్మవరం పేరుతో ప్రజలను చైతన్యం చేశారు. చేనేతల తరఫున నిత్యం పోరాటాలు చేస్తున్నారు.

తాడిపత్రి
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014 వరకూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పేరం నాగిరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీని భుజాన వేసుకుని నడిపించిన కాకర్ల రంగనాథ్, గుత్తా వెంకటనాయుడు, జగదీశ్వర్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, ఫయాజ్‌ బాషాలు జేసీ బ్రదర్స్‌ను విభేదించి టీడీపీని వది లారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు అస్మిత్‌రెడ్డి ఈ దఫా ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. మరోవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డిని సమన్వయకర్తగా నియమించిన తర్వాత నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది.

 కదిరి: రెడ్లు, ముస్లిం సామాజికవర్గానికి చెందిన ఓటర్లు నియోజకవర్గంలో దాదాపు లక్షమంది ఉన్నారు. అత్తార్‌చాంద్‌బాషా 2014లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత అతను టీడీపీకి ఫిరాయించారు.  ఈ దఫా ఎన్నికల్లో  మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. మరోవైపు సౌమ్యుడిగా పేరున్న వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్‌ సిద్ధారెడ్డి నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  

పుట్టపర్తి
2014 ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం పల్లె రఘునాథరెడ్డి మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించడం, కార్యకర్తలను పట్టించుకోలేదనే కారణంతో ద్వితీయ శ్రేణి నేతలతో పాటు కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. వైఎస్సార్‌సీపీ తరఫున దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి బరిలో నిలవనున్నారు. మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్‌రెడ్డి కూడా వైఎస్సార్‌సీపీలో కొనసాగుతున్నారు. ఇది పార్టీకి అదనపు బలం.

మరిన్ని వార్తలు