టీడీపీ మైండ్‌గేమ్‌!

7 Mar, 2019 03:50 IST|Sakshi

ఐటీ గ్రిడ్స్‌ వివాదం నుంచి తప్పించుకునేందుకు పన్నాగం

ఫిబ్రవరి 23 నుంచి వేధిస్తున్నారంటూ లోకేశ్‌ ట్వీట్‌

తెలంగాణ పోలీసులపై టీడీపీ అభిమానుల ఆరోపణలు

అశోక్‌ 23నే ఏపీకి పారిపోయాడని పోలీసుల అనుమానం

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ గ్రిడ్స్‌ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఓవైపు తెలంగాణ పోలీసులు ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా భావిస్తోన్న ఆ సంస్థ డైరెక్టర్‌ అశోక్‌ కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం, టీడీపీ నేతలు.. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులపై మానసిక దాడికి సిద్ధమవుతున్నారు. కేసు దర్యాప్తును నీరుగార్చేందుకు నకిలీ ట్వీట్ల ద్వారా (క్యాష్‌ ఫర్‌ ట్వీట్‌) తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించారని కేటీఆర్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనికితోడుగా ఇప్పుడు నేరుగా తెలంగాణ పోలీసులపై ఏపీ ప్రభుత్వ పెద్దలు మాటల దాడి మొదలెట్టారు. (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!)

లోకేశ్‌ ట్వీట్‌
తమ సేవామిత్ర యాప్‌ను నిర్వహిస్తోన్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై తెలంగాణ పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ‘మార్చి 2న ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే.. ఫిబ్రవరి 23న ఆ కార్యాలయంలో పోలీసులు ఎందుకున్నార’ని ప్రశ్నిస్తూ.. సీసీటీవీ చిత్రాలను జతచేశారు. ఈ కేసు విషయంలో తెలంగాణకు చెందిన ఓ సీనియర్‌ పోలీసు అధికారిపైనా టీడీపీ వర్గీయులు దాడి ప్రారంభించారు. ఆ అధికారి గతంలో కడపలో విధులు నిర్వహించినపుడు పోలీస్‌ హౌసింగ్‌ సొసైటీలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సోషల్‌మీడియాలో విమర్శలు మొదలుపెట్టారు.

వీటిని విపరీతంగా వైరల్‌ చేస్తూ తెలంగాణ పోలీసుల ప్రతిష్టకు మరకలంటించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజా ఏపీ కేబినెట్‌ సమావేశంలోనూ ఓ మంత్రి లేవనెత్తడం గమనార్హం. జరుగుతున్న పరిణామాలు, విమర్శలను తెలంగాణ పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. తెలుగుదేశం నేతల కామెంట్లను లైట్‌ తీసుకుంటున్నారు. తమ దర్యాప్తును దెబ్బతీసేందుకే ఇలాంటి విమర్శలుచేస్తున్నారని అంటున్నారు. (ఇదీ జరుగుతోంది!)

23న అసలేం జరిగింది?
వాస్తవానికి తమకు అందిన ఫిర్యాదుపై విచారణ జరిపేందుకు ఫిబ్రవరి 23న అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్‌ సంస్థలోకి వెళ్లిన విషయం వాస్తవమే అని సైబరాబాద్‌ పోలీసులు అంగీకరిస్తున్నారు. తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా అసలు ఆ చిరునామాలో ఐటీ గ్రిడ్స్‌ అనే కంపెనీ ఉందా లేదా? అనే విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు పోలీసులు 23న మధ్యాహ్నం 4.30 గంటలకు ఆ కంపెనీకి వెళ్లారు. అక్కడ అశోక్‌తోపాటు అతని సహోద్యోగులను కొన్ని ప్రశ్నలు అడిగారు. మీపై ఫిర్యాదు వచ్చిందని, మీరు 25న స్టేషన్‌కు రావాల్సి ఉంటుం దని మౌఖికంగా ఆదేశించారు.

మరోసారి అశోక్‌కు ఫోన్‌చేద్దామని సాయంత్రం పోలీసులు ప్రయత్నించగా.. అతని ఫోన్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది. అయినా సోమవారం (25వతేదీ) వస్తాడులే అని పోలీసులు అనుకున్నారు. కానీ, జరిగింది వేరు. సేవామిత్రపై ఫిర్యాదు అందగానే.. అప్రమత్తమైన అశోక్‌ హార్డ్‌ డిస్కులతోపాటు ఏపీకి పరారయ్యాడు. అక్కడ నుంచి సేవామిత్ర యాప్‌ లో సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి తిరిగి అప్‌లోడ్‌ చేయించాడు. 

మరిన్ని వార్తలు